Share News

బ్రాండెడ్ బ్యాగుల్లో రేషన్ రైస్

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:18 AM

ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం అక్రమార్కుకు సిరులు కురిపిస్తున్నాయి. లబ్ధిదారుల నుంచి రేషన్‌ మాఫియా తక్కువ ధరకు రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తోంది.

బ్రాండెడ్ బ్యాగుల్లో రేషన్ రైస్
ration rice scam

  • రీ సైక్లింగ్‌తో కోట్ల రూపాయల దందాకు పాల్పడుతున్న అక్రమార్కులు

  • వివిధ బ్రాండ్‌ పేర్లతో ఉన్న సంచుల్లో రేషన్‌ బియ్యం రీ ప్యాకింగ్‌

  • మాఫియాకు కాసులు కురిపిస్తున్న సర్కారు సన్న బియ్యం

  • రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు సేకరణ

  • రైస్‌ మిల్లుల్లోనే బ్రాండెడ్‌ నేమ్‌ సంచుల్లోకి చేర్చుతున్న వైనం

  • హసన్‌పర్తిలో విజిలెన్స్‌ దాడులతో గుట్టురట్టు

  • సివిల్‌ సప్లయీస్‌, రెవెన్యూ, పోలీస్‌శాఖల పర్యవేక్షణ కరువు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌)

ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం అక్రమార్కుకు సిరులు కురిపిస్తున్నాయి. లబ్ధిదారుల నుంచి రేషన్‌ మాఫియా తక్కువ ధరకు రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తోంది. అనంతరం ఈ బియ్యాన్ని పాలిష్‌ చేసి, ప్రముఖ బ్రాండ్ల పేరు తో ఉన్న సంచుల్లో నింపుతున్నారు. వీటినే మార్కెట్‌ లో ఒరిజనల్‌ బ్రాండెడ్‌ బియ్యంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటూ రేషన్‌ మాఫియా కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా హసన్‌పర్తిలో విజిలెన్స్‌ అధికారు లు నిర్వహించిన దాడుల్లో బ్రాండెడ్‌ సంచుల్లో రేషన్‌ బియ్యం నిల్వలు బయటపడటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బియ్యం ధరలు పెరగడం, అమ్మకాలపై నియంత్రణ లేకపోవడంతో ఈ దందాకు కలిసి వస్తోందని తెలుస్తోంది.


బ్రాండెడ్‌ బ్యాగుల్లోకి...

బియ్యం బ్యాగుపై ఉన్న బ్రాండెడ్‌ పేరు చూసి కొనుగోలు చేస్తే.. తప్పులో కాలేసినట్టే. మెరిసేదంతా బంగారం కాదన్నట్లుగా బ్రాండెడ్‌ బ్యాగుల్లో కనిపించేవి కూడా ఒరిజనల్‌ బియ్యం కాదనే చర్చ జరుగుతోంది. రేషన్‌ రీసైక్లింగ్‌తో ప్రజలకు కల్తీ బియ్యాన్ని అంటకట్టుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పేదలకు ఇచ్చే రేషన్‌ బియ్యాన్ని కిలోకు రూ.15వరకు ఆయా ఏరియాలను బట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొ నుగోలు చేసిన బియ్యాన్ని ఒకచోట నిల్వ చేసి రాత్రికి రాత్రి రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లకు దళారులు కిలోరూ.35లకు పైగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మిల్లుల్లో రేషన్‌ బియ్యానికి మళ్లీ పాలిష్‌తో కోటింగ్‌ ఇస్తున్నారు. ఆ తరువాత వివిధ కంపెనీల పేరుతో ముద్రించిన సంచుల్లోకి ఈ బియ్యాన్ని నింపేసి, రీప్యాక్‌ చేస్తున్నారు.


ఇలా తయారు చేసిన రేషన్‌ బియ్యాన్ని బ్రాండెడ్‌ పేరు ముద్రించిన సంచుల్లో నింపుతున్నారు. ఇలా నింపిన బియ్యాన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్న బియ్యం దుకాణాలకు తరలించి దళారులు, కొందరు మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మంగళవారం రాత్రి హనుమకొండ జిల్లా హసన్‌పర్తి సమీపంలోని శ్రీలక్ష్మీప్రసన్న రైస్‌మిల్లులో టాస్క్‌ఫో ర్సు అధికారులు దాడులు నిర్వహించి ఈ అక్రమ దందా గుట్టురట్టు చేశారు. ఈ దాడుల్లో మార్కెట్‌లో అత్యంత విలువ ఉన్న శ్రీరామ్‌ (జేఎస్‌ఆర్‌) బ్రాండ్‌ పేరుతో ఉన్న సంచుల్లో రేషన్‌ బియ్యాన్ని రీప్యాకింగ్‌ చేసిన బస్తాలను గుర్తించారు.


వీటితో పాటు 50 కిలోల బరువు ఉన్న 64బస్తాలు, 25కిలోల బరువు ఉన్న 106బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసు కున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రేషన్‌ బియ్యా న్ని సేకరించి, బ్రాండెడ్‌ నేమ్‌ ఉన్న సంచుల్లో రేషన్‌ బియ్యాన్ని రీప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నట్లుగా టాస్క్‌ఫోర్సు అధికారులు గుర్తించారు. బియ్యాన్ని బరువు కొలిచే వెయింగ్‌ మెషిన్‌తో పాటు బస్తాల్లో నింపి కుట్టేసేందుకు ఉపయోగిస్తున్న రైస్‌బ్యాగ్‌ స్టిచింగ్‌ మెషిన్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు.


hnk2.2.jpgవరంగల్‌, కరీంనగర్‌ పూర్వపు జిల్లా కేంద్రాలతో పాటు మునిసిపాలిటీలు, మేజర్‌ గ్రామ పంచాయ తీలకు ఈ కల్తీ బియ్యాన్ని తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక్క క్విం టాల్‌కు రూ.3వేల వరకు లాభం వస్తుందని సమాచారం. ఇలా వేలాది క్విటాళ్ల బియ్యం రీప్యాకింగ్‌తో కోట్లాది రుపాయల అక్రమ వ్యాపారానికి మాఫియా శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది. అయితే ఇది ఒక్క హసన్‌పర్తికే పరిమితం కాలేదని టాక్‌ ఉంది. వరంగల్‌, హనుమకొండ జిల్లాలే కాకుండా ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఇలాంటి దందాలే కోకొల్లలుగా గుట్టుగా జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.


లబ్ధిదారులకు మళ్లీ అవే బియ్యం

ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన సన్న బియ్యాన్ని కొంతమంది లబ్ధిదారుల నుంచి దళారులు కొనుగోలు చేస్తున్నారు. తిరిగి అవే రేషన్‌ బియ్యాన్ని రీప్యాకింగ్‌ చేసి, మళ్లీ అదే ప్రజలకు కిలో రూ.65లకు పైగా విక్రయిస్తున్నారు. అంటే ఉచితంగా వచ్చే రేషన్‌ బియ్యాన్ని కిలో రూ.15కు అమ్ముకుని, తిరిగి బ్రాండెడ్‌ పేరుతో అదనంగా రూ.50లు ఇచ్చి మళ్లీ వాటినే ప్రజలే కొనుగోలు చేస్తూ అవే రేషన్‌ బియ్యాన్ని తింటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. ఈ దళారుల అక్రమ దందాలో అంతిమంగా ప్రజలే నష్టపోతున్నారనే విమర్శలున్నాయి. దీంతో రేషన్‌ మాఫియా ఆగడాలకు నిజమైన బ్రాండెడ్‌ బియ్యంపై ప్రజల్లో నమ్మకం పోతోంది. తాము కొనుగోలు చేసే బియ్యం నిజమైన బ్రాండెడ్‌ కంపెనీవేనా? లేక రీప్యాకింగ్‌ చేసి, బ్యాగులపై బ్రాండెడ్‌ కంపెనీల పేరు ముద్రించి అమ్ముతున్నారా? అనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. దీంతో వినియోగదారులు కూడా షాపుల్లో బియ్యం కొనుగోలు చేయాలంటే భయపడుతున్నారు.


పోలీస్‌, రెవెన్యూ ఫుల్‌ సపోర్టు..?

బియ్యం అక్రమ వ్యాపారానికి ఫుల్‌ సపోర్టుగా నిలుస్తున్నది పొలిటికల్‌, పోలీసు, రెవెన్యూ శాఖ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి తరువాత దళారులు తమ డంప్‌ల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి రేషన్‌ మిల్లులకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడ పోలీసులు వాహనాలు తనిఖీ చేయకుండా, రేషన్‌ బియ్యం వస్తున్న వాహనాల సమాచారం ముందే తీసుకుని వాటిని చూసీచూడనట్లుగా వదిలేయటం వంటి సహకారం ఖాకీలు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వేళలో స్పెషల్‌ పార్టీ పోలీసులు, స్క్వాడ్‌లు రేషన్‌ బియ్యాన్ని పట్టుకుంటే బయట ప్రపంచానికి తెలియకుండా రాత్రికిరాత్రే స్థానిక ఖాకీలే రెవెన్యూ అధికారులతో కలిసి కేసును క్లోస్‌ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.


రేషన్‌ మాఫియా తమ దందా సాగించే ప్రతీ పోలీస్‌ స్టేషన్‌కు నెలనెలా గీతం అందిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూశాఖలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు కూడా ఇలాంటి ఒప్పందాలే చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. భూపాలపల్లి జిల్లాలో అధికారపార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి రేషన్‌ బియ్యాన్ని కొనుగోళ్లలో చక్రం తిప్పుతున్నారనే చర్చ జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతర్జాతీయ అనిశ్చితులు.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్‌’ నోటీసులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 11:19 AM