Share News

ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:24 AM

ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం.. ప్రజా సేవకులుగా నిలుద్దామని జిల్లా కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సాధించింది చెబుదాం... సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుదామని వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబర్ 10: ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం.. ప్రజా సేవకులుగా నిలుద్దామని జిల్లా కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సాధించింది చెబుదాం... సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుదామని వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గురువారం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లీడర్‌షిప్, జీఎస్‌డీపీ, తాగునీరు, గృహ నిర్మాణం, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్‌పై చర్చించారు.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 7వ జిల్లా కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను కూడా చర్చించుకుని లక్ష్యానికి చేరువ అవుదామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈసారి లీడర్‌షిప్ అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా చర్చించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో 27 నెలల్లో రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను గాడిన పెట్టామని స్పష్టం చేశారు. రూ.1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ. 1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశామని వివరించారు. రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరిట ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.


హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్ -1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి గుంటూరు, విజయవాడకు రాజధానిని కనెక్టు చేశామని తెలిపారు. ఎకనామిక్ టైమ్స్ పత్రిక సీఈఓ టూ వాటర్‌మాన్ అంటూ కథనం రాసిందని.. ఇది తనకు సంతోషం కలిగించిందన్నారు. గ్లోబల్ డ్రీమ్ కేబినెట్లో తన పేరు వచ్చినప్పుడు, సీఈఓ సీఎం అన్నప్పుడు నేను ఇంత ఆనందించలేదని పేర్కొన్నారు.


రాష్ట్రంలోని భౌగోళిక అసమానతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది... దానిని సరిచేస్తూ ఆయా ప్రాంతాలకు నీటిని ఇవ్వగలిగితే కలిగే సంతోషం వేరుగా ఉంటుందని తెలిపారు. గోదావరి- కావేరీ- మహానది- గంగా లాంటి నదులు అనుసంధానమై వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే భారత అభివృద్ధి అన్ స్టాపబుల్ అని చెప్పారు. ఈ నీటి భద్రత, సంరక్షణా చర్యల్ని గుర్తించి వాటర్ మాన్‌గా పేరు పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.


36 ప్రాజెక్టులు చేపట్టేందుకు క్యాలెండర్ కూడా ఇచ్చామని.. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపారు. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతోపాటు అధికారుల తోడ్పాటుతోనే ఈ విజయాలను సాధించగలిగామని చెప్పారు. ఇప్పటి దాకా సాధించినవి ఏ ఒక్కరి వల్లో సాధ్యం కాలేదన్నారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు.. ఇలా అందరి వల్ల సాధ్యమైందని వివరించారు. ఈ విజయం టీమ్ సక్సెస్ అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.


ప్రతీ శాఖలోనూ సంస్కరణలు..

మనకు ఉన్న అవకాశాలను అన్ లాక్ చేయగలిగామని.. ప్రతీ శాఖలోనూ సంస్కరణలు తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు వివరించారు. గత ప్రభుత్వం నిర్వాకంతో మార్కెట్‌లోకి వచ్చిన జే బ్రాండ్ మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని. చాలా మంది ఆరోగ్యం కూడా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం బ్రాండ్లన్నీ రద్దు చేసి పారదర్శకంగా విక్రయాలు జరిగేలా చూస్తున్నామని తెలిపారు. విద్యుత్ టారిఫ్ పెంచకుండా.. నాణ్యమైన విద్యుత్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతీ నెలా ఆర్ధిక నివేదికను విడుదల చేసి ఎప్పటికప్పుడు లక్ష్యాలను బేరీజు వేసుకుంటున్నామని అన్నారు.


ప్రతీ మూడు నెలలకూ జీఎస్‌డీపీని కూడా లెక్కించి ప్రగతిలో మనం ఎక్కడున్నామో చూస్తున్నామని తెలిపారు. 2022-23 బేస్ ఇయర్‌గా ప్రస్తుత ధరలకు అనుగుణంగా 13.44 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. అలాగే తయారీ రంగంలోనూ అభివృద్ధి నమోదయిందని చెప్పారు. జీఎస్టీ కలెక్షన్స్ కూడా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.25,450 కోట్ల మేర పెరిగిందని పేర్కొన్నారు. మనకు వనరులు ఉన్నాయి.. టెక్నాలజీ అందుబాటులో ఉంది. కానీ కొన్ని చోట్ల లీడర్‌షిప్ లోపం ఉందని వివరించారు.


ఉద్యోగుల సామర్ధ్యం పెంపు కోసం వివిధ కోర్సులు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకూ 1.50 కోట్ల కోర్సులను సామర్ధ్యాలను పెంచేందుకు నిర్వహించామని పేర్కొన్నారు. డీప్ టెక్ గవర్నెన్సు ఉంటే అనూహ్యమైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉందని తెలిపారు. టెక్నాలజీని వినియోగించడం ద్వారా డేటా లేక్, అవేర్ లాంటి వ్యవస్థలతో నిర్ణయాల్లో వేగం పెరగాలి... సేవల్లో నాణ్యత పెంచాలన్నారు. గతంలో 50 ఏళ్లలో చేసే అభివృద్ధిని ఇప్పుడు 10-15 ఏళ్లలోనే సాధించేందుకు ఆస్కారం ఉందని వివరించారు.


రియాక్టివ్ గవర్నెన్సు కంటే ప్రో యాక్టివ్ గవర్నెన్సు ఉండాలని చెప్పారు. ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయంటే అభివృద్ధి-పాలన పెండింగ్‌లో ఉన్నట్లేనని అన్నారు. ప్రభుత్వ సేవలు సక్రమంగా అందినప్పుడే ప్రజల నుంచి సానుకూల స్పందన ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది తీవ్రమైన ఎల్ నినో కారణంగా నీటి భద్రత ఓ సవాలుగా మారిందని తెలిపారు. 54 శాతం లోటు వర్షపాతం ఈసారి రాష్ట్రంలో నమోదైందని గుర్తు చేశారు.


ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు

ఏపీ రైల్వే కనెక్టివిటీకి కేంద్రప్రభుత్వం భారీ బూస్ట్ ఇచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రేణిగుంట - అరక్కోణం మార్గంలో 3, 4వ రైల్వేలైన్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. రూ.1,157 కోట్లతో ఆంధ్రప్రదేశ్ పరిధిలో 46కి.మీ. మేర రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు.

అదనపు రైల్వే లైన్లతో రైళ్ల రద్దీకి చెక్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ ఏపీ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ రైల్వే మౌలిక వసతులకు భారీ ప్రోత్సాహం అందించారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జారిపోతున్నా పట్టువదల్లేదు.. కూల్‌డ్రింక్ బాటిల్ చేజిక్కించుకున్నాడు.. వీడియో వైరల్

చిన్నారిని కోతి ఎలా ఆడించిందో చూశారా?.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 12:48 PM