Share News

1954లోనే మాకు వందల ఎకరాలు

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:39 AM

కేసీఆర్‌ కుటుంబ భూములు, ఆస్తులపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి ఆరోపణలను ఖండిస్తూ రెండు కుటుంబాల ఆస్తులపై సమగ్ర విచారణకు సిద్ధమని ప్రకటించారు.

1954లోనే మాకు వందల ఎకరాలు

  • చింతమడకలో రెండు ఎకరాల్లో ఇల్లు ఉండేది

  • ‘ఎగువ మానేరు’లో కోల్పోయిన

  • భూములకు వచ్చిన పరిహారంతోనే

  • కేసీఆర్‌ తండ్రి భూమి కొన్నారు: కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : వందల ఎకరాల ఆస్తి ఉన్న కుటుంబంలో కేసీఆర్‌ జన్మించారని, 1954లో కేసీఆర్‌ పుట్టినప్పుడే చింతమడకలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు ఉండేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. 72 ఏళ్ల వయస్సులో 67 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటుంటే కేసీఆర్‌ ఆస్తులు పెరిగినట్టా? తగ్గినట్టా? అని ప్రశ్నించారు. నిజాం హయాంలో ఎగువ మానేరు ప్రాజెక్టు ముంపు కింద కోల్పోయిన భూములకు వచ్చిన పరిహారంతోనే కేసీఆర్‌ తండ్రి వ్యవసాయ భూమి కొనుగోలు చేశారని తెలిపారు. స్వగ్రామంలోని ఇంటిని ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చారని వెల్లడించారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా చింతమడకలో కేసీఆర్‌ స్వయంగా ట్రాక్టర్‌ నడిపి వ్యవసాయం చేసే వారని గుర్తు చేశారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను కేటీఆర్‌ ఎగురవేశారు.


అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ గతంలో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్‌ అని మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ఎట్టకేలకు 67 ఎకరాలని అంగీకరించారని, మిగిలిన 933 ఎకరాలు ఎక్కడున్నాయో చూపిస్తే ప్రభుత్వానికే రాసిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల అఫిడవిట్లలోనే ఈ భూముల వివరాలను కేసీఆర్‌ వెల్లడించారని, ఆదాయపు పన్ను, స్టాంప్‌ డ్యూటీ చెల్లించి.. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వ్యవసాయ భూమి అని స్పష్టం చేశారు. ఇంతకాలం తప్పుడు ప్రచారంచేసి బురద జల్లినందుకు కేసీఆర్‌కు రేవంత్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కూకట్‌పల్లికి చెందిన కొండల్‌రావు ఆస్తులనూ కేసీఆర్‌ ఖాతాలో వేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వనపర్తిలో గోడల మీద రాతలు రాసే స్థాయి నుంచి జూబ్లీహిల్స్‌లో ప్యాలె్‌సలు నిర్మించుకునే స్థాయికి రేవంత్‌రెడ్డి ఎదిగారని చెబుతూ ఇంత తక్కువ వ్యవధిలో రూ.వేల కోట్లు ఎలా సంపాదించారని నిలదీశారు.


ఆ ట్రిక్కు ఏమిటో నిరుద్యోగ యువతకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిన్నమొన్నటి దాకా కేఎల్‌ శ్రీధర్‌ రెడ్డికి చెందిన కార్లలో రేవంత్‌ తిరిగింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్‌ సాయిరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. సోదరుడికి అక్రమంగా భూ కేటాయింపులు, బావమరిది సృజన్‌ రెడ్డికి సింగరేణిలో వేల కోట్ల కాంట్రాక్టులు, వట్టినాగులపల్లి, నాదర్‌గుల్‌లో 379 ఎకరాల భూ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికే ధరణిని రద్దు చేసి భూభారతి తెచ్చారని ఆరోపించారు. రేవంత్‌కు డిగ్రీ పాస్‌ కావడానికి ఏడేళ్లు పట్టిందని ఎద్దేవా చేస్తూ.. తాను అమెరికాలో ఎంబీఏ చేసి, అక్కడే ఆరున్నరేళ్లు ఉద్యోగం చేశానని గుర్తు చేశారు.


కేసీఆర్‌ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇంట్లో పుట్టినా, ప్రస్తుతం హైదరాబాద్‌లో తమ కుటుంబమంతా కలిసి ఉండటానికి సరైన నివాసం లేదని కేటీఆర్‌ తెలిపారు. అందుకే ఫామ్‌హౌ్‌సలో కేసీఆర్‌, తాను నార్సింగిలో వేర్వేరుగా నివాసం ఉంటున్నామన్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్లలో చట్టబద్ధంగా చూపించిన ఆస్తులపై అసత్య ఆరోపణలు చేస్తూ సీఎం చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జన్వాడ విషయంలోనూ మూడేళ్లలో తేల్చిందేమీ లేదని ఎద్దేవా చేశారు.


కేసీఆర్‌ పుట్టినప్పటి నుంచి నేటి వరకు, రేవంత్‌రెడ్డి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు కుటుంబాలకు చెందిన ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రేవంత్‌కు దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించాలని సూచించారు. సిరిసిల్ల పట్టణం ఒకనాటి రాయిని చెరువు భూముల్లోనే విస్తరించి ఉందని, అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలు 60, 70 గజాల చొప్పున ప్లాట్లు చేసి పేదలకు పంచాయని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జీవో 58, 59 కింద ఆ స్థలాలను రెగ్యులరైజ్‌ చేసి పట్టాలిస్తే, దాన్ని కూడా కబ్జా అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ధరణి వచ్చాక టెస్కాబ్‌ మాజీ అధ్యక్షుడు రవీందర్‌రావు, తాను గజం కొన్నట్లు నిరూపించినా.. ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

2004 వరకు కేసీఆర్‌కు ఎకరా భూమి లేదు

2004లో కేసీఆర్‌కు భూమే లేదు

Updated Date - Sep 18 , 2026 | 04:39 AM