కర్ణాటక గద్దెపై డీకే.!
ABN , Publish Date - May 29 , 2026 | 05:48 AM
కర్ణాటక ప్రభుత్వ నాయకత్వ మార్పుపై ఉత్కంఠకు తెరపడింది. సీఎం పదవి చేపట్టడానికి డీకే శివకుమార్‌కు లైన్ క్లియర్ అయ్యింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు....
ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా
గవర్నర్ కార్యదర్శికి లేఖ.. క్యాబినెట్ సభ్యులకు అల్పాహార విందు
తదుపరి సీఎం డీకే అని ప్రకటన.. సహకరించాలంటూ సూచన
సిద్దూకు డీకే పాదాభివందనం.. రాజ్యసభకు సిద్దూ ససేమిరా
తదుపరి చర్చల కోసం ఢిల్లీకి ఇరువురు నేతలు
బెంగళూరు, మే 28 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక ప్రభుత్వ నాయకత్వ మార్పుపై ఉత్కంఠకు తెరపడింది. సీఎం పదవి చేపట్టడానికి డీకే శివకుమార్‌కు లైన్ క్లియర్ అయ్యింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు. మంత్రులతో కలిసి ఆయన గురువారం మధ్యాహ్నం లోక్ భవన్‌కు వెళ్లారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అందుబాటులో లేని కారణంగా ఆయన ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. అధిష్ఠానం పిలుపు మేరకు 26వ తేదీన ఢిల్లీ వెళ్లిన సీఎం సిద్దరామయ్య, అక్కడ జరిగిన చర్చల అనంతరం రాజీనామాకు సిద్ధపడ్డారు. రెండు రోజుల్లో రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన ఆదేశాలను పాటించారు. తర్వాత బెంగళూరుకు తిరిగి వచ్చిన సిద్దరామయ్య, మంత్రులను గురువారం ఉదయం బ్రేక్‌ఫా్‌స్టకు ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు అల్పాహార విందుకు హాజరయ్యారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు మధ్యాహ్నం తర్వాత పదవికి రాజీనామా చేస్తున్నానని సిద్దరామయ్య సహచర క్యాబినెట్ సభ్యులకు చెబుతూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అందరూ అధిష్ఠానం ఆదేశాలను పాటించాల్సిందేనన్నారు. మూడేళ్లపాటు తనకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాబోయే సీఎం డీకే శివకుమార్ అని అధిష్ఠానం తెలిపిందని, మంత్రులు, సీనియర్ నేత లు ఆయనకు సహకరించాలని సూచించారు. ఈ సమయంలో డీకే శివకుమార్ సిద్దరామయ్యకు పాదాభివందనం చేసి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీకే కూడా భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం లోక్‌భవన్‌కు వెళ్లిన సీఎం సిద్దరామయ్య, తన రాజీనామా లేఖను సమర్పించారు. తర్వాత సీఎం హోదాలో చివరిసారిగా అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘నా రాజకీయ జీవితం తె రిచిన పుస్తకం. 1983లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యా ను. 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నైతిక విలువలతో, నమ్మిన సిద్ధాంతాలతో పనిచేశాను. ఎన్నడూ రాజీపడలేదు. అధికారం, ఆదాయం కోసం వెంపర్లాడలేదు. ఆస్తులకోసం ఆత్రుత పడలేదు. రెండు సార్లు సీఎంగా అవకాశం ఇచ్చినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ధన్యవాదాలు. రాజ్యాంగం ప్రకా రం నా రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తారని భావిస్తున్నా’ అని అన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారని, రాజ్యసభ సీటు ఇస్తామన్నారని, కానీ తాను అంగీకరించలేదని చెప్పారు. ఢిల్లీ రాజకీయాలపట్ల తనకు ఆసక్తి లేదన్నారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా, స్వచ్ఛందంగా రాజీనామా చేశానని స్పష్టం చేశారు. రాజ్యాంగం ద్వారానే తనకు ఎన్నో పదవులు వచ్చాయన్నారు. మతతత్వ శక్తులపై పోరాటం చేస్తానని తెలిపిన ఆయన.. తుదిశ్వాస విడిచేవరకూ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని వెల్లడించారు.
ఢిల్లీకి వెళ్లిన సిద్దూ, డీకే
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్దరామయ్య, ఆ వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. రాహుల్ గాంధీని కలిసి, ‘మీ ఆదేశాలను పాటించి పదవికి రాజీనామా చేశాను’ అని వివరించేందుకు వెళ్లినట్లు సమాచారం. కాగా సీఎం సిద్దరామయ్య సాయంత్రం 5 గంటకు ఢిల్లీ బయల్దేరగా, రాత్రి 7.30 గంటలకు డీసీఎం డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి వెళ్లారు. తదుపరి ప్రభుత్వంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు విధివిధానాలపై వీరివురూ అధిష్ఠానతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే సీఎల్‌పీ నేత, కేపీసీపీ అధ్యక్షుడి ఎంపికపైనా వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. సీఎల్పీ సమావేశం ఎప్పుడు నిర్వహించేదీ అధిష్ఠానం వద్ద శుక్రవారం ఖరారయ్యే అవకాశం ఉందని, తర్వాత సీఎల్పీ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుందని ఆ వర్గాలు తెలిపాయి.
సిద్దరామయ్య ఢిల్లీ ప్రయాణంలో ఆటంకం
సీఎం పదవికి రాజీనామా చేసి, ఢిల్లీకి బయలు దేరిన సిద్దరామయ్యకు మార్గం మధ్యలో ఆటంకం ఎదురైంది. ఢిల్లీలో అనుకూల వాతావరణం లేని కారణంగా ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక విమా నం రాజస్థాన్‌లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఢిల్లీలో భారీ గాలివాన కొనసాగుతోంది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచన మేరకు ఆ విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు. వాతావరణం అ నుకూలించాక ఢిల్లీకి వెళ్తారు. విమానంలో సిద్దూతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రణదీ్‌పసింగ్ సుర్జేవాలా పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
వేగంగా మారిన పరిణామాలు
కర్ణాటక నాయకత్వ మార్పు విషయంలో పరిణా మాలన్నీ వేగంగా చోటుచేసుకున్నాయి. మంగళ వారం ఢిల్లీకి రావాలని అదిష్ఠానం నుంచి సిద్ధరామ య్య, డీకేలకు పిలుపు వచ్చింది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వీరిద్దరితో అధిష్ఠానం వరస భేటీలు నిర్వహించింది. అగ్రనేత రాహుల్, ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా ఈ చర్చల్లో పాల్గొన్నారు. పదవి నుంచి తప్పుకోవాలని రాహుల్ నేరుగా సిద్దరామ య్యకు చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తదు పరి సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం డీకే శివకుమార్ పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. సీఎల్పీ సమావేశం నిర్వహణ, ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు చేపట్టేవరకూ సిద్దూదే బాధ్యత అని అధిష్ఠానం చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతర్వాత సీఎం పీఠం కోసం సిద్దరామయ్య, డీకే మధ్య గట్టిపోటీ నెలకొంది. రెండున్నరేళ్ల చొప్పున సీఎం పదవిలో కొనసాగాలని ఇరువురి మధ్య ఒప్పం దం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మొదట సిద్దరామయ్యకు అవకాశం ఇచ్చిన అదిష్ఠానం డీకేను ఒప్పించి డిప్యూటీ సీఎంను చేసింది.
ముహూర్తం కోసం ఆగిన డీకే..
డీకే శివకుమార్‌కు ఆధ్యాత్మిక విశ్వాసాలు ఎక్కువ. ప్రతి విషయంలోనూ ఆయన ముహూర్తం చూసుకుంటారు. తుమకూరు జిల్లాలోని కాడుసిద్దేశ్వరమఠం కరిబసవేశ్వరస్వామిజీ (అజ్జయ్య) ఆశీస్సులు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. అజ్జయ్య ఆశీర్వాదంతో పాటు రాజగురు ద్వారకనాథ గురూజీ పెట్టిన ముహూర్తం తప్పనిసరిగా పాటిస్తారు. ఈ కారణంగానే సీఎంగా ఆయన ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారనే విషయంలో స్పష్టత రాలేదని తెలుస్తోంది. అజ్జయ్య సూచనలనే రెండు రోజులుగా డీకే పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారకూడదని, ప్రత్యేకించి మీడియా ముందుకు వెళ్లే విషయం లో జాగ్రత్తలు పాటించాలసి అజ్జయ్య సూచించినట్లు సమాచారం. అందుకే మంగళవారం నుంచి డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడడం లేదు. డీకే శివకుమార్ విశ్వసించే రాజగురు ద్వారకనాథ్, సోమవారం తర్వాత ప్రమాణస్వీకారం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అప్పుడు బాధ్యతలు చేపడితే కనీసం ఎనిమిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చునని చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదే విషయమై ద్వారకనాథ గురూజీ బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ, డీకే శివకుమార్ 35 ఏళ్లుగా తన కు తెలుసునన్నారు. డీకేకు గురుబలం పెరిగిందని, ఇక ఎవరూ ఆయనను ఆపలేరని అన్నారు.
అంతుపట్టని సిద్దూ వ్యూహం
రాష్ట్ర రాజకీయాల్లో ఐదు దశాబ్దాలు ఆరితేరిన నాయకుడు సిద్దరామయ్య. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అల్పసంఖ్యాత (మైనారిటీ), హిందుళిద (బీసీ), దళిత (అహింద) సామాజికవర్గాల పేరిట 20 ఏళ్లుగా ఆయన ఉద్య మం సాగిస్తున్నారు. పదవిలో ఉన్నా, లేకున్నా అహింద నేతగా కొనసాగుతున్నారు. ప్రజాదరణ మెండుగా ఉన్న సిద్దరామయ్య భవిష్యత్తు వ్యూహం ఏమిటో అంతుపట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మూడేళ్లు సీఎం పదవిలో కొనసాగిన ఆయనకు రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచించింది. ప్రత్యామ్నాయంగా రాజ్యసభ సీటు, జాతీయ కాంగ్రెస్ కమిటీలో సముచిత స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. వీటన్నింటికీ సిద్దరామయ్య తోసిపుచ్చారు. జాతీయ రాజకీయాలలోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. సీఎం పదవికి రాజీనామా తర్వాత, క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యేది లేదని స్పష్టం చేశా రు. ఢిల్లీ రాజకీయాల పట్ల ఆసక్తి లేదని ఆయన, రాష్ట్రంలో అత్యున్నత పదవి వదులుకున్నాక కూడా ఎమ్మెల్యేగా ఉంటానని ఎందుకు ప్రకటించారో తెలి యడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ పాలన మరో రెండేళ్లు ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో మరోసారి అహింద ఉద్యమంతో అధిష్ఠానాన్ని ఆకట్టుకోవాలని అనుకుం టున్నారా.. అనే చర్చ కూడా జరుగుతోంది. సెక్యులర్ నేతగా.. పార్టీ, పాలనాపరమైన అనుభవం సిద్దరామయ్య సొంతం.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News