బర్డ్ డైరెక్టర్ నియామకంపై హైకోర్టులో పిల్
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:44 AM
బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్(బర్డ్) ఆసుపత్రి డైరెక్టర్‌గా డాక్టర్ జి.జగదీశ్‌ను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.
కౌంటర్ వేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్(బర్డ్) ఆసుపత్రి డైరెక్టర్‌గా డాక్టర్ జి.జగదీశ్‌ను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, చైర్మన్, బర్డ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్, వ్యక్తిగత హోదాలో డాక్టర్ జగదీశ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానములు పరిధిలోని బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్‌గా 72 ఏళ్ల డాక్టర్ జి.జగదీశ్‌ను నియమించడాన్ని సవాల్ చేస్తూ చిత్తూరు జిల్లాకు చెందిన చెన్నూరు పెంచలయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది దుగ్గిరాల సుభాష్ వాదనలు వినిపించారు. టీటీడీ సర్వీస్ నిబంధనల ప్రకారం డైరెక్టర్ పోస్టును డిప్యుటేషన్ లేదా పదోన్నతి ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. పదవీ విరమణ చేసినవారిని డైరెక్టర్‌గా నియమించేందుకు సర్వీస్ రూల్స్ అనుమతించవన్నారు. టీటీడీ మార్గదర్శకాల ప్రకారం పదవీ విరమణ చేసిన ఉద్యోగులను నియమించాలంటే స్ర్కీనింగ్ కమిటీ పరిశీలన, టీటీడీ బోర్డు ఆమోదం తప్పనిసరి అన్నారు. డాక్టర్ జగదీశ్ నియామకం విషయంలో ఈ ప్రక్రియను అనుసరించలేదని, ముఖ్యమంత్రి కార్యాలయం సిఫార్సుతో నియామకం జరిగిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఈ వార్తలనూ చదవండి: