జాబ్‌ల పేరుతో జేబులు ఖాళీ
ABN , Publish Date - Sep 18 , 2026 | 10:59 AM
ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతను లక్ష్యం చేసుకున్న కొంత మంది మోసగాళ్లు ఉద్యోగాలు ఇప్పిస్తామనే ఆశ చూపి జేబులు ఖాళీ చేస్తున్నారు.
నకిలీ పత్రాలతో నమ్మించే ప్రయత్నాలు
సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలు
దశల వారీగా డబ్బులు తీసుకుని పరారీలో నిందితులు
లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న నిరుద్యోగ యువత
వరంగల్ క్రైం: ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతను లక్ష్యం చేసుకున్న కొంత మంది మోసగాళ్లు ఉద్యోగాలు ఇప్పిస్తామనే ఆశ చూపి జేబులు ఖాళీ చేస్తున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల్లోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సోషల్ మీడియా వేదిక గా ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా తమను సంప్రదించేలా చేసి ఆతర్వాత నమ్మకంగా ఉండి తమ ముగ్గులోకి దింపి సెక్యూ రిటీ డిపాజిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిఫండబుల్ పేరిట దశల వారీగా లక్షల్లో డబ్బులు గుంజుతున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.
ఆకర్షణీయమైన ప్రకటనలతో..
యువత నిత్యం సోషల్ మీడియాను అంటిపెట్టుకొని ఉం టుండటంతో కొంతమంది మోసగాళ్లు తమ మోసాలకు కేరా్‌ఫ గా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌లను ఎం చుకుంటున్నారు. వాటిల్లో నో ఎగ్జామ్.. గ్యారెంటీ జాబ్, డైరెక్ట్ రిక్రూ ట్‌మెంట్, వాక్-ఇన్ ఇంటర్వ్యూ, నకిలీ కంపెనీ లోగోలు, మెయిల్స్‌తో ఆకర్షణీయమైన ప్రకటనలువేస్తూ యువతను తమ వైపు తిప్పుకొని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌లోనే కాకుండా మరో వైపు తమకు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయని నమ్మబలుకు తూ బంధువులు, పరిచయస్తులను సైతం ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. ప్రత్యక్ష పద్ధతుల్లో అయితే ఇంటికి తాళాలు వేసి ఎవరికీ కనిపించకుండా కొద్దిరోజు ల్లో ఎక్కడనో తలదాచుకోవడం, ఆన్‌లైన్‌లో అయితే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడం పరిపాటిగా మారింది.
నకిలీ పత్రాలతో నమ్మించే ప్రయత్నాలు
ఉద్యోగం ఇప్పిస్తాడనే నమ్మకాన్ని యువతలో ఏర్పరచడానికి గతంలో పలువురు యువతకు ఉద్యోగాలు ఇప్పించామని చెప్పడానికి నకిలీ తాలూకా పత్రాలను చూపించి బుట్టలో వేసుకుంటున్నారు. నమ్మి ఆశ్రయించిన యువత నుంచి చిన్న మొత్తంలో డబ్బులు తీసుకుంటూ చివరికి లక్షల్లో కుచ్చుటోపీ పెడుతున్నారు. గట్టిగా నిలదీస్తే అవే నకిలీ పత్రాలను చేతిలో పెట్టి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారీలో ఉంటున్నారు. ఇలా నిరుద్యోగుల ఆశను క్యాచ్ చేసుకొని కొంత మంది మోసగాళ్లు లక్షల్లో దండుకుంటున్నారు. ఎంతకీ ఉద్యోగంలో జాయినింగ్ లేకపోవడంతో మోసమని తెలిసి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఈ ఏడాది జరిగిన మోసాలు
హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షలను 2020 సంవత్సరం నుంచి దశల వారీగా తీసుకొని మోసం చేయగా ఈ ఏడాది మార్చిలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వ్యక్తికి గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3,60,000 తీసుకొని మోసం చేయగా బాధితుడి ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు మార్చి నెలలో కేసు నమోదు చేశారు.
దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వేజాబ్ ఇప్పిస్తాని ఓ వ్యక్తి రూ.6,00,000 తీసుకొని మోసం చేయగా ఏప్రిల్‌లో బాధితుడి ఫిర్యాదు మేరకు దామెర పోలీసులు కేసు నమో దు చేశారు.
హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయపురకు చెందిన ఓ వ్యక్తి జూనియర్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వస్తోందనే ఆశతో ఓ వ్యక్తికి రూ.2,90,000 ఇచ్చి మోసపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా నిజామాబాద్‌కు చెందిన నిందితుడు పలువురు నిరుద్యోగ యువతకుఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి రూ.85 లక్షలతో పాటు 4 తులాల బంగారంను కాజేయగా కాజీపేట పోలీసులు అరెస్టు చేశారు.
డబ్బులతో ఉద్యోగమంటేనే మోసం
ధార కవిత, సెంట్రల్ జోన్ డీసీపీ
డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇవ్వడం అంటే మోసమనే విషయం యువత గ్రహించాలి. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కానీ ఉద్యోగాల గురించి వెతికినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చే సంస్థలు, వ్యక్తుల గురించి అధికారికంగా ధృవీకరించుకోవాలి. రిజిస్ర్టేషన్, ఇతర ఫీజులను చెల్లించేటప్పుడు ఫిజికల్‌గా సంస్థను సంప్రదించి నకిలీదా, అసలైనదా.. అనే విషయాన్ని యువత నిర్ధారించుకోవాలి. ఇటీవల సింగరేణి, హెల్త్, ఇతర విభాగాల్లో ఫేక్ జాయినింగ్ ఆర్డర్స్ అందుకొని యువత మోసపోయారు. ఇలాంటి మోసపూరిత వ్యక్తుల్లో చిక్కకుండా అప్రమత్తంగా ఉండాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
పుష్పక్ బస్సుల్లో ఎయిర్‌పోర్టుకు తగ్గిన ప్రయాణికులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News