కొత్త యాప్.. కొత్త కష్టాలు
ABN , Publish Date - Sep 11 , 2026 | 02:06 PM
యూరియా కోసం రైతులకు కొత్త కష్టాలు తప్పడం లేదు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేపట్టగా ఇటీవల దాన్ని మూసివేసి కేంద్ర ప్రభుత్వం ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్‌ను అందు బాటులోకి తీసుకొచ్చారు.
‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’లో అసంపూర్తిగా వివరాలు
ఇబ్బంది పడుతున్న రైతులు
నేరుగా యూరియా ఇవ్వాలని డిమాండ్
కరీంనగర్: యూరియా కోసం రైతులకు కొత్త కష్టాలు తప్పడం లేదు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేపట్టగా ఇటీవల దాన్ని మూసివేసి కేంద్ర ప్రభుత్వం ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్‌ను అందు బాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా యూరియాతో పాటు, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ తదితర ఎరువులను బుక్ చేస్తున్నారు. చాలా మంది వరకు గత యాప్ ద్వారా యూరి యా బస్తాలను వానాకాలం సీజన్‌కు సరిపడా యూరియా తీసుకున్నారు.
కొత్త యాప్‌లో మళ్లీ అన్నిరకాల ఎరువుల పూర్తి కోటాను చూపిస్తుండటంతో కొందరు అదనంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొరత తలెత్తే ప్రమాదం ఉంది. కొత్తగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆధార్ లేదా ఫార్మర్ రిజిస్ర్టీ నంబర్ ద్వారా యాప్‌లో రిజిస్ర్టేషన్ అవుతుంది. గత యాప్ మాదిరిగా కాకుండా ఇందులో రైతులు ఇబ్బందులకు గురవతున్నారు. ఫార్మర్ రిజిస్ర్టీ పూర్తయిన రైతుల భూముల వివరాలు యాప్‌లో కచ్చితంగా చూపుతాయని ప్రభుత్వం పేర్కొన్నా చాలా మందికి సంబంధించిన వివరాలు యాప్‌లో అసం పూర్తిగానే దర్శనమిస్తున్నాయి.
కొందరు రైతుల వివరాలు అసలే కనపించకపోవడంతో ఏఈవోల వద్దకు పరుగెడుతున్నారు. మరో వైపు యాపిల్ తదితర కంపెనీల ఫోన్లలో కేంద్ర ప్రభుత్వ యాప్ డౌన్‌లోడ్ కాకపోవడం, రైతులు యాప్‌ను తెరిచిన ప్రతీసారి ఆధార్ అనుసంధాన ఓటీపీని నమోదు చేయాల్సి రావడం, అన్ని రకాల ఎరువుల బుకింగ్‌ను యాప్‌లో ఒకేసారి చూపుతుండటం సమస్యగా మారింది.

తప్పని నిరీక్షణ..
ఒకే పంట వేర్వేరు సర్వే నంబర్లలో సాగు చేస్తే వేర్వేరుగా బుక్ చేయాల్సి వస్తుండటం తదితర సమస్యలతో రైతులు గంటల తరబడి ఫోన్లతో కుస్తీ పట్టాల్సి వస్తుంది. స్మార్ట్ ఫోన్ లేని రైతులు ఆధార్ ద్వారా ఇతరుల ఫోన్ల నుంచి ఏఈవోల సహాయంతో బుక్ చేసే అవకాశం ఉండగా చాలా మంది తమ ఫోన్ల నుంచి ఇతరులకు బుక్ చేస్తే తమ పరిమితి అయి పోతుందని వెనకాడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50శాతం వరకు కూడా యాప్ రిజిస్ర్టేషన్ పూర్తి కాలేదంటే ఎంత ఇబ్బందిగా ఉందో అర్థం అవుతోంది. గత యాప్‌లో ఒక మండలానికి సంబంధించి దుకాణం మాత్ర మే చూపించేది, కాని ప్రస్తుతం కొత్త యాప్‌లో ఎక్కడెక్కడో ఉన్న దుకాణాలు, జిల్లాలో ఉన్న దుకాణాలు మొత్తం చూపడం ద్వారా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ యాప్‌లో మొదట్లో పలు గ్రామాలు చూపించలేదు.
ప్రస్తుతం అవి చూపిస్తున్న అక్కడి రైతుల భూముల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవడంతో నిరీక్షణ తప్పడం లేదు. యాప్‌లో అవసరమైన ఎరువుల వివరాలు నమోదు చేయగానే సంబంధిత మండలంలో స్టాక్ ఉన్న ఎరువుల దుకాణాలే కనిపిస్తున్నాయి. స్థానికంగా నిల్వలు లేకుంటే దూర ప్రాంతాల్లో దుకాణాల్లో బుక్ చేయాలన్నా సాద్యపడటం లేదు. రైతులకు కావాలసింది యూరియా అయితే యాప్‌లో డీఏపీ, యూరియా, ఇలా మూడు రకాలు టిక్కు పెడితే తప్ప బుక్ కావడం లేదని రైతులు వాపోతున్నారు. యాప్ ద్వారా యూరియా అందించడంపై రైతులు తీవ్రఆగ్రహానికి గురవుతు న్నారు. తమకు యాప్ ద్వారా కాకుండా పాస్ పుస్తకాల ఆధారంగా నేరుగా యూరియా ఇవ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వరంగల్ మార్కెట్లో మక్కలకు రికార్డు ధర
Read Latest AP News And Telangana News And International News And Telugu News