Share News

ఏఐ.. చాలా ఖరీదు గురూ!

ABN , Publish Date - May 29 , 2026 | 05:40 AM

కోడ్‌ రాయడానికి ఏఐ.. కస్టమర్‌ సర్వీ్‌సలో ఏఐ.. ఆరోగ్య రంగంలో ఏఐ.. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, కంటెంట్‌ క్రియేషన్‌, ఈ కామర్స్‌, విద్యారంగం.. ఒక్కటనేమిటి.. ఇందుగలదు అందులేదు అనే సందేహం వలదు..

ఏఐ.. చాలా ఖరీదు గురూ!

ఖర్చు భారీగా పెరిగిపోవడంతో తన సిబ్బందికిచ్చిన క్లాడ్‌ ఏఐ లైసెన్సులను రద్దు చేస్తున్న మైక్రోసాఫ్ట్‌

  • ఉబెర్‌ సంస్థ ఏఐ కోడింగ్‌ టూల్స్‌ వినియోగానికి కేటాయించిన ఏడాది బడ్జెట్‌ 4 నెలల్లోనే ఖతం

న్యూఢిల్లీ, మే 28: కోడ్‌ రాయడానికి ఏఐ.. కస్టమర్‌ సర్వీ్‌సలో ఏఐ.. ఆరోగ్య రంగంలో ఏఐ.. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, కంటెంట్‌ క్రియేషన్‌, ఈ కామర్స్‌, విద్యారంగం.. ఒక్కటనేమిటి.. ఇందుగలదు అందులేదు అనే సందేహం వలదు.. ఎందెందు వెదకి చూసినా అందందే ‘ఏఐ (కృత్రిమ మేధ)’! నాలుగేళ్ల క్రితం చిన్న బిందువులా మొదలైన ఏఐ విప్లవం నానాటికీ జోరందుకుంటోంది. ఇక భవిష్యత్తంతా ఏఐదేనని.. కృత్రిమ మేధతో ఉత్పాదకత భారీగా పెరగడమే కాక, ఉద్యోగులపై ఆధారపడడం తగ్గుతుందని.. దీనివల్ల భారీగా ఖర్చు తగ్గిపోతుందని అంచనాలు, విశ్లేషణలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి! కానీ.. వాస్తవం అందుకు భిన్నంగా కనిపిస్తోంది!! కృత్రిమ మేధతో పనులు సులువవుతాయన్న మాట నిజమేగానీ.. ప్రస్తుతానికి అది చాలా ఖరీదైన వ్యవహారం అని, అనుకున్నంత చవక కాదని.. కంపెనీలకు అర్థమవుతోంది. ఉత్పాదకతను పెంచుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగించి.. మిగిలిన కొంత మంది ఉద్యోగులకు ఏఐ టూల్స్‌ ఇచ్చి, పనిచేయించాలనుకున్న చాలా సంస్థలు ఇప్పుడది ఖరీదైన వ్యవహారంగా మారడంతో తలపట్టుకుంటున్నాయి. ఉదాహరణకు.. ఏఐ వినియోగానికి అవుతున్న ఖర్చు అనుకున్నదానికి మించి అనూహ్యంగా పెరిగిపోతుండడంతో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ తన ఉద్యోగులకు కొన్నాళ్లుగా అందుబాటులో ఉంచిన క్లాడ్‌ ఏఐ కోడ్‌ లైసెన్సులలో చాలావాటిని రద్దుచేయడం ప్రారంభించింది. ‘ఎందుకొచ్చిన ఏఐ.. కోడ్‌ రాయడం కోసం ఎంచక్కా మన సొంత ప్లాట్‌ఫామ్‌ అయున ‘గిట్‌ హబ్‌ కోపైలెట్‌ సీఎల్‌ఐ’ను ఉపయోగించుకోండి’ అని ఉద్యోగులకు సూచించింది. ఖర్చు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మైక్రోసాఫ్ట్‌ బయటకు చెప్పలేదుగానీ.. అసలు కారణం అదేనని విశ్వసనీయవర్గాల సమాచారం. నిజానికి, ఈ ‘క్లాడ్‌’.. ఏఐ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ‘ఆంత్రోపిక్‌’ అనే స్టార్టప్‌ సృష్టి. దాంట్లో మైక్రోసాఫ్ట్‌ సంస్థ 500 కోట్ల డాలర్ల దాకా పెట్టుబడులు కూడా పెట్టింది. కానీ, ఇప్పుడు ఖర్చులను భరించలేక దాని వినియోగాన్నే నిలిపివేసిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అలాగే.. ఊబెర్‌ సంస్థ కార్యకలాపాల నిర్వహణలో భాగంగా ఏఐ కోడింగ్‌ టూల్స్‌ వినియోగానికిగాను కేటాయించిన ఏడాది బడ్జెట్‌ నాలుగు నెలల్లోనే ఆవిరైపోయిందని ఆ సంస్థ సీటీవో ప్రవీణ్‌ నెప్పల్లి నాగ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.


ఎందుకిలా?

కృత్రిమ మేధ టూల్స్‌ వినియోగానికి అయ్యే ఖర్చు.. సంప్రదాయ సాఫ్ట్‌వేర్ల వినియోగ ఖర్చులా స్థిరంగా ఉండదు. ఉదాహరణకు.. మనం మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ టూల్స్‌ వాడాలంటే ఏడాదికి ఇంత అనే పద్ధతిలో చెల్లిస్తాం. అలాగే అడోబ్‌ ఫొటోషాప్‌ వంటి టూల్స్‌ను వాడాలన్నా అంతే. కానీ, ఏఐ వాడకం అలా ఉండదు. వ్యక్తిగత స్థాయిలో ప్రస్తుతం చాట్‌జీపీటీ, జెమినై వంటివాటికి సబ్‌స్ర్కిప్షన్‌ ఆధారిత వినియోగం ఉన్నప్పటికీ వాటికి చాలా పరిమితులు ఉంటాయి. కంపెనీ స్థాయిలో అలా పరిమితులు ఉంటే కుదరదు. అక్కడ ఏపీఐ (అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫే్‌స)ని, క్లాడ్‌ కోడ్‌ వంటి ప్రత్యేక డెవలపర్‌ టూల్స్‌ను ఎలాంటి పరిమితులూ లేకుండా వాడతాయి. టోకెన్‌ ఆధారిత ధరల ప్రకారం.. ఎంత వాడితే అంత మొత్తానికి చెల్లింపులు చేస్తాయి. టోకెన్‌ అంటే ఏమిటంటే?... ఏఐ మోడల్స్‌ మనలాగా భాషను పదాల రూపంలో అర్థం చేసుకోలేవు. మనం ఇచ్చిన ఇన్‌పుట్‌ను చిన్నచిన్న ముక్కలుగా విడగొట్టుకుని, అర్థం చేసుకుని సమాధానమిస్తాయి. అలా విడగొట్టిన ప్రతి ముక్కనూ ఒక టోకెన్‌గా పరిగణిస్తారు. ఒక ఉద్యోగి ఏఐ టూల్‌ను వాడి ఒక పెద్ద కోడింగ్‌ ప్రాజెక్టులో బగ్స్‌ను గుర్తించాలని అడిగితే.. అది బ్యాక్‌గ్రౌండ్‌లో వందలాది పనులు చేస్తుంది. కోడ్‌ను చదవడం, రన్‌ చేయడం, టెస్ట్‌ చేయడం.. తప్పులు వస్తే సరిచేయడం.. ఇలా విస్తృతంగా పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అది లక్షలాది లైన్ల కోడ్‌ను ఏఐ మోడల్‌కు పదేపదే ఇన్‌పుట్‌గా పంపుతుంది. దీనివల్ల రెండు గంటల్లో పని పూర్తయినట్టు అనిపించవచ్చుగానీ.. వాడిన టోకెన్ల కారణంగా ఆ రెండు గంటలకే వేల డాలర్ల బిల్లు వస్తుంది. ఉబెర్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలకు జరిగింది ఇదే!


ఇక ఏఐ పని ఇంతేనా?

ఏఐతో పని చేయించుకోవడం అంత చవక కాదు కాబట్టి.. ఇక కృత్రిమ మేధ వినియోగం తగ్గిపోతుందా? ఖర్చు తగ్గే మార్గమే లేదా? అంటే.. ఏఐ వినియోగానికి ఇప్పుడు అవుతున్న ఖర్చుతో పోలిస్తే.. 2030 నాటికి భారీగా తగ్గుతుందని రిసెర్చ్‌ కంపెనీ ‘గార్ట్‌నర్‌ ప్రాజెక్ట్స్‌’ అంచనా వేస్తోంది. ఆ సంస్థ విశ్లేషణ ప్రకారం.. లక్ష కోట్ల డిజిటల్‌ కనెక్షన్లున్న (1-ట్రిలియన్‌ పారామీటర్‌ ) భారీ ఏఐ మోడల్‌ వినియోగానికి అయ్యే ఖర్చు 2025తో పోలిస్తే 2030 నాటికి 10 శాతానికి పడిపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఒక టోకెన్‌కు రూపాయి ఖర్చయితే.. 2030 నాటికి అది 10 పైసలకు పడిపోయే వీలుంది.అయితే, ‘జెవాన్స్‌ పారడాక్స్‌’ ఆర్థిక సూత్రం ప్రకారం ఏదైనా వస్తువు/సేవ ధర విపరీతంగా పడిపోతే వాడకం అంతేస్థాయిలో పెరుగుతుంది. ఉదాహరణకు.. ఒకప్పుడు మనం మొబైల్‌ డేటాకు 1జీబీకి నెలకు రూ.250దాకా చెల్లించేవాళ్లం గుర్తుందా? అంబానీ పుణ్యమాని డేటా ధరలు ఇప్పుడు కారుచవక అయ్యాయి. కానీ.. మన వినియోగం పెరిగిపోయింది. ఇప్పుడు నెలకు ఒక జీబీ కాదు..రోజుకు 2 జీబీలపైనే వాడేస్తున్నాం. ఫలితంగా (అధిక వినియోగం వల్ల) మన బిల్లు తగ్గకపోగా మరింత పెరిగింది. ఏఐ విషయంలో కూడా అదే జరుగుతుందా? అంటే.. అవుననే అంటున్నారు టెక్‌ నిపుణులు.

ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 29 , 2026 | 05:40 AM