హైడ్రోజన్‌తో కూ.. చుక్‌చుక్!
ABN , Publish Date - May 29 , 2026 | 05:43 AM
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కడానికి రంగం సిద్ధమైంది! పర్యావరణ హిత, సుస్థిర రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో భాగంగా.. భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది!!...
పట్టాలెక్కనున్న తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్‌సెల్ రైలు
ఈ సాంకేతికత ఉన్న అతి తక్కువ దేశాల జాబితాలోకి ఇండియా
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కడానికి రంగం సిద్ధమైంది! పర్యావరణ హిత, సుస్థిర రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో భాగంగా.. భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది!! హరియాణాలోని (ఉత్తర రైల్వే పరిధి) జింద్-సోనీపట్ సెక్షన్ల మధ్య ఈ రైలును ప్రవేశపెట్టడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇది సాధారణ రైళ్లలా కాకుండా.. మెట్రో రైలులా 10 బోగీలతో ఒకే సెట్ (10 కార్ హైడ్రోజన్ ఫ్యూయెల్ ట్రెయిన్ సెట్)గా ఉంటుంది. 1200 కిలోవాట్ సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడిచే ఈ రైలు గరిష్ఠ వేగం గంటకు 75 కిలోమీటర్లు. ప్రస్తుతం హైడ్రోజన్ ఇంధనంతో రైళ్లను నడిపే సాంకేతిక పరిజ్ఞానం జర్మనీ, జపాన్, చైనా, అమెరికాల వంటి దేశాల వద్ద మాత్రమే ఉంది. ఇప్పుడా జాబితాలోకి భారత్ కూడా చేరనుంది. ‘‘నవకల్పనలు, ఇంధన సామర్థ్యం, పర్యావరణ హిత రవాణా వంటివాటిపట్ల తమకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని.. భారత్‌ను కర్బన కాలుష్యం లేని దేశంగా మార్చాలన్న లక్ష్యానికి ఇది ఊతమిస్తుందని భారతీయ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
హైడ్రోజన్ రైళ్లు ఎలా నడుస్తాయంటే..
మనం చూసే రైళ్లకు పైన విద్యుత్ తీగలు ఉంటాయి. వాటి ద్వారా అందే విద్యుత్తు సాయంతో రైళ్లు నడుస్తాయి. కానీ, హైడ్రోజన్ రైళ్లకు అలాంటి వైర్ల అవసరం ఉండదు. అవి తమకు కావాల్సిన కరెంటును రైల్లోనే సొంతంగా తయారుచేసుకుంటాయి. అలా తయారుచేసుకోవడానికి హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించుకుంటాయి. ఇందుకోసం రైలు పైభాగంలో హైడ్రోజన్ ఇంధన ట్యాంకులను అమర్చుతారు. అలాగే.. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అనే పరికరాన్ని అమరుస్తారు. ట్యాంకులో ఉన్న హైడ్రోజన్‌ను, గాలిలోంచి ఆక్సిజన్‌ను ఫ్యూయల్‌సెల్‌లోకి పంపుతారు. అక్కడ ఈ రెండూ కలిసినప్పుడు ఒక రసాయన ప్రక్రియ జరిగి విద్యుత్తు పుడుతుంది. అలా పుట్టిన కరెంటుతో.. రైలు చక్రాలకు ఉన్న శక్తిమంతమైన మోటార్లు తిరుగుతాయి. రైలు ముందుకు కదులుతుంది. అదనంగా వచ్చే కరెంటును, బ్రేకులు వేసినప్పుడు ఉత్పత్తి అయ్యే (రీజనరేటివ్) కరెంటును రైలు అడుగు భాగంలో ఉండే లిథియం అయాన్ బ్యాటరీల్లో భద్రపరుస్తారు. రైలు వేగంగా వెళ్లాల్సివచ్చినప్పుడు ఆ బ్యాటరీ పవర్ కూడా తోడవుతుంది. డీజిల్ ఇంజన్ల నుంచి విషపూరితమైన పొగ వస్తుంది. కానీ, ఈ హైడ్రోజన్ రైళ్ల నుంచి నీటి ఆవిరి మాత్రమే బయటకొస్తుంది. అంటే, వీటివల్ల అస్సలు కాలుష్యం ఉండదు. రైలుపై ఉండే ఈ ట్యాంకుల్లో హైడ్రోజన్‌ను నింపడానికి.. జింద్ వద్ద పూర్తి స్వదేశీ సాంకేతికతతో.. హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కంప్రెస్డ్ హైడ్రోజన్ నిల్వ, పంపిణీకి అవసరమైన అధికారిక అనుమతులను పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రత సంస్థ (పీఈఎ్‌సవో) మంజూరు చేసింది. ప్రమాదాలను నివారించడం కోసం.. హైడ్రోజన్ తయారీ, నిల్వ, ఇంధనం నింపే కేంద్రాల వద్ద హైడ్రోజన్ లీక్ అయితే పసిగట్టే డిటెక్టర్లు, మంటలను గుర్తించే డిటెక్టర్లు వంటి భద్రతా పరికరాలను (సెన్సర్లను) ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ ఇంధనం నింపే వ్యవస్థను 24 గంటలూ పర్యవేక్షిస్తారు. అలాగే, కీలకమైన పనుల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన, ధ్రువీకరించిన సిబ్బందిని మాత్రమే నియమిస్తారు. ప్రారంభ దశల్లో.. ఈ రైలు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరిచేయడానికి, అసలు ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి సుశిక్షితులైన సాంకేతిక నిపుణులు రైల్లోనే ప్రయాణిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News