ఉద్యోగాల పేరుతో మోసం.. భద్రాచలం ఎమ్మెల్యే పీఏపై చీటింగ్ కేసు
ABN , Publish Date - Aug 29 , 2026 | 10:00 AM
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి, అనంతరం నకిలీ నియామక పత్రాలు అందించారనే ఆరోపణలపై భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌పై చీటింగ్ కేసు నమోదైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి, అనంతరం నకిలీ నియామక పత్రాలు అందించారనే ఆరోపణలపై భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఈ వ్యవహారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపుతోంది.
ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలకు సంబంధించిన నకిలీ నియామక పత్రాలు అందించాడని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.8 కోట్ల మేర వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
డబ్బులు చెల్లించిన అనంతరం తమకు ఉద్యోగం వస్తుందని ఆశించామని.. కానీ తమను కల్యాణ్ మోసం చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చాడని బాధితులు ఆరోపించారు. కొంతకాలం తర్వాత కల్యాణ్ అందుబాటులో లేకుండా పోయాడని బాధితులు తెలిపారు. సంబంధిత వ్యక్తి మాయమవడంతో తమ డబ్బులు తిరిగి వస్తాయా? లేదా? అని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో బాధితులు భద్రాచలం ఎమ్మెల్యేను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ నుంచి పీఏ కల్యాణ్ తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించాలని కోరారు. ఉద్యోగాల పేరుతో జరిగిన మోసంపై ఎమ్మెల్యే, పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు తన పీఏగా పనిచేసిన కల్యాణ్‌ను పోలీసులకు సరెండర్ చేయించేందుకు భద్రాచలం ఎమ్మెల్యే సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగాల పేరుతో ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు?, వసూలు చేసిన మొత్తం ఎంత?, నకిలీ నియామక పత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి?, ఈ మోసంలో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు పూర్తయితే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు: మంత్రి తుమ్మల
ఆ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై మంత్రి దామోదర్ సీరియస్
సమగ్ర విశ్లేషణతోనే నేరాల కట్టడి: డీజీపీ సీవీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News