సమ్మెలో మిల్లర్లు.. మూతపడిన 135 మిల్లులు.. ఆగిన మిల్లింగ్..
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:03 PM
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) తిరిగి చెల్లించే విషయంలో కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో రైస్ మిల్లర్లు బెంబేలెత్తుతున్నారు.
విజిలెన్స్ దాడులు..కేసులు నిలిపివేయాలని మిల్లర్ల డిమాండ్
మిల్లులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసన
ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) తిరిగి చెల్లించే విషయంలో కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో రైస్ మిల్లర్లు బెంబేలెత్తుతున్నారు. సీఎంఆర్ తిరిగి ఇవ్వని మిల్లులపై ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తూ కేసులు నమోదు చేయడమే కాకుండా మొండిగా వ్యవహరిస్తున్న మిల్లర్లను జైలు కు సైతం పంపుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్ల సంఘాలు తీవ్రంగా ప్రభుత్వ చర్యను ఖండిస్తూ, మిల్లర్లపై దాడులు ఆపాలని.. కేసులు నిలిపి వేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైస్ మిల్లర్లు సమ్మెలోకి వెళ్లారు.
దీంతో జిల్లాలోని 135 రైస్ మిల్లుల్లో మిల్లింగ్ ఆగిపోయింది. మిల్లులకు తాళాలు వేసి తమతో ధాన్యం మిల్లింగ్ చేయడం కాదని చేతులెత్తేశారు. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయించొద్దని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ధాన్యం నిల్వ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తోంది. జిల్లాలో 135 వరకు రైస్ మిల్లు లుండగా రా రైస్ మిల్లులు 90 మిల్లులు, బాయిల్డ్ రైస్‌మిల్లులు 35వరకు ఉన్నాయి. ఇందులో 42 మిల్లులు సీఎంఆర్ ఇవ్వకపోవడంతో డిఫాల్ట్ మిల్లు లుగా ఉండిపోయాయి.
ప్రభుత్వం బకాయిలు చెల్లిం చని మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్ట్(ఆర్‌ఆర్), ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్(పీడీ) కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలకు పూనుకుంది. దీంతో మిల్లర్లు ఇందుకు నిరసనగా రైస్ మిల్లులపై కేసుల నమోదు, విజిలెన్స్ అధికారుల దాడులను నిలిపియాలని, సీఎం ఆర్ తిరిగి అప్పగించిన మిల్లర్లపై 25 శాతం పెనాల్టీ, 12శాతం వడ్డీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తు న్నారు. ప్రస్తుతం మిల్లులో ఉన్న మూడు సీజన్లకు సంబంధించి సీఎంఆర్ వందశాతం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చిన తర్వాతే ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయించాలని మిల్లర్లు విజ్ఞప్తి చేశారు.
మిల్లర్లు ఇవ్వాల్సిన సీఎంఆర్ 2.82 లక్షల మెట్రిక్ టన్నులు...
జిల్లాలో మూడు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ పెండింగ్‌లోనే ఉంది. 2024-25 సంవత్సరానికి సంబంఽ దించి యాసంగి సీజన్ సీఎంఆర్ ముగించారు. ఇందు లో ఇప్పటికీ 23వేల మెట్రిక్ టన్నుల కస్టమ్‌మిల్లింగ్ రైస్ పెండింగ్‌లోనే ఉంది. తాజాగా రెండు సీజన్లో సీఎంఆర్ సేకరణ మొదలైంది. 2025-26 సంవత్సరం సంబంధించి ఖరీఫ్, యాసంగి సీజన్‌లో మిల్లులకు కేటాయించిన ధాన్యం నుంచి మిల్లర్లు సీఎంఆర్ కింద 3.87లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి సర ఫరా చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు 105189 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చారు.
ఇంకా మిల్లర్ల నుంచి 2లక్షల 82 వేల 574 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. ఇందులో ఖరీఫ్ సీజన్‌లో 180690 మెట్రిక్‌టన్నుల బియ్యానికిగాను 79089మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. 101601 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. యాసంగి సీజన్ సంబం ధించి 207073 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ లక్ష్యంగా ఉండగా ఇప్పటివరకు మిల్లర్ల నుంచి26 వేల 100మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. మిల్లర్లు ఇంకా 180973 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది.
2024- 25 యాసంగి సీజన్ సంబంధించిన గడువు ఇప్పటికే ముగిసిపోవడంతో మరోసారి గడువు పొడిగించాలని మిల్లర్లు కోరుతున్నారు. 2025- 26 సంవత్సరానికి ఖరీఫ్, యాసంగి సీజన్లకు సంబంధించి సీఎంఆర్ గడువు కూడా ఈ నెలలోనే ముగుస్తుంది. ఇంకా మిల్లర్ల నుంచి రెండు సీజన్లకు సంబంధించి 2.82 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండడంతో గడువు పొడిగించాలని, ఇదే సందర్భంలో రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ పూర్తి అయిన తర్వాత ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపులు మిల్లులకు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ధాన్యం అమ్మితే కేసులు.. మరాడిస్తే నష్టం
జిల్లాలో కొందరి మిల్లర్ల పరిస్థితి అయోమయంగా మారింది. కొత్త రైస్‌మిల్లులను ఏర్పాటు చేసి రూ కోట్లలో సంపాదించాలనుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకొని ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆశగా వచ్చిన వారికి నిరాశ ఎదురవుతున్నది. కొత్త మిల్లులు నెలకొల్పిన వారి అంచనాలు తలకిందులై ఆశలు అడియాశలవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి అప్పగించాలంటే నష్టం తప్పడం లేదని వాపోతున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మరాడించి ఇచ్చేందుకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం ఉండేది.
మరో ఆరు నెలల చొప్పున పొడిగిస్తూ రెండేళ్ల వరకు సమయం గడిపేవారు. దీన్ని ఆసరా చేసుకున్న కొంతమంది మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని విక్రయిస్తూ ఒక సీజన్ నుంచి మరో సీజన్‌లో సర్దుబాటు చేసుకునే వారు. గడువు చివరి వరకు ధాన్యాన్ని వాడుకొని చివరి క్షణంలో బియ్యం విలువకు డబ్బులు చెల్లిం చడం ఇతరుల నుంచి కొనుగోలు చేసి పంపించడం చేసేవారు. తాజాగా పరిస్థితులు మారడంతో ప్రధానం గా కొత్త మిల్లర్లు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే రాజ న్న సిరిసిల్ల జిల్లాలో కొందరు మిల్లర్లు ధాన్యం అమ్ము కోవడంతో కేసుల్లో ఇరుక్కున్నారు.
మిల్లర్ల నుంచి టెండర్ ధాన్యం బకాయిలు రూ 86 కోట్ల వరకు రావాల్సి ఉంది. మరోవైపు కష్టమ్ రైస్ మిల్లింగ్ విధానంలో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు మరాడించి క్వింటాల్ వడ్లకు 67కిలోల చొప్పున బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లర్లకి ఇచ్చిన ధాన్యాన్ని మరాడిస్తే కేవలం 40 నుంచి 50 కిలోల బియ్యం వస్తుంది. మిల్లర్లు ఒక లారీ(ఏసీకే) సీఎంఆర్ కింద లోడ్ కోసం 1075 బస్తాల ధాన్యానికి బదు లుగా 1500 బస్తాల ధాన్యాన్ని వినియోగించాల్సి వస్తుంది. ఒక లారీకి అదనంగా 160 బస్తాల పైగా ధాన్యాన్ని మరాడించడం వల్ల రూ 4లక్షల వరకు నష్టం వస్తున్నట్లు మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి
ప్రభుత్వం ఖరీఫ్, యాసంగి సీజన్లకు సంబంధిం చిన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి ధాన్యా న్ని మిల్లులకు కేటాయిస్తూ వస్తోంది. సీఎంఆర్ విషయంలో పలు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, సీఎంఆర్ ప్రభుత్వానికి ఇవ్వకుండా సొమ్ము చేసుకుంటున్నారని దానిపై కొద్ది రోజులుగా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మిల్లర్లు సమ్మెలోకి వెళ్లడం, డిఫాల్ట్ మిల్లర్లు పెరగడంతో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచడానికి రైతు వేదికలు, గోదాములు, మూతబడిన పరిశ్రమలు, కల్యాణ మండపాలు, ప్రభుత్వ భవనాలు ఇతర స్థలాల గుర్తించ డానికి అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
చేపూరి నాగరాజు, బాయిల్డ్ రైస్‌మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలి. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మిల్లర్లపై విజిలెన్స్ అధికా రుల దాడులను నిలిపివేయాలి. ఎఫ్‌సీ ఐకి చెల్లిస్తున్న మిల్లింగ్‌లో నూకలు, పరం, సార్టేక్స్ రిజెక్షన్ కలిపి 15 శాతం నుంచి 20 శాతం వస్తుంది. ఫిజికల్ వెరిఫికేషన్ సమయంలో తరుగును పరిగణలోకి తీసుకోవడం లేదు. మిల్లర్ల వద్ద ఉన్న ఎఫ్‌సీఐ బాయిల్డ్ రైస్ తీసుకోవడం లేదు. ప్రస్తుతం ఉన్న ధాన్యం రా రైస్‌కు ఉపయోగపడే పరిస్థితి లేకపోవడంతోనే మిల్డింగ్ నిలిపి వేశాం.
మిల్లర్లు నష్టపోతున్నారు..
పబ్బ నాగరాజు, రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వం మిల్లులపై కఠినంగా వ్యవహరించడం, మిల్లర్లపై కేసులు నమోదు చేయడం, మిలర్లకు రోజురోజుకు నష్టాలు పెరగడంతోనే రైస్‌మిల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె లోకి వెళ్లారు. మిల్లులపై 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ మాఫీచేయాలి. విజిలెన్స్ దాడులు, మిల్లర్లపై కేసులు నమోదును నిలిపివేయాలి. మిల్లింగ్ సమయంలో ప్రభుత్వం ఇచ్చే ధాన్యం వల్ల సీఎంఆర్ ఇవ్వడంలో ఒక లారీ బియ్యం సరఫరాలు రూ.5 లక్షల వరకు నష్టం వస్తోంది. మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
బ్రాండెడ్ బ్యాగుల్లో రేషన్ రైస్
ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్’ నోటీసులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News