2004లో కేసీఆర్‌కు భూమే లేదు
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:26 AM
కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లలో 2004 నుంచి 2023 వరకు నమోదైన భూముల వివరాలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2014లో 37.7 ఎకరాలు, 2018లో 54.21 ఎకరాలు, 2023లో 65.25 ఎకరాలు ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నట్లు కథనం తెలిపింది.
తెలంగాణ వచ్చినప్పుడు 37.7 ఎకరాలు
2018 ఎన్నికల నాటికి 54.41ఎకరాలు
2023 ఎన్నికల నాటికి 65.25 ఎకరాలు
కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో లెక్కలివే
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఎర్రవల్లి ఫామ్‌హౌ్‌సలో రికార్డుల పరంగానే 67.13 ఎకరాలు ఉన్నట్లు సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఈ భూములు ఎప్పుడొచ్చాయన్న దానిపై విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ప్రధానంగా ఆయన ఎన్నికల అఫిడవిట్‌లను ఆధారంగా చేసుకొని ఈ చర్చ జరుగుతోంది. 2004 లోక్‌సభ ఎన్నికల నాటికి కేసీఆర్‌కు ఒక్క ఎకరం భూమి కూడా లేదంటూ అప్పటి ఎన్నికల అఫిడవిట్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రదర్శించారు. ఈ ఆరోపణపై కేటీఆర్ స్పందిస్తూ, తాతల కాలం నుంచే కేసీఆర్ కుటుంబానికి భూములు ఉన్నాయని చెప్పారు. దాంతో కేసీఆర్ వివిధ సందర్బాల్లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన అఫిడవిట్‌లలో ఏముంది అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆ అఫిడవిట్ల ప్రకారం 2004 లోక్‌సభ ఎన్నికల నాటికి ఆయనకు అసలు భూమే లేదు. తర్వాత 2006, 2008లో కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నిక, 2009 నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లలో కూడా పెద్దగా భూములు లేవు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్‌లో ఆయనకు ఎర్రవల్లిలో 37.7 ఎకరాల భూమి ఉందని చూపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తనకు ఎర్రవల్లిలో 54.21 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉన్నట్లు పేర్కొన్నారు. దీని విలువను అప్పట్లో రూ.1.36 కోట్లుగా చూపారు. దాంతోపాటు సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో 2.04 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉందని చూపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో కేసీఆర్ తనకు ఎర్రవల్లిలో 65.25 ఎకరాల భూమి ఉన్నట్లు ప్రకటించారు. అయితే, ఆ భూమి తన ఒక్కడిది కాదని, తన హిందూ అవిభక్త కుటుంబానిదని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
2004 వరకు కేసీఆర్‌కు ఎకరా భూమి లేదు
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి