ఇందిరమ్మ చీరలొచ్చాయ్..!
ABN , Publish Date - Sep 18 , 2026 | 01:22 AM
జిల్లా మహిళామణులకు మరోసారి ఇందిరమ్మ చీర కానుకగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
జిల్లా మహిళామణులకు మరోసారి ఇందిరమ్మ చీర కానుకగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం అవసరమైన కార్యాచరణలో నిమగ్నమవుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో ఉన్న వారికి వీటిని అందించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో మొత్తంగా 1.79లక్షల మంది మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారనే నివేదికను గ్రామాలు, పట్టణాల వారీగా ఇప్పటికే రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీకి సంబంధిం చి ఇంకా పూర్తి స్థాయి మార్గదర్శకాలను అందించలేదు. కానీ జిల్లాలో అవసరానికి తగినన్ని చీరలను మాత్రం సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు జిల్లాకు 85 వేల చీరలు వచ్చాయి. వీటిని కరీంనగర్ అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్(ఏఎంసీ) గోదాంలో నిల్వ చేశారు. మరో 94 వేల చీరలు పలు దఫాలుగా జిల్లాకు వచ్చే వీలుంది. అయితే బతుకమ్మ, దసరా పండుగ నాటికి వీటిని అర్హులుగా గుర్తించే ప్రతి ఒక్కరి ఇంటికి చేరవేసే విధంగా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో కార్పొరేషన్, మున్సిపాలిటీలు, జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారుల సమన్వయంతో వీటికి సంబంధించి పంపిణీ బాధ్యతల్ని అప్పగించే వీలుంది. అయితే గతేడాది సరఫరా ఆలస్యం వల్ల పంపిణీ విషయం లోనూ విపరీతమైన జాప్యం జరిగింది. ఈ సారి అలా జరగకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు ఆదేశాల ప్రకారం వేగాన్ని పెంచు తున్నారు.
ఈసారి ఆకుపచ్చ రంగులో...
గతేడాది పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలన్నీ పాలపిట్ట రంగు(నీలం)లో ఉండగా ఈసారి చీరలన్నీ రామచిలుక ఆకుపచ్చ రంగుల్లో ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఇందిరమ్మ చీరల డిజైన్‌ను పరిశీలించి పంపిణీ తీరు వివరించారు. ఇందుకు తగినట్లుగానే ఆకుపచ్చ రంగు చీరలు జిల్లాకు వచ్చాయి. 2025లో రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించగా జిల్లా కోటాగా 1.45లక్షల మందికి వీటిని అందించారు. నవంబరు 19వ తేదీన పంపిణీ ప్రారంభించారు. అయితే ఉత్పత్తి తీరుని బట్టి విడతల వారీగా వచ్చిన చీరలను ఈ ఏడాది మార్చి నెల వరకు కూడా అందజేశారు. గతంలో రేషన్ కార్డు ఉన్న వారికి ఇచ్చారు. అయితే ఈసారి సంఘాల్లోని సభ్యులతోపాటు రేషన్‌కార్డు ఉన్న వారికి ఇస్తారా.? లేదా..? అనేది ఇంకా అధికారికంగా నిర్ణయం జరుగలేదు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే విధివిధా నాలు, వెలువడే ఉత్తర్వుల ఆధారంగా అర్హులందరికీ వీటిని పంపిణీ చేసే యోచ నలో అధికారులున్నారు. ఒకవేళ ఇప్పుడు నిర్ణయించుకున్న 1.79 లక్షలకు అదనంగా మరికొంత మందిని గుర్తించినా వారికి కూడా ఇందిరమ్మ చీరలు అందించనున్నారు. వచ్చిన చీరలను పంపిణీ చేసేందుకు ఆయా మండలాల వారీగా బాధ్యులను నియ మించి పారదర్శకంగా ప్రక్రియ కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.