Share News

‘జన్మభూమి’.. రోజూ ఆలస్యమే !

ABN , Publish Date - May 29 , 2026 | 07:50 AM

లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

‘జన్మభూమి’.. రోజూ ఆలస్యమే !
Janmabhoomi Superfast Express

  • పేరుకే సూపర్‌ఫాస్ట్‌.. కానీ సాధారణ రైళ్ల కంటే అధ్వానం

  • సకాలంలో గమ్యం చేరలేక ఉద్యోగులు, ప్రయాణికుల ఇబ్బందులు

  • బయల్దేరే సమయం మార్చడంతోనే సమస్య

హైదరాబాద్‌ సిటీ: లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ గానీ, ఈ రైలు ఏనాడూ సకాలంలో గమ్యస్థానాలకు చేర్చడం లేదని ప్రయాణికులను వాపోతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి నల్లగొండకు 110 కిలోమీటర్ల దూరం కాగా, షెడ్యూల్‌ ప్రకారం గంటన్నరలో చేరుకోవాలి. కానీ 2:30 గంటలకుపైగా పడుతోంది. దీంతో సమీప ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.


గతంలో లింగంపల్లి నుంచి ఉదయం 6:25 గంటలకు రైలు బయలుదేరి సికింద్రాబాద్‌కు 7 గంటలకు వచ్చేది. ప్రస్తుతం ఉదయం 6:55 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు 7:40 నిమిషాలకు రావాల్సి ఉండగా, ప్రతీరోజూ 20 నిమిషాలకుపైగా ఆలస్యంగా వస్తోంది. నల్లగొండకు ఉదయం 9 గంటలకు చేరుకోవాల్సిన రైలు 9:30 నుంచి 10 గంటలకు వెళ్తోంది. గతంలో ఇదే రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 7 గంటలకు బయలుదేరితో నల్లగొండకు 8:30 గంటల వరకు చేరుకునేది. దీని వల్ల ఉద్యోగులు సమయానికి డ్యూటీకి వెళ్లేవారు.


ఏ రైలు ఎదురు వచ్చినా క్రాసింగ్‌లో నిలుపుదల

ఈ రైలు మార్గంలో పగిడిపల్లి వద్ద ట్రాక్‌ సరిగా లేకపోవడంతో నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి నడికుడి వరకు సింగిల్‌ ట్రాక్‌ ఉండడంతో ఎదురుగా ఏ రైలు వచ్చినా.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలునే క్రాసింగ్‌లో నిలుపుతున్నారు. నాగిరెడ్డిపల్లి, బొమ్మాయిపల్లి, వలిగొండ, రామన్నపేట, చిట్యాల, శ్రీరాంపురం వంటి చిన్న స్టేషన్లలోనూ ఆపేస్తున్నారు. వాస్తవానికి రామన్నపేట స్టేషన్‌లో మాత్రమే స్టాప్‌ ఉంది. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య సికింద్రాబాద్‌ వైపు నడికుడి-కాచిగూడ డెమో, గుంటూరు-వికారాబాద్‌ పల్నాడు, హౌరా-సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వస్తుండడంతో జన్మభూమి రైలును ఆపుకుంటూ వెళుతున్న దుస్థితి నెలకొంది. ఈ రైలును పాత సమయంతోనే నడిపేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.


city1.jpgపాత వేళల్లోనే రైలును నడపాలి

సికింద్రాబాద్‌, చర్లపల్లి స్టేషన్ల నుంచి నల్లగొండకు జన్మభూమి రైలులో నాతోపాటు సుమారు 200 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు ప్రతీరోజూ ప్రయాణిస్తుంటారు. తరచుగా ఈ రైలు ఆలస్యం అవుతుండడం వల్ల సమయానికి ఆఫీసుకు వెళ్లలేకపోతున్నాం. పాతవేళల్లోనే నడిపితేనే బాగుంటుంది.

  • రాజ్‌కుమార్‌, ప్రైవేట్‌ ఉద్యోగి


బస్సుల్లో వెళాల్సి వస్తోంది

జన్మభూమి రైలు గంటకుపైగా ఆలస్యం అవుతుండడంతో గత్యంతరం లేక బస్సుల్లో వెళ్లాల్సి వస్తోంది. బస్సులో అధిక చార్జీలు పెట్టలేక, రైలులో వెళ్లి సమయానికి ఆఫీసుకు చేరుకోలేక ఇబ్బంది పడుతున్నాం. పాత వేళల ప్రకారం సికింద్రాబాద్‌ నుంచి 7 గంటలకు రైలు బయలుదేరేలా మార్చాలి.

  • భగవాన్‌, ప్రభుత్వ ఉద్యోగి


ప్రతీరోజూ ఆలస్యమే..

నేను రోజూ చర్లపల్లి నుంచి నడికుడి వరకు వెళ్తుంటాను. ఈ రైలు నడికుడికి వెళ్లేసరికి గంటన్నర ఆలస్యమవుతోంది. దీంతో సమయానికి ఆఫీసుకు వెళ్లలేకపోతున్నా. రోజూ ఇలానే ఇబ్బంది పడుతున్నాం.

  • స్నేహ, బ్యాంక్‌ ఉద్యోగి


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు..

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 29 , 2026 | 07:50 AM