2004 వరకు కేసీఆర్‌కు ఎకరా భూమి లేదు
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:12 AM
కేసీఆర్ 2004 ఎన్నికల అఫిడవిట్‌లో భూములు లేవని పేర్కొన్న అంశాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబానికి 440 ఎకరాల భూమి ఉందన్న వాదనలపై ఆయన వివరణ కోరారు.
నాటి ఎన్నికల అఫిడవిట్‌లో ఆయనే వెల్లడించారు
కేటీఆర్ పేరుతో ఉన్న వ్యవసాయ భూమి
ఎకరా అని 2009 అఫిడవిట్లో చూపారు
ఇప్పుడు 440 ఎకరాలు ఎక్కడినుంచి వచ్చాయ్?
భూస్వాముల కుటుంబమైతే
భూముల వివరాలు ఎందుకు దాచారు?
నిలదీసిన మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి
బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబానికి
ఆస్తులు.. ఉద్యమకారులకు అప్పులని వ్యాఖ్య
హైదరాబాద్, హనుమకొండ కలెక్టరేట్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తనకు 2004 వరకు ఒక్క ఎకరం భూమి కూడా లేదని అదే ఏడాది కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ స్వయంగా వెల్లడించారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. సున్నా ఎకరాల నుంచి వేల కోట్ల ఆస్తులకు ఎదిగిన భూబకాసురుడు కేసీఆర్ అని గురువారం ఎక్స్ వేదికగా మంత్రి మండిపడ్డారు. ఎకరా భూమి కూడా లేదని తెలిపిన కేసీఆర్‌కు.. ఇప్పుడు 440 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక పదేళ్ల పాలనలో కేసీఆర్ భూములు భారీగా పెరిగాయని 2004 నాటి ఆయన ఎన్నికల అఫిడవిట్ స్పష్టం చేస్తోందని అన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కుటుంబానికి రూ.కోట్ల ఆస్తులు సమకూరితే.. తెలంగాణ ఉద్యమకారులకు అప్పులు మిగిలాయన్నారు.
ఇవాళ కేసీఆర్ వద్ద రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నాయంటే పేదలు, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం వల్లనే సాధ్యమైందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద రూ.లక్ష కోట్ల ఆస్తులను కల్వకుంట్ల కుటుంబం అక్రమంగా సంపాదించిందన్నారు. పుట్టుకతోనే కేసీఆర్‌కు వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్న కేటీఆర్.. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో వాటిని ఎందుకు చూపలేదు... అంటే ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారా..? ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి 9 జిల్లాల్లో, 24 మండలాల్లో, 31 గ్రామాల్లో 440 ఎకరాల భూమి ఉందని, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం శాసనసభలో ప్రశ్నించారని... ఇదే కాకుండా బినామీల పేరుతోనూ వందల ఎకరాలు దోచుకున్నారని, రాష్ట్రాన్ని దోపిడీ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
కేటీఆర్, ఆయన భార్య, పిల్లల పేరుతో ఎర్రవల్లి, జన్వాడ, మర్కూక్, వెంకటాపూర్ పరిధిలో 123.19 ఎకరాలు ఉందన్నారు. అయితే 2009 ఎన్నికల సమయంలో కేటీఆర్ ఇచ్చిన అఫిడవిట్‌లో మాత్రం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం దేవరయాంజల్ సర్వే నంబరు 437లో ఎకరం వ్యవసాయ భూమి మాత్రమే ఉందని, దాని విలువ రూ.50 లక్షలుగా చూపారని మంత్రి తెలిపారు. కాగా కేటీఆర్ భార్య పేరుతో వ్యవసాయేతర భూమి అల్వాల్ పాకల్‌కుంట సర్వే నంబరు 569,676 పరిధిలో 660 గజాలు ఉందని, దాని విలువ రూ.67.20 లక్షలుగా చూపారన్నారు.. మల్కాజ్‌గిరి సర్వే నంబరు 171లో 534 చదరపు గజాల ప్లాట్, దాని విలువ రూ.32.04 లక్షలని, మొయినాబాద్ సర్వే నంబర్లు 94,99,100,101,102 పరిధిలో 400 చదరపు గజాలు ఉందని ఆయన పేర్కొన్నారు.
కొండాపూర్‌లో ఉన్న శ్రీనిలయ నెస్ట్ అపార్ట్‌మెంట్‌లో మూడు ఫ్లాట్లు (101,348,35) ఉన్నాయని, వాటి విలువ రూ.90 లక్షలుగా పేర్కొన్నారని, అలాగే వివిధ ప్రాంతాల్లో 123 ఎకరాలు ఎలా వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి డిమాండ్ చేశారు. తాతల కాలం నుంచి భూస్వాములం, దొరలమని చెబుతున్న కేటీఆర్.. 2009 అఫిడవిట్‌లో వారికి ఉన్న ఈ భూముల వివరాలు ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కాగా హనుమకొండ కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం హైదరాబాద్‌కు దీటుగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ట్రైసిటీ అభివృద్ధి చేస్తోందన్నారు. గ్రేటర్ వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. నగరంలో తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.551 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి: