యువతిని మోసం చేసిన దర్శకుడు.. పోలీసుల కేసు నమోదు..
ABN , Publish Date - Mar 07 , 2026 | 09:48 AM
సినీ పరిశ్రమలో అవకాశాలు కల్పిస్తానని యువతిని మోసం చేసిన వెబ్ సిరీస్ దర్శకుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సదరు దర్శకుడు యువతిని కారులో ఎక్కించుకొని అసభ్యకరంగా షూట్ చేసినట్లు పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): వెండితెరపై మెరవాలనే యువతుల ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక వెబ్ సిరీస్ దర్శకుడు యువతిని మోసం చేసి, అసభ్యకరంగా చిత్రీకరించి, ఆపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో యువతులపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి మరో షాకింగ్ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
సోషల్ మీడియాలో ఆ వీడియోలు అప్‌లోడ్..
వెబ్ సిరీస్ దర్శకుడి ఆగడాలపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సినిమాలో లేదా వెబ్ సిరీస్‌లో మంచి అవకాశాలు కల్పిస్తానని నమ్మించి సదరు దర్శకుడు ఒక యువతికి గాలం వేశాడు. యువతిని కారులో ఎక్కించుకుని, ఆమెకు తెలియకుండా, బలవంతంగా అసభ్యకర రీతిలో షూట్ చేశాడు. ఆ వీడియోలను బాధితురాలి అనుమతి లేకుండా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. తన వీడియోలను తొలగించాలని బాధితురాలు వేడుకోగా, సదరు దర్శకుడు ఆమెను భయభ్రాంతులకు గురిచేస్తూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు.
పోలీసుల చర్యలు..
బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడైన దర్శకుడిపై ఐటీ యాక్ట్, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాయమాటలు నమ్మి అపరిచితులతో షూటింగ్‌లకు వెళ్లవద్దని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జూబ్లీహిల్స్ పోలీసులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ సమస్యపై సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ
బేగంపేటలో బాంబు కలకలం.. అధికారులు అప్రమత్తం
Read Latest International News And Telangana News And AP News And Telugu News