ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సహకరించండి.. కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
ABN , Publish Date - Sep 18 , 2026 | 10:20 AM
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పీఎమ్‌ఏవై-జీ పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను కేటాయించిన సందర్భంగా కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పీఎమ్‌ఏవై-జీ(PMAY-G) పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను కేటాయించిన సందర్భంగా కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని గత జూలైలో కేంద్ర మంత్రికి ఢిల్లీలో రేవంత్ వినతిపత్రం అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్ష ఇళ్లను కేటాయించాలని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్‌ను కోరారు. అలాగే రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు.
ఎల్‌నినో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. వ్యవసాయ రంగంలో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులకు ప్రోత్సహిస్తున్నామని వివరించారు.
250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పంట మార్పిడిపై రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి సహకరించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
నా తప్పులు దాచేస్తా.. హద్దులు దాటేస్తా!
నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాదం.. సర్వీస్ రివాల్వర్‌తో రిజర్వ్ ఎస్సై ఆత్మహత్య..
Read Latest Telangana News And Telugu News