మళ్లీ గూడుపుఠాణి!
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:41 AM
కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్లకే ఒక రిటైర్డ్ ఐఏఎస్ హైదరాబాద్‌లోని తన నివాసానికి కొందరు ఏపీ ఐఏఎస్‌లను పిలిపించుకొని జగన్‌కు ఎలా సహకరించాలో గీతోపదేశం చేశారు.
జగన్ దూతగా రిటైర్డ్ ఉన్నతాధికారి.. పలువురు ఐఏఎస్‌లతో రహస్య భేటీ
కూటమి సర్కారులో ఏం జరుగుతోంది?.. ప్రభుత్వంపై బురదజల్లడం ఎలా?
కీలక సమాచారం అందించండి.. మరికొందరినీ మనవైపు తిప్పండి
ఆ రిటైర్డ్ అధికారి ‘కర్తవ్య బోధ’.. రెండు గంటలు సాగిన మాటామంతీ
ఆ ఐఏఎస్‌లలో అంతా కార్యదర్శి స్థాయివారే!
వారంతా ఐఏఎస్‌లు, మరికొందరు ఉన్నతాధికారులు! ప్రభుత్వ విధానాల రూపకల్పనలో, వాటి అమలులో కీలక పాత్ర పోషించాల్సిన వారు! జగన్ హయాంలో అడ్డగోలు పనులకు సహకరించి వివాదాస్పదులయ్యారు! ఇప్పుడు... మళ్లీ జగన్ కోసం గూడుపుఠాణీ ప్రారంభించారు. జగన్ హయాంలో ఉన్నతస్థాయి పదవి నిర్వహించి రిటైర్ అయిన ఒక మాజీ ఐఏఎస్ వీరందరినీ కూడగట్టారు. రహస్య భేటీ నిర్వహించారు. ‘ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? సర్కారును ఎలా బద్నాం చేయాలి? ఎలా దెబ్బతీయవచ్చు? మాకు కావాల్సింది చెప్పండి... మీకు కావాల్సింది తీసుకోండి’’ అనే ధోరణిలో సర్వీసులో ఉన్న కొందరు ఐఏఎస్‌లతో ముచ్చట్లు మొదలుపెట్టారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్లకే ఒక రిటైర్డ్ ఐఏఎస్ హైదరాబాద్‌లోని తన నివాసానికి కొందరు ఏపీ ఐఏఎస్‌లను పిలిపించుకొని జగన్‌కు ఎలా సహకరించాలో గీతోపదేశం చేశారు. ఈ వ్యవహారాన్ని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో కంగుతిని మీటింగ్‌లు ఆపారు. ఇప్పుడు మళ్లీ గూడుపుఠాణీ భేటీలు మొదలుపెట్టారు. ఈసారి మరో అధికారి ఆ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ సర్వీసులో సుదీర్ఘకాలం పనిచేసి, అత్యున్నత పదవుల్లో ఉండి పదవీ విరమణ చేసిన ఆ ఐఏఎస్ అధికారి జగన్ ‘దూత’గా రంగప్రవేశం చేశారు. ఐఏఎస్‌లలో తనకున్న పరిచయాలు ప్రయోగించారు. తమతో కలిసివచ్చే, ఏకీభవించే టీమ్‌ను నిర్మించుకునే ప్రయత్నాలు గట్టిగా ప్రారంభించారు. శుక్రవారం ఆయన విజయవాడకు వచ్చారు.
ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయం సమీపంలో ఉండే ఒక అపార్ట్‌మెంట్ వద్దకు నలుగురైదుగురు ఐఏఎస్‌లను పిలిపించుకున్నారు. ‘మార్నింగ్ వాక్’ చర్చలు నడిపిద్దామని ప్లాన్‌చేశారు. అయితే, అక్కడ సురక్షితం కాదన్న ఉద్దేశంతో మకాం మార్చారు. కృష్ణా నదికి ఆవల విజయవాడ క్లబ్ రోడ్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ను వేదికగా చేసుకున్నారు. దాని యజమాని ఈ రిటైర్డ్ పెద్దాయనకు జిగిరీ దోస్తు. అప్పుడు, ఇప్పుడూ ఈ రిటైర్డ్ అధికారి వ్యవహారాలన్నీ ఆయనే చూస్తుంటారు. ఆయన ఫ్లాటులో కూర్చుంటే ఎవరికంటా పడే అవకాశం ఉండదని భావించారు. కానీ... మ్యాటర్ లీకై పోయింది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ మాటామంతీ మొదలైంది. పదిగంటల దాకా కొనసాగింది.
ఆరేడుగురు ఐఏఎస్‌లతోపాటు మరికొందరు ఉన్నతాధికారులు.. మొత్తంగా డజను మంది ఈ భేటీలో పాల్గొన్నారు. ఆ ఐఏఎస్‌లలో అందరూ కార్యదర్శి స్థాయి అధికారులే కావడం గమనార్హం. అందులో కొందరు జగన్ ప్రభుత్వంలో వెలుగు వెలిగిన వారే ఉన్నారు. ప్రస్తుతం కీలక శాఖల్లో పనిచేస్తున్న వారున్నారు. ప్రభుత్వ పెద్దల అతిముఖ్యమైన శాఖలు చూసేవారు కూడా ఉన్నారు. ‘‘ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? ఎవరెవరితో సంప్రదింపులు జరుగుతున్నాయి? మీ కొలీగ్స్ నుంచి తాజా సమాచారం రాబట్టండి.
కాంట్రాక్టర్లు, ఇతర ప్రముఖులను ప్రభుత్వ పెద్దలు కలుస్తున్నారా? ఎవరెవరితో ఏ సందర్భాల్లో సమావేశాలు జరిగాయి? వాళ్లు ప్రభుత్వంలో చేస్తోన్న పనులు ఏమిటి? ఏయే శాఖల్లో ఏమేం నడుస్తున్నాయి? ప్రభుత్వంపై బురదజల్లేందుకు అవసరమైన సమాచారం మాకు ఇవ్వండి. మీకు ఏం కావాలోం మేం చేసుకుంటాం’’... ఇదీ జగన్ దూతగా వచ్చిన ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఇచ్చిన సందేశం, ఆదేశం, భరోసా! చంద్రబాబు ప్రభుత్వం అధికారులపై కఠినంగా వ్యవరించే అవకాశమే లేదని... ధైర్యంగా ఉంటూ చాపకింద నీరులా జగన్‌కు సహకరించాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
పట్టువదలకుండా... : ‘జగన్ దూత’ ఏడాదికిందటే రహస్య భేటీలకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ, ఆయనను కలవడానికి సర్వీసులో ఉన్న అధికారులు వెనుకంజ వేశారు. అయినా.. ఆయన తన ప్రయత్నాలు ఆపలేదు. పదేపదే సంకేతాలు పంపిస్తూనే ఉన్నారు. దీంతో.. ‘ఒకసారి వెళ్లి కలుద్దాం. ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. ఈలోపు నజరానాలూ రావొచ్చు’ అనే ఆలోచనతో కొందరు ఈ మంతనాల మీటింగ్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఈ భేటీకి ఒక మహిళా అధికారి కూడా వెళ్లారు. ఇంకా ఈ సమావేశానికి వెళ్లిన వారిలో.. జగన్ ప్రభుత్వంలో హల్‌చల్‌చేసిన వారు, ఆయన ద్వారా ప్రత్యక్ష, పరోక్ష లబ్ధి పొందిన వారు, అడ్డగోలు తప్పులు చేసినా భద్రంగా బయటపడిన వారూ ఉన్నారు.