కమ్యూనిస్టులే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు
ABN , Publish Date - Sep 18 , 2026 | 01:12 AM
తెలంగాణ రైతాంగ పోరాటంతో సంబంధలేని మతోన్మాదులకు దాని గురించి మాట్లాడే హక్కులేదని, కమ్యూనిస్టులే ఈ పోరాటానికి వారసులని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు అన్నారు.
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రైతాంగ పోరాటంతో సంబంధలేని మతోన్మాదులకు దాని గురించి మాట్లాడే హక్కులేదని, కమ్యూనిస్టులే ఈ పోరాటానికి వారసులని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు అన్నారు. సిరిసిల్లలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోరాటంలో అమరులైన బద్దం ఎల్లారెడ్డి, అమృత్‌లాల్‌శుక్లా, గడ్డం తిరుపతిరెడ్డి, సింగిరెడ్డి భూపతిరెడ్డి, కరోళ్ల నర్సయ్య చిత్రపటానికి సీపీఎం నాయకులు నివాళ్లు అర్పించారు. అనంతరం చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో జరిగి సాయుధ పోరాట వారోత్సవాల ముంగిపు సభకు తరలివెళ్లారు. జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4వేలమంది అమరులై 10లక్షల ఎకరాల భూములను పంపిణీ చేసి భూస్వాములను గ్రామాలనుంచి తరిమికొట్టారన్నారు. సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధంలేని మతోన్మాద బీజేపీకి మాట్లాడే హక్కులేదని విమర్శించారు. బీజేపీ ఏర్పడినప్పటి నుంచి ఎందుకు తెలంగాణ విమోచన దినం చేయలేదన్నారు. 2019లో మత ఘర్షణలుగా వీరోచిత చరిత్రను వక్రీకరించడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఐలమ్మ పోరాటాన్ని చిట్టెలుక పోరాటంగా అవమానించిన బీజేపీ నేతలు విమోచన దినం నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మత పోరాటం కాదని, ఆది వర్గ పోరాటమన్నారు. ఈ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని, మతోన్మాదులకు అనువంత సంబంధం లేదన్నారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం, అంటరానితనం, కులవిక్ష దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన మహోజ్వల పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. ఈ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, ఎర్రవల్లి నాగరాజు, అన్నల్ దాస్ గణేష్, గురిజాల శ్రీధర్, ఏలిగేటి రాజశేఖర్, శ్రీరాంసదానందం, రామంచ అశోక్, ఆడెపు రజిత, దాసరి రూప, మాసం సురేష్, పూల శ్రీనివాస్, సావనపల్లి రాములు, రాజెల్లయ్య, సౌమ్య, రాజనర్సయ్య, వడ్నాల వీరేశం తదితరులు పాల్గొన్నారు.