Share News

డీఆర్ఎస్ క్రెడిట్ కొట్టేశావ్‌గా.. వైభవ్‌ను ట్రోల్ చేసిన ఇషాన్ కిషన్

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:14 PM

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీసీసీఐ దేశవాళీ క్రికెట్ విభాగం విడుదల చేసిన వీడియోలో ఇషాన్ కిషన్.. వైభవ్‌ను సరదాగా ఆటపట్టించాడు.

డీఆర్ఎస్ క్రెడిట్ కొట్టేశావ్‌గా.. వైభవ్‌ను ట్రోల్ చేసిన ఇషాన్ కిషన్
Ishan Kishan

ఇంటర్నెట్ డెస్క్: దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా, యువ సంచలనం, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ టోర్నీ మొత్తం వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. బ్యాటింగ్‌తో పాటు నాయకత్వ బాధ్యతల్లోనూ తనదైన ముద్ర వేశాడు. ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ గాయం కారణంగా మైదానంలోకి రాని సమయంలో డిప్యూటీ వైభవ్.. కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డీఆర్ఎస్ విషయంలో వైభవ్ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ఇషాన్ మైదానంలో ఉన్నప్పుడు కూడా రివ్యూ తీసుకోవాలా? వద్దా? అనే విషయంలో అతడు వైభవ్ సలహా తీసుకోవడం వంటి వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా బీసీసీఐ దేశవాళీ క్రికెట్ విభాగం విడుదల చేసిన వీడియోలో ఇషాన్ కిషన్.. వైభవ్‌ను సరదాగా ఆటపట్టించాడు.


‘డీఆర్ఎస్ విషయంలోనూ ప్రతి చోటా క్రెడిట్ అంతా వైభవ్‌కే దక్కింది. నిజానికి రివ్యూ తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. కానీ దగ్గరికి వచ్చి చాలా కాన్ఫిడెంట్‌గా ‘రివ్యూ లే లో భాయ్’ అంటూ చెప్పాడు. అంతే.. ఇంటర్నెట్ అంతా ‘వైభవ్, వైభవ్..’ అంటూ ప్రశంసలు. కెప్టెన్‌గా డీఆర్ఎస్ తీసుకునేది నేను.. క్రెడిట్ అంతా ఈ చిచ్చర పిడుగుకే వచ్చింది’ అంటూ ఇషాన్ సరదాగా వైభవ్‌ను ట్రోల్ చేశాడు. దీనికి వైభవ్ సూర్యవంశీ కూడా ఇషాన్‌కు స్టన్నింగ్ రిప్లై ఇచ్చాడు. ‘మీరు ఉన్నప్పుడు రివ్యూ తీసుకోమని చెప్పింది నేనే.. కానీ గాయంతో పెవిలియన్‌లో ఉన్నప్పుడు డీఆర్ఎస్ తీసుకున్నది ఎవరు? అది కూడా చెప్పండి’ అంటూ వైభవ్ చురక వేశాడు. వైభవ్ ఇచ్చిన సమాధానానికి ఇషాన్ కూడా ఫిదా అయ్యాడు.


‘అవును.. అప్పుడు కూడా వైభవే రివ్యూలు తీసుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. అతడిలో కెప్టెన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో వైభవ్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం అతడి కెరీర్ ఎలా సాగుతుందో. వైభవ్ జట్టులో ఉండటం వల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. జట్టులోని ప్రతి ఒక్కరినీ.. అది జూనియర్ అయినా, సీనియర్ అయినా.. జాగ్రత్తగా చూసుకుంటాడు. ఓహ్.. జూనియర్ అంటే నువ్వు ఒక్కడివే కదా! సారీ.. సారీ’ అంటూ ఇషాన్ మరోసారి సరదాగా వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి:

రాహుల్ ద్రవిడ్ యజమానిలానే వ్యవహరిస్తున్నాడు: కోచ్ విక్రమ్ రాథోడ్

సచిన్ రికార్డుపై జో రూట్ కన్ను.. వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Sep 11 , 2026 | 01:42 PM