జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Sep 18 , 2026 | 01:14 AM
ప్రజా భాగస్వామ్యంతో జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుదామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్ అన్నారు.
జగిత్యాల, సెప్టెంబరు17 (ఆంధ్రజ్యోతి): ప్రజా భాగస్వామ్యంతో జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుదామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి అజహరుద్దీన్ హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి అజాహరుద్దీన్‌కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌లు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ 1948 సెప్టెంబరు 17న తెలంగాణ ప్రాంతం నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య భారత దేశంలో అంతర్భాగమైందన్నారు. ఈసందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబరు 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడి సెప్టెంబరు 1 నాటికి 1000 రోజుల ప్రజాపాలనను పూర్తి చేసుకుందని వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, మౌలిక వసతుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని వెల్లడించారు. రైతులకు రైతు భరోసా, పంటలకు మద్దతు, మహిళలకు మహాలక్ష్మి, గృహజ్యోతి ద్వారా కుటుంబాలకు ఉపశమనం, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నిరు పేదలకు సొంతింటి కల, విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు, పేదలకు మెరుగైన వైద్య సేవలు, యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలతో ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు.
ఫఅర్హులందరికీ నూతన స్మార్ట్ రేషన్‌కార్డులు..
పురాతన దేవాలయాల అభివృద్ధిలో భాగంగా ధర్మపురి ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణానికి 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని రూ.200 కోట్ల నిధులను మంజూరు చేశామని తెలిపారు. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ కార్డులను జిల్లాలోని అర్హులైన 3,53,682 మంది లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. జిల్లాలో వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు తదితర 11 కేటగిరీలకు చెందిన 2,14,076 మంది లబ్ధిదారులకు ప్రతి నెల సుమారు రూ. 46.26 కోట్ల పెన్షన్లు అందిస్తున్నామన్నారు.. నూతన పెన్షన్ల మంజూరు కోసం 15,432 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు.
ఫమహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం..
జిల్లాలో ఇప్పటి వరకు రూ.285.68 కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాల సభ్యులకు అందించడం జరిగిందని తెలిపారు. వడ్డీ మాఫీ కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 32.68 కోట్ల వడ్డీ మాఫీ నిధులను అందించామని వెల్లడించారు. స్త్రీ నిధి సంస్థ ద్వారా మహిళలకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ. 28.60 కోట్లు రుణాలు ఇచ్చామని చెప్పారు. జిల్లాలో 12వ విడత వన మహోత్సవంలో భాగంగా 2026-27 సంవత్సరమునకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలలో నర్సరీలు ఏర్పాటు చేసి 52లక్షలు మొక్కలు పెంచామని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 200యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేస్తోందన్నారు. జిల్లాలో 2,04,293 సర్వీసులకు గాను రూ. 80.32 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో 13,202 వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రూ. 36.80 కోట్లు రుణాలను మంజూరు చేశామని చెప్పారు.
ఫఅర్హులైన కుటుంబాలన్నింటికి ఇందిరమ్మ ఇండ్లు..
ప్రతి పేదవాడి సొంత ఇంటి కళను సాకారం చేసేందుకు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న 10,365 మందికి ఇళ్లు మంజూరు చేశామన్నారు. రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు 5,707 మందికి రూ.285.35 కోట్ల ఆర్థిక చేయూత కల్పించామని వివరించారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కోటి చొప్పున యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేశామన్నారు. కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుని, ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని తాత్కాలిక భవనంలో అడ్మిషన్లు పూర్తి చేశామని తెలిపారు.
ఫమైనార్టీల సంక్షేమానికి చర్యలు
జిల్లాలో మైనార్టీ మహిళలకు 598 కుట్టుమిషన్లు, 150 మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్, రేవంత్ అన్న క సహరా 15 మంది లబ్ధిదారులకు రూ.38 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ద్వారా 76 మంది లబ్ధిదారులకు రూ.38 లక్షలు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 102 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 6 బస్తీ దవాఖానాలు, 17 పీహెచ్‌సీలు, 3 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 3 సీహెచ్‌సీలు, మాతా శిశు కేంద్రం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా సేవలు అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్, అదనపు కలెక్టర్లు బీఎస్ లత, రాజ గౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి కె.వై ప్రసాద్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.