టార్గెట్ ఫాంహౌస్!
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:59 AM
ఎర్రవల్లిలో 388 ఎకరాల ప్రభుత్వ భూమిపై రెవెన్యూ శాఖ సర్వే ప్రారంభించింది. కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో శాటిలైట్ సర్వే నిర్వహించగా, రైతుల అభ్యంతరాల మధ్య అధికారులు ప్రక్రియను కొనసాగించారు.
ఎర్రవల్లిలో 388 ఎకరాల ప్రభుత్వ భూమి కోసం సర్వే
కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో శాటిలైట్ సర్వే
ఆర్డీవో చంద్రకళ నేతృత్వంలో రికార్డుల పరిశీలన
సర్వేను అడ్డుకున్న ఎర్రవల్లి గ్రామ రైతులు
ఉద్రిక్తతల మధ్య సర్వేను కొనసాగించిన అధికారులు
కేసీఆర్ కుటుంబ ఆస్తి వివరాలతో రాజధానిలో ఫ్లెక్సీ
తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీద వేలాడదీసిన వ్యక్తులు
‘ఆస్తులు కక్కిస్తాం రాసిపెట్టుకోండి’ అంటూ రాతలు
వెంకటాపురం, ఎర్రవల్లిలోని 300 ఎకరాలెక్కడివి?
సత్యం రామలింగరాజు భూములు మీ వద్ద ఎలా?
ఎంపీలంతా కలిసి ఎర్రవల్లిపై విచారిస్తాం: చామల
గజ్వేల్/మర్కుక్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో రెవెన్యూ అధికారుల సర్వే మొదలైంది. కేసీఆర్ ఫాంహౌస్‌లో కలుపుకొన్న 388 ఎకరాల ప్రభుత్వ భూములను 30 రోజుల్లో వెలికితీసి దళితులకు పంచుతానంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభా ముఖంగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు గురువారం రెవెన్యూ అధికారులు గ్రామానికి వచ్చారు. సిద్దిపేట కలెక్టర్ సారథ్యంలో గజ్వేల్ ఆర్డీవో వీవీఎల్ చంద్రకళ నేతృత్వంలో జిల్లా సర్వే ఏడీ సుదర్శన్, మర్కుక్ మండల ఆర్‌ఐ హరీశ్ కుమార్ రంగంలోకి దిగారు. ఉదయం నుంచే మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో ఎర్రవల్లి గ్రామంలోని ప్రభుత్వ భూముల వివరాలను సేకరించారు.
ఆయా సర్వే నంబర్లలో ఉన్న భూముల విస్తీర్ణం, స్వభావం తెలుసుకున్నారు. అనంతరం సర్వే నంబర్ 325లో ఉండాల్సిన 388 ఎకరాల ప్రభుత్వ భూమి గురించి ఫామ్‌హౌస్ గోడకు 500 మీటర్ల దూరంలో ఉన్న భూమిలో శాటిలైట్ ద్వారా సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడకు చేరుకుని సర్వే అధికారులను, సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే, సర్వే అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయారు. మర్కుక్ మండల తహసిల్దార్ సరిత, ఎస్‌ఐ యూనిస్, మండల రెవెన్యూ అధికారులు, సర్వే భూరికార్డుల శాఖ అధికారులతో గజ్వేల్ ఆర్డీవో వీవీఎల్ చంద్రకళ తహసిల్దార్ కార్యాలయంలోనే సమీక్ష నిర్వహించారు. భూములకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు తెలిసింది. ఎర్రవల్లి సర్వే నెంబర్ 325లో అధికారులు సర్వేను చేపట్టారని తెలుసుకున్న గ్రామస్థులు అక్కడకు వచ్చి కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. గత 50 ఏళ్లుగా తమ తండ్రులు, తాము ఈ భూమిలో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నామని, ఈ భూముల్లో 200 దళిత కుటుంబాలే వ్యవసాయం చేస్తున్నాయని, అన్యాక్రాంతం అవలేదని, అనవసరంగా లేనిపోని ఇబ్బందులు పెట్టవద్దని అధికారులను వేడుకున్నారు. సర్వే నెంబర్ 325లో 50 ఎకరాల భూమి సాగుకు పనికి రానిదిగా ఉంటే గత ప్రభుత్వ హయాంలో చదును చేసి పంటకు అనుకూలంగా చేశారని, ఇప్పుడు తాము ఆయా పంటలను సాగు చేసుకుని జీవిస్తున్నామని రైతులు తెలిపారు.
రేపటి నుంచి పూర్తి స్థాయి సర్వే
రెవెన్యూ యంత్రాంగం మొదటి రోజు ఎర్రవల్లిలోని 325లో గల భూముల వివరాలు, భూముల స్వభావం, ప్రస్తుతం సాగు చేస్తున్న రైతుల వివరాలతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న భూముల వివరాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో సర్వే చేపట్టి నిజానిజాలను వెలికి తీయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎర్రవల్లి గ్రామస్థులు సర్వేను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారన్న అనుమానాలున్న నేపథ్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఎర్రవల్లికి వెళ్లి, అక్కడి రైతులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అధికారులు, బీఆర్‌ఎస్ నాయకుల కంటే ఫాంహౌజ్ వద్ద మీడియా హడావిడే ఎక్కువగా కనిపించింది.
గజ్వేల్ కలెక్టరేట్‌కు వచ్చి విచారిస్తాం
హైదరాబాద్: ఎర్రవల్లి ఫామ్‌హౌ్‌సలో 295 ఎకరాలు, వెంకటాపురం-ఎర్రవల్లి మధ్య మరో 300 ఎకరాలు కేసీఆర్ కుటుంబం కబ్జాలో ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ఈ విషయాన్ని ధ్రువీకరించారని, కేసీఆర్ కుటుంబానికి ఇంత భూమి ఎలా వచ్చిందో చెప్పాలని నిలదీశారు. ఈ భూమి ఎక్కడిది? మీ తాతలిచ్చారా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆ భూములు పేదలకు కేటీఆర్, హరీశ్‌లు పంచుతారో తమను పంచమంటారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. చామల గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై కలెక్టర్ ఆఫీ్‌సలో ఎంపీలంతా కలిసి కూర్చొని విచారణ చేస్తామని ప్రకటించారు. జన్వాడలో 111 పరిధిలో ఉన్న సత్యం రామలింగరాజు భూములు కేటీఆర్ కుటుంబం పేరు మీదకు ఎందుకు వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. ఈడీ అటాచ్ చేసిన భూములు కేటీఆర్ పేరు మీదకు ఎలా వచ్చాయో చెప్పాలని అడిగారు. ఉద్యమ సమయంలో తెలంగాణకు కేవలం కాపలా కుక్కను, నా కుటుంబానికి పదవులు అక్కర్లేదు అని ప్రకటించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని తన కుటుంబం చేతుల్లో పెట్టాడన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
1954లోనే మాకు వందల ఎకరాలు
2004లో కేసీఆర్‌కు భూమే లేదు