Share News

భలే మంచి బేరం !

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:31 AM

బులియన్‌ మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అండర్‌ సేల్‌ పరిస్థితి నెలకొంది..

భలే మంచి బేరం !

బంగారం అండర్‌ సేల్స్‌

గ్రాముకు రూ.500 తక్కువగా విక్రయాలు

బులియన్‌ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని పరిస్థితి

నరసాపురం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): బులియన్‌ మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అండర్‌ సేల్‌ పరిస్థితి నెలకొంది..అంటే మార్కెట్‌ ధర కన్నా తక్కువకు బంగారం అమ్మడం. గతంలో వెండి ఈ విధంగా విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం బంగారానికి కూడా ఆ పరిస్థితి వచ్చింది. కార్పోరేట్‌ సంస్థలు మాత్రం మార్కెట్‌ రేట్‌కే విక్రయిస్తున్నారు. జ్యూయలరీ షాపుల్లో గ్రాముకు రూ.500 తక్కువ చేసి అమ్మకాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ విక్రయాలు సాగుతున్నాయి. గురువారం బులియన్‌ మార్కెట్‌లో గ్రాము ఆర్నమెంట్‌ బంగారం (22 క్యారెట్లు) 14,100 ఉండగా మార్కెట్‌లో రూ .13,600కు అమ్మారు. బిస్కెట్‌ బంగారం గ్రాము రూ.15,600 ఉండగా రూ.15,100కు విక్రయాలు జరిపారు. జిల్లాలో పసిడి మార్కెట్‌కు నరసాపురం పెట్టింది పేరు. సుమారు 150 వరకు జ్యూయలరీ షాపులు ఉన్నాయి.అన్ని దుకాణాల్లోనూ ఇదేవిధంగా అమ్మకాలు జరిగాయి. పాలకొల్లు, తాడేప ల్లిగూడెం, తణుకు, భీమవరం వంటి పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి. అయితే భీమవరం వంటి పెద్ద పట్టణంలో ఉన్న కార్పోరేట్‌ షాపుల్లో మాత్రం ఇండియన్‌ ధరకు అనుగుణంగా అమ్మకాలు జరిగాయి. అంటే ఆన్‌లైన్‌ ధరకే విక్రయించారు. పాత బంగారం కూడా క్వాలిటీ బట్టి ఇదే ధరకు కొనుగోలు చేశారు.

జోరుగా అమ్మకాలు

ధర తగ్గడంతో బులియన్‌ మార్కెట్‌లో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చాలా మంది పాత బంగారాన్ని ఎక్స్చేంజ్‌ చేసి కొత్త ఆభరణాలను తీసుకుంటున్నారు. పెళ్లిళ్లు, రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని కొందరు ముందస్తుగా పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిస్కెట్‌, 22 గ్రాముల కాయిన్స్‌ కొనుగోలతో పాటు వస్తువుల్ని కూడా తయారు చేయించుకుంటున్నారు. దీంతో షాపులన్నీ కళకళలాడుతున్నాయి.

అంతర్జాతీయ ప్రమాణాలే కారణం

ఽఈ ఏడాది ఆరంభం నుంచి బంగారం దూసుకుపోతూ వచ్చింది. ఒకానొక దశలో గ్రాము ఆర్నమెంట్‌ బంగారం రూ.20 వేలకు చేరువైంది. అయితే అక్కడ నుంచి మొదలైన పతనం ఒకానొక దశలో రూ.12,600 వచ్చింది. దీంతో ధర మరింత తగ్గుతుందని భావించారు. అయితే నెల రోజుల నుంచి మళ్లీ పెరుగుతూ వచ్చింది. గ్రాము రూ.15 వేలు తాకింది. అయితే అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులతో క్రూడ్‌ ధర పెరిగింది. అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్‌ పతనం, ఆర్థిక మాంద్యం, డాలర్‌ ధర పతనం, అమెరికాలో ఫెడ్‌ బ్యాంకు నిర్ణయాలు తదితర కారణాలతో పసిడి ధర పతనానికి కారణంగా చూపిస్తున్నారు. వీటికి తోడు భారత్‌ దిగుమతులపై పన్ను విధించింది. దేశంలో నెలకొన్న ఆర్థికమాంద్యం ప్రభావంతో కొనుగోళ్లు తగ్గాయి. వీటన్నిటికి తోడు దిగుమతులు తగ్గడంతో స్వదేశీ మార్కెట్‌లో పాత బంగారం అమ్మకాలు పెరిగాయి. ఈ కారణాలన్నీ పసిడి ధర అండర్‌ సేల్స్‌కు కారణంగా భావిస్తున్నారు.

Updated Date - Sep 18 , 2026 | 12:31 AM