Share News

Telangana New Schemes: రైతన్నలకు గుడ్ న్యూస్.. కొత్త పథకాలు ప్రారంభం

ABN , Publish Date - Jan 09 , 2026 | 02:08 PM

గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన జీవిత లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. దివంగత ఎన్టీఆర్ దీవెనలతో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Telangana New Schemes: రైతన్నలకు గుడ్ న్యూస్.. కొత్త పథకాలు ప్రారంభం
Minister THummala Nageswara Rao

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన జీవిత లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. ఇవాళ (శుక్రవారం) అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో రైతు మేళా కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం, ప్రకృతి వ్యవసాయ పథకాలను మంత్రులు ప్రారంభించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. దివంగత ఎన్టీఆర్ దీవెనలతో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ డీపీఆర్‌లో లేదని ప్రస్తావించారు. తమ ప్రభుత్వంలో కెనాల్స్‌కు నిధులు మంజూరు చేశామని తెలిపారు.


గోదావరి నీళ్లు వస్తాయి..

బీఆర్ఎస్ పాలనలో మూలనపడిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం పున:ప్రారంభోత్సవం చేశామని తెలిపారు. 350 మంది రైతులకు రూ.1.07 కోట్లు విలువైన యాంత్రీకరణ పనిముట్లు పంపిణీ చేశామని వెల్లడించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పథకం ప్రారంభించినట్లు వివరించారు. వ్యవసాయ ఉద్యాన పామాయిల్ సాగుపై శాస్త్రవేత్తలు ఆదర్శ రైతులతో అవగాహన సదస్సు నిర్వహించామని పేర్కొన్నారు. నాలుగో పంప్ హౌస్ నిర్మాణంతో దమ్మపేట, అశ్వరావుపేట మండలాలకు గోదావరి నీళ్లు వస్తాయని వెల్లడించారు. ఆయిల్ ఫామ్‌లో అంతర పంటలుగా కోకూ, జాజి, వక్క, మిరియం, సాగుతో రైతులకు అదనపు లాభాలు వస్తాయని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.


దేశానికే ఆదర్శంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..

దేశానికే ఆదర్శంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ రంగంలో అగ్ర భాగాన ఉండాలని తుమ్మల చెప్పుకొచ్చారు. తెలంగాణలో పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణకు తమ ప్రభుత్వం పట్టుదలగా ఉందని పేర్కొన్నారు. సన్నకారు రైతులకు మేలు చేయాలని వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండుగ రోజు నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 2047 నాటికి 470 బిలియన్ డాలర్స్ వ్యవసాయ రంగం వాటా ఉండేలా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఉందని వెల్లడించారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉత్తమ కళాశాలగా నిలవాలని సూచించారు. పామాయిల్ సాగుతో రైతులకు మహర్దశ వచ్చిందని తెలిపారు. భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆశీస్సులతో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజాసాబ్ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి..

మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 09 , 2026 | 04:34 PM