పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు.. వాటిపై ఫోకస్..
ABN , Publish Date - Feb 20 , 2026 | 07:19 PM
పెద్దపల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సోదాలకు ముందు డాక్యుమెంట్ రైటర్ ఎండీ రషీద్.. ఓ రైతు నుంచి రూ.16,500ల లంచాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు..
పెద్దపల్లి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ (Anti Corruption Bureau) అధికారులు ఇవాళ (శుక్రవారం) ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా సాగుతున్న అవినీతి భాగోతాన్ని అధికారులు గుట్టురట్టు చేశారు.
రైతు దగ్గర లంచం డిమాండ్..
మంథని మండలానికి చెందిన కన్నూరి బాపు అనే రైతు తన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే అక్కడ పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్ ఎండీ రషీద్.. రూ.16,500ల లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు రైతు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు రైతు బాపు.. రషీద్‌కు లంచం ఇచ్చేందుకు వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు.. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కార్యాలయంలో ముమ్మర తనిఖీలు..
ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయం తలుపులు మూసేసి ముమ్మరంగా సోదాలు చేపట్టారు. డాక్యుమెంట్ రైటర్ రషీద్‌తో పాటు కార్యాలయంలోని ఇతర సిబ్బందికి ఈ అవినీతితో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. రషీద్ వద్ద నుంచి లంచం సొమ్ము రూ.16,500లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల హెచ్చరిక..
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయడానికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత కొంతకాలంగా అక్రమాలు జరుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు ప్రాధాన్యం సంతరించుకుంది. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు
మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
Read Latest Telangana News And AP News And Telugu News