పత్తికి పెరిగిన డిమాండ్..
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:21 PM
కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ఈసారి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోళ్ల అవసరం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది.
మద్దతు ధరకు మించి విక్రయాలు
సీసీఐ కొనుగోళ్లు లేనట్లేనా?
దేశ వ్యాప్తంగా తగ్గిన పత్తి సాగు
జమ్మికుంట(కరీంనగర్): కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ఈసారి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోళ్ల అవసరం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటకలో వర్షాభావ పరిస్థితుల వల్ల పత్తి సాగు గణనీయంగా తగ్గింది. దీంతో దేశ వ్యాప్తంగా పత్తికి డిమాండ్ పెరిగింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొత్తపత్తి రాక మొదలైంది. గరిష్ట ధర రూ.9,200, మోడల్ ధర రూ.9,100 నమోదైంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2026-27 సీజన్ మద్దతు ధర రూ.8,667 కాగా, జమ్మికుంట వ్యవసా య మార్కెట్లో గురువారం రూ.8,700 ధర పలికింది. ఈ సీజన్‌లో మద్దతు ధరను అధిగమించి పత్తి ధరలు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీసీఐ కొనుగోళ్లకు పెద్దగా అవకాశం ఉండకపోవచ్చన్న అభి ప్రాయం మార్కెట్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. పత్తి ధరను నిర్ణయించడంలో కేవలం క్వింటాల్ ధర కా కుండా జిన్నింగ్ తర్వాత వచ్చే బేల్, పత్తి గింజల ధరలు కూడా కీలకం. దేశీయ స్పిన్నింగ్, టెక్స్‌టైల్ పరిశ్రమలో ముడి పత్తికి డిమాండ్ కొనసాగుతోంది. పత్తి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సరఫరా- డిమాండ్ సమీకరణాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
మార్కెట్ పరిస్థితులపై ధరలో మార్పులు
దేశీయ పత్తి లభ్యత, దిగుమతులపై డ్యూటీ మినహాయింపు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, కొత్త పంట దిగుబడి.. ఈ నాలుగు అంశాలే రానున్న రోజు ల్లో పత్తి ధరను నిర్ణయించనున్నాయి. ప్రస్తుతం మార్కెట్ ధర మద్దతు ధర కంటే పైనే ఉండటంతో రైతుకు సీసీఐ కంటే ప్రైవేట్ మార్కెట్ ధరే కీలకంగా మారింది. అయితే కొత్త పత్తి భారీగా మార్కెట్‌కు వచ్చే సమయంలో ధరలు తగ్గితే పరిస్థితి మారే అవకాశం ఉంది. మార్కెట్ ధర.. మద్దతు ధర కంటే పైన కొనసాగితే రైతు ప్రైవేట్ మార్కెట్‌లోనే విక్రయించే అవకాశం ఉంటుంది. మద్దతు ధరకంటే దిగువకు పడిపోతే సీసీఐ కొనుగోళ్లు రైతుకు రక్షణగా నిలుస్తాయి.
దిగుమతులపై డ్యూటీ ఎత్తివేత
దేశీయ టెక్స్‌టైల్ పరిశ్రమకు పత్తి లభ్యత పెంచ డంతో పాటు ముడిసరుకు వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి అక్టోబరు 31వరకు పత్తి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్‌ను పూర్తిగా మినహాయించింది. గతంలో పత్తి దిగుమతులపై 11శాతం వరకు డ్యూటీ ఉండేది. దేశీయ మార్కెట్లో ధరలు అంతర్జాతీయ మార్కెట్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు స్పిన్నింగ్,
టెక్స్‌టైల్ పరిశ్రమకు దిగుమతులు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. దేశీయంగా పత్తి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో విదేశీ పత్తి దిగు మతులు పెరిగాయి. 2025-26లో ముడి పత్తి దిగుమతులు 10.13లక్షల టన్నులకు చేరా యి. అంతకు ముందు ఏడాది 5.62లక్షల టన్నులుగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో పత్తి ధరలు అధికంగా ఉంటే మిల్లులకు దిగుమతి పత్తి ప్రత్యామ్నాయంగా మారుతుంది. దీంతో దేశీయ పత్తి ధరలపై కూడా దిగుమతుల ప్రభావం ఉండే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
పుష్పక్ బస్సుల్లో ఎయిర్‌పోర్టుకు తగ్గిన ప్రయాణికులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News