Minister Thummala: రైతన్నలు యూరియా తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ వైపు మళ్లాలి: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Jan 12 , 2026 | 02:19 PM
పంటలకు యూరియా వాడటం వల్లే నష్టం కలుగుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. యూరియా వాడకం క్రమంగా తగ్గించాలని సూచించారు.
ఖమ్మం జిల్లా , జనవరి 12 (ఆంధ్రజ్యోతి): పంటలకు యూరియా వాడటం వల్లే నష్టం కలుగుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. యూరియా వాడకం క్రమంగా తగ్గించాలని సూచించారు. అన్నదాతలకు పెట్టుబడి ఖర్చు తగ్గాలని, ఆదాయం పెరగాలని పేర్కొన్నారు. ఇవాళ(సోమవారం) రఘునాథపాలెం మండలం చింతగుత్తిలో డ్రోన్ స్ప్రేను మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
పురుగులమందులకు వ్యతిరేకం..
తాను పురుగులమందులకు వ్యతిరేకమని చెప్పుకొచ్చారు మంత్రి తుమ్మల. పంటకు కొట్టాల్సిన దానికంటే ఎక్కువ పురుగులమందు కొట్టి భూమాతను చంపేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాచురల్ ఫార్మింగే ఉత్తమమని.. దీనిపై రైతన్నలు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పురుగులమందుల డూప్లికేట్ కంపెనీలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పంటలకు ఎక్కడ, ఏ తెగులు ఉందని శాటిలైట్ ద్వారా సమీక్షించి రైతుకు చెప్పాలని అనుకుంటున్నామని తెలిపారు. దానికి కొన్ని గ్రామాలను పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకుంటున్నామని వెల్లడించారు.
డ్రోన్ల మీద అవగాహన కల్పించాలి..
అన్నదాతలందరికీ అధికారులు డ్రోన్ల మీద అవగాహన కల్పించాలని సూచించారు. తాను పంటలకు యూరియా వేయనని, యూరియా వేయకపోతే పురుగుమందు వాడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. యూరియా ఎంత కావాలంటే అంత ఇస్తామని, కానీ అది పంట చేలకు అరిష్టమని తెలిపారు. ప్రతిపక్షాలు యూరియా మీద పబ్బం గడపాలని చూస్తున్నాయని విమర్శలు గుప్పించారు. పామాయిల్, కొబ్బరికి డ్రోన్ అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా మిషన్లు కనిపెట్టాలని శాస్త్రవేత్తలను కోరారు. అన్ని దేశాల్లో మన దేశం నంబర్ వన్ అని, అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్ర నంబర్ వన్‌గా ఉండాలనేదే తన ఆకాంక్షని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..
పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ
Read Latest Telangana News And Telugu News