Share News

యాదాద్రి పవర్ ప్లాంట్ పాపం ఎవరిది.. హరీశ్ రావుపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

ABN , Publish Date - Oct 07 , 2026 | 03:24 PM

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పీక్ డిమాండ్ 19, 892 మెగావాట్స్‌కు పెరిగిందని.. అయినా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ పాపం ఎవరిది.. హరీశ్ రావుపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
Bhatti Vikramarka

హైదరాబాద్, అక్టోబర్ 7: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పీక్ డిమాండ్ 19, 892 మెగావాట్స్‌కు పెరిగిందని.. అయినా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. అభినందించాల్సింది పోయి కొందరు అదే పనిగా విమర్శిస్తున్నారని.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పదేళ్లు మంత్రిగా ఉన్న హరీశ్‌రావు ఇలా మాట్లాడటం సరికాదని విమర్శించారు. జెన్‌కో(GENCO), ట్రాన్స్‌కో(TRNSCO)ను ప్రైవేటుపరం చేస్తారని కొందరు రాస్తున్నారని.. దాన్ని మరికొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ మీద ప్రేమ ఉంటే నష్టం చేసే ప్రచారం మానాలని హితవుపలికారు. విద్యుత్ సరఫరాపై ప్రతిపక్షాలు బురదజల్లి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. తమకు రాజకీయాల లబ్ధి కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేశారు.


ఆ పాపం ఎవరిది..

యాదాద్రి పవర్ ప్లాంట్ భారం పాపం ఎవరిదని భట్టి ప్రశ్నించారు. ఎక్కడైనా కోల్ లింకేజి చేసుకుని థర్మల్ పవర్ ప్లాంట్ పెడతారని.. సింగరేణి నుంచి కోల్ సరఫరా చేయిస్తామని చెప్పి యాదాద్రి ప్లాంట్ మొదలు పెట్టారని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కానీ దానికి కావాల్సిన G9 కోల్ సింగరేణి వద్ద లేదని అన్నారు. అయినా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రాజెక్ట్ మొదలు పెట్టారని ఆరోపించారు. యాదాద్రికి ప్రతి ఏటా 14 మిలియన్ టన్నుల కోల్ అవసరమని.. 7 మిలియన్ టన్నుల కోల్ సింగరేణి నుంచి సరఫరా చేస్తామని ఎంఓయూ చేశారని గుర్తుచేశారు. మరో 50శాతం కోల్ ఇంపోర్ట్ చేసుకుంటామని అన్నారని తెలిపారు. 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణి నుంచి కోల్ తేలేదని.. ఇంపోర్ట్ చేసుకోలేదని వ్యాఖ్యానించారు. 2022 ఏప్రిల్‌లో మొత్తం కోల్ మళ్లీ సింగరేణి నుంచే సరఫరా చేస్తుందని మరో అగ్రిమెంట్ చేశారని గుర్తుచేశారు. అసలు సింగరేణి వద్ద యాదాద్రి ప్లాంట్‌కు అవసరమైన G9 కోల్ లేనేలేదని.. కోల్ లేకుండా యాదాద్రి ప్లాంట్ కట్టి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రజలకు లాభం చేశారా?.. నష్టమా?

యాదాద్రి కారణంగా రూ.40వేల కోట్ల అదనపు భారం పడుతోందని భట్టి తెలిపారు. ‘మీరు వేసిన భారం ప్రజలపై పడుతోంది. మీరు ప్రజలకు లాభం చేశారా? నష్టం చేశారా? ఇన్ని తప్పులు చేసి యాదాద్రి ముందుకు వెళ్లి ధర్నా చేస్తాం అంటే ఏమనాలి. మాకు ప్లానింగ్ ఉంది కాబట్టే మణుగూరు వద్ద ఇంకో ప్లాంట్ పెట్టాం. 89.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ థర్మల్ పవర్ ఉత్పత్తి చేశాం. హరీశ్ రావు నోరుందని అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


హరీశ్‌కు ఛాలెంజ్

బొగ్గు లేకుండా యాద్రాద్రి ప్లాంట్ కట్టింది నిజం కాదా అని మాజీ మంత్రి హరీశ్ రావుకు ఉపముఖ్యమంత్రి సవాల్ చేశారు. బొగ్గు లింక్ చేసి ఉంటే ప్లాంట్ ఎందుకు నడవదని నిలదీశారు. కాగితాలపై అన్నీ అబద్ధాలు రాసి వెళ్లారని మండిపడ్డారు. 2014-24 మధ్య 14 కోల్ బ్లాక్స్ మూతపడ్డాయని.. దాంతో ఉత్పత్తి సామర్థ్యం భారీగా తగ్గిందని చెప్పారు. సింగరేణి టెండర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారని.. సింగరేణిని అనేక ఇబ్బందులు పెట్టారని ఫైర్ అయ్యారు. సింగరేణి కోల్ సరఫరా పబ్లిక్ హియరింగ్‌పై కొందరు ఎన్జీటీకి వెళ్తే ఏం ప్రయత్నం చేశారని హరీశ్‌ను ప్రశ్నించారు. తాము వచ్చాక కోల్ సరఫరా చేసి మూడు యూనిట్లును ప్రారంభించినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ

మూసీ రివర్‌ఫ్రంట్‌లో భారీ అభివృద్ధి పనులు.. రూ.1,108 కోట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 03:54 PM