పనులు చేయకపోయినా బిల్లులు!
ABN , Publish Date - Oct 27 , 2026 | 09:12 AM
వాటర్‌బోర్డులో వివిధ పనులు చేసిన కొందరు కాంట్రాక్టర్లు బిల్లులు పొందడానికి ఇబ్బందులు పడుతుండగా మరికొందరికైతే పనులు చేయకపోయినా బిల్లులిస్తున్నారు.
ఓ సంస్థకు రూ.1.31 కోట్ల చెల్లింపులు
అక్రమాల పుట్టగా వాటర్‌బోర్డు ఫైనాన్స్ విభాగం
విచారణ చేపట్టిన బోర్డు ఉన్నతాధికారులు
త్వరలోనే శాఖాపరమైన చర్యలు చేపట్టే అవకాశం
బోర్డు ప్రధాన కార్యాలయంలో పతుల పెత్తనం
హైదరాబాద్ సిటీ: వాటర్‌బోర్డులో వివిధ పనులు చేసిన కొందరు కాంట్రాక్టర్లు బిల్లులు పొందడానికి ఇబ్బందులు పడుతుండగా మరికొందరికైతే పనులు చేయకపోయినా బిల్లులిస్తున్నారు. వాటర్‌బోర్డు ఫైనాన్స్ విభాగంలోని కొందరు అధికారులే పనులు చేయని సంస్థలకు దగ్గరుండి బిల్లులు చెల్లిస్తున్నారు. ఇందుకు నజరానాలు పొందుతున్నారు. అంతేకాదు.. చెల్లించాల్సిన బిల్లు కంటే అదనపు చెల్లింపులు సైతం చేస్తున్నారు. వాటర్‌బోర్డు ఫైనాన్స్ విభాగం అక్రమాల పుట్టగా మారిందనే ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇప్పటికే విచారణ చేపట్టారు. త్వరలోనే శాఖాపరమైన చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
వాటర్‌బోర్డులో డిప్యూటేషన్‌పై ఫైనాన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ కారులో తాజాగా రూ.2.40 లక్షలు లభ్యం కావడంతో ఏసీబీ అధికారులు విచారణ నిమిత్తం ఐటీ అధికారులకు అప్పగించిన విషయం విధితమే. ఈ క్రమంలో ఫైనాన్స్ విభాగంలో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మంజీరా జలాల శుద్ధి కోసం కలగ్భూర్‌లోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వార్షిక మెయింటనెన్స్ బిల్లుల చెల్లింపు పేరుతో ఈ నెల 12న ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారా రూ.1.31 కోట్లు ఓ కన్‌స్ట్రక్షన్ సంస్థకు చెల్లించారు. అయితే ఈ సంస్థ అక్కడ పనులు చేయలేదు. పనులు చేసినట్లుగా బిల్లు కూడా పెట్టలేదు.
కానీ ఈ నెల 12న రూ.1.31కోట్లు సదరు సంస్థకు వాటర్‌బోర్డు ఖాతా నుంచి బదిలీ అయ్యాయి. ఆ సంస్థ కూడా బిల్లులో దాదాపు రూ.28 లక్షల వరకు ఖాతా నుంచి డ్రా చేసినట్లు సమాచారం. ఇలా డ్రా చేసిన డబ్బులు సొంతానికి వ్యయం చేశారా? లేకుంటే డబ్బులు బదిలీ చేసినందుకు ఏ అధికారికైనా నజరానా అందించారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో ఆ సంస్థకు చెల్లించిన బిల్లు రికవరీకి చర్యలు చేపట్టినట్లు తెలిసింది. బిల్లుల జారీలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపి త్వరలోనే శాఖాపరమైన చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి.
అక్రమాల పుట్టగా వాటర్‌బోర్డు ఫైనాన్స్
వాటర్‌బోర్డు ఫైనాన్స్ విభాగాన్ని కొందరు అధికారులు అక్రమాల పుట్టగా మార్చినట్లు తెలిసింది. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ పనులకు ప్రతి నెలా వంద కోట్లకు పైగా వ్యయం చేస్తున్నారు. బిల్లులన్నీ ఫైనాన్స్ విభాగం ద్వారానే చెల్లిస్తారు. దీంతో ఇతర శాఖల అధికారులు కూడా ఇక్కడ పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బోర్డులోని అధికారులు ఫైనాన్స్ విభాగాన్ని వదలడం లేదు. బిల్లుల చెల్లింపులో కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రజల కోసం చేసే పనుల బిల్లుల చెల్లింపుల కోసం అనుసరించాల్సిన విధానాన్ని తెలంగాణ అకౌంట్స్ కోడ్ చెబుతుంది. ఈ కోడ్‌లోని నిబంధనలను వాటర్‌బోర్డు ఫైనాన్స్ విభాగం అనుసరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కార్యాలయాల్లోనూ పతుల పెత్తనం
సాధారణంగా సతులు ప్రజాప్రతినిధిగా గెలుపొందితే పతుల పెత్తనం కొనసాగుతుంది. కానీ వాటర్‌బోర్డులోని ఫైనాన్స్ విభాగంలో కొందరు మహిళా అధికారుల భర్తలు పెత్తనం చెలాయించడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతీరోజు సాయంత్రం సమయంలో వాటర్‌బోర్డు కార్యాలయానికి పతులు వచ్చి చాంబర్‌లో తిష్టవేస్తున్నారని, కాంట్రాక్టర్లతో బేరసారాలు జరుపుతున్నారని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఫైనాన్స్ విభాగంలోని ఓ అధికారిని ప్రభుత్వరంగ బ్యాంకులో కాకుండా, ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారే అధికంగా వాటర్‌బోర్డు లావాదేవీలు జరుపుతున్నారు. ఇందుకుగాను ఆ ప్రైవేటు బ్యాంకు సదరు అధికారికి గిఫ్ట్‌గా కారు ఇచ్చి, తన కిందిస్థాయి ఉద్యోగి అయిన బామ్మర్ధి పేరున రిజిస్ర్టేషన్ చేయించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఓ అధికారిని భర్త కాంట్రాక్టరుగా వాటర్‌బోర్డులోనే చెలామణి అవుతున్నారు. ఆయనకు సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థతో పనులు చేస్తే ఇబ్బందులు వస్తాయని, మరో సంస్థ ద్వారా పనులు చేస్తున్నట్లు తెలిసింది.
అన్నింటికీ కమీషన్లు
వాటర్‌బోర్డులో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ పనులు ప్రజలకు అత్యవసరంగా ఉంటాయి. దీన్ని కొందరు మేనేజర్లు, మరికొందరు డీజీఎంలు, జీఎంలు కొన్ని డివిజన్లలో తమ బంధువులు, స్నేహితులను కాంట్రాక్టర్లుగా నియమించుకున్నారు. అత్యవసరం కింద పనులు చేశారంటూ ప్రతీ నెలా కొందరూ జీఎంలు నాలుగైదు పనులు కలిపి దాదాపు రూ.10-20లక్షల వరకు బిల్లులు పెడుతున్నారు. పనులు చేయకపోయినా కొందరు జీఎంలు బిల్లులు పెడుతున్నట్లు తెలిసింది. గతంలో కూకట్‌పల్లి ప్రాంతంలో వార్షిక మెయింటెనెన్స్ పనులకు సంబంధం లేకుండా రూ.10కోట్లకు పైగా ఖర్చు చేయగా.. ఈ అక్రమాలను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం విధితమే. దీంతో సీజీఎం స్థాయి అధికారితో విచారణకు ఆదేశాలిచ్చారు. కానీ ఇప్పటి వరకు విచారణ కమిటీ రిపోర్టు బయటకు రాలేదు. సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వాటర్‌బోర్డు ఫైనాన్స్ విభాగాన్ని చక్కదిద్దుతారా.? ఈ అక్రమాలపై కొరఢా ఝలిపిస్తారా అనేది వేచి చూడాల్సి ఉన్నది.
ఈ వార్తలు కూడా చదవండి:
హరీశ్‌కు తుమ్మిడిహట్టి భయం పట్టుకుంది!
ఎర్రవల్లి 325 సర్వేనెంబర్‌లో హెచ్చరిక బోర్డులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News