కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఉత్కంఠ
ABN , Publish Date - Feb 14 , 2026 | 09:08 AM
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగగా.. అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. కానీ కొత్తగూడెం కార్పొరేషన్‌లో విషయానికొస్తే అమాంతం పొలిటికల్ హీట్ పెరిగింది.
కాంగ్రెస్, సీపీఐకి సమాన ఫలితాలతో పొలిటికల్ హీట్
ఢీ అంటే ఢీ అంటూ తలపడిన ఇరుపార్టీలు
రెండింటికి చెరో 22 స్థానాలు కట్టబెట్టిన ప్రజలు
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగగా.. అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. కానీ కొత్తగూడెం కార్పొరేషన్‌లో (Kothagudem Corporation) విషయానికొస్తే అమాంతం పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక్కడ 60 డివిజన్లు ఉండటంతో సాయంత్రం వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగగా.. నువ్వానేనా అన్నట్టు తలపడిన కాంగ్రెస్, సీపీఐలకు చెరో 22డివిజన్లు రావడం మరింత ఉత్కంఠను పెంచింది.
కొత్తగూడెం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : కొత్తగూడెం కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 58 స్థానాల్లో పోటీలో ఉండగా, పొత్తు కింద సీపీఎంకు 2 కేటాయించింది. సీపీఐ 57 స్థానాల్లో బరిలో ఉండగా.. టీడీపీ తరపున 3 స్థానాలను కేటాయించింది. బీఆర్‌ఎస్ 58 స్థానాలు, బీజేపీ 53, జనసేన 14, బీఎస్పీ 6, ఇతరులు 15, స్వతంత్రులు 91 మంది అభ్యర్థులు పోటీచేశారు. మొత్తం 60 స్థానాల్లో సీపీఐ, కాంగ్రెస్ చెరొక 22 స్థానాలను దక్కించుకున్నాయి. బీఆర్‌ఎ్‌సకు ఎనిమిది స్థానాలు రాగా, స్వతంత్రులు 6, బీజేపీ, సీపీఎంలకు ఒక్కొక్క స్థానం వచ్చాయి. ఇక్కడ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలు కావాల్సి ఉండగా.. సింగిల్ పార్టీగా మేయర్ పీఠం దక్కే పరిస్థితులు లేదు.
కాంగ్రెస్, సీపీఎం పొత్తులో ఉండగా.. ఆ ఒక్క సీటు మద్దతు లభించినప్పటికీ, కేవలం 23 స్థానాలు మాత్రమే అవుతుండగా.. స్వతంత్ర అభ్యర్ధుల్లో ఒకరికి ఎన్నికల్లో సీపీఐ మద్దతు ప్రకటించింది. దీంతో వారికి కూడా 23 స్థానాలే అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం బీఆర్‌ఎ్‌సకు పార్టీకి వచ్చిన ఎనిమిది స్థానాలు, మరికొందరి స్వతంత్రుల స్థానాలు కీలకంగా మారనున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ సైతం పలువురు స్వతంత్ర అభ్యర్థులతో టచ్‌లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. వాటితో పాటు ఇక్కడ నామినేటెడ్ ఓట్లు కూడా కీలకంగా ఉండనున్నాయి. నామినేటెడ్ కోటా కింద ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న ఎంపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా, ఎమ్మెల్యే సీపీఐకి చెందిన వ్యక్తి ఉన్నారు. దీంతో ఈసారి మేయర్ పీఠం దక్కాలంటే పార్టీలు తీవ్రంగా శ్రమించాల్సిందేనన్న చర్చ జరుగుతోంది.
ఢీ అంటే ఢీ అన్న ఇరు పార్టీలు..
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60డివిజన్లకు సంబంధించి కౌంటింగ్ ఫలితాలు వెలువడగా.. ఇక్కడ 60 టేబుళ్లను ఏర్పాటు చేసి రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేశారు. కొన్ని డివిజన్లు మినహా మిగిలిన డివిజన్లలో సీపీఐ, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడ్డాయి. స్వల్ప మెజార్టీ తేడాతో పదుల సంఖ్యలో డివిజన్లను ఇరు పార్టీలు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొన్ని డివిజన్లలో బీఆర్‌ఎస్ సైతం అదేస్థాయిలో పోటీ ఇస్తూ వచ్చింది. కార్పొరేషన్ పరిధిలో 50ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో తొమ్మిది అభ్యర్థులు గట్టెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటే.. పోటీ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎన్నికలు ఫలితాలు చివరి వరకు కాంగ్రెస్, సీపీఐ మీదనే ఎక్కువ చర్చ జరగ్గా.. చివరలో కార్పొరేషన్ ప్రజలు మాత్రం అదిరిపోయే తీర్పునిచ్చారు.
ఇరుపార్టీలకు సైతం 22 సీట్లు మాత్రమే దక్కడంతో హంగ్ ఏర్పడింది. అయితే ఆ రెండు పార్టీలు ఏకపక్షంగా మేయర్ సీటును దక్కించుకునే పరిస్థితి లేదు. అయితే బీఆర్ఎస్ మాత్రం సీపీఐకి మద్దతు ఇస్తామని తెలిపినప్పటికీ, సీపీఐ మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మేయర్ పీఠంపై తామే కూర్చుంటా మన్న ధీమాను వ్యక్తం చేస్తూనే.. తమతో కలిసి వచ్చేందుకు ప్రజల అభీష్టం మేరకు తమకు మద్దతు తెలిపేవారున్నాంటూ పేర్కొంటున్నారు. ఈ క్రమం లోనే కాంగ్రెస్ తమతో కలిసి వచ్చి వారు డిప్యూటీ మేయర్ తీసుకుంటే సమ్మతమేనా? అని విలేకరులు ఆడిగిన ప్రశ్నకు సహకారం అందిస్తామంటే ఎవరు వద్దంటారంటూ కూనంనేని తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సైతం మ్యాజిక్ ఫిగర్ ను తెచ్చుకునేందుకు అవసరమైన అభ్యర్థులతో టచ్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కొత్తగూడెం కార్పొరేషన్ కింగ్ ఎవరో తెలియాలంటే ఈ నెల 16 వరకు ఆగాల్సిందే..!
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
Read Latest Telangana News And AP News And Telugu News