Share News

వంద గజాల ఇల్లు.. అనుమతి నిల్‌

ABN , Publish Date - Oct 27 , 2026 | 08:07 AM

హైదరాబాద్‌ నగరంలో సొంత స్థలం ఉండి, ఇల్లు కట్టుకుందామనుకునే పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ నిబంధనలు శాపంగా మారాయి.

వంద గజాల ఇల్లు.. అనుమతి నిల్‌
TG News, Hyderabad

  • కనీస వెడల్పు 20 అడుగులు ఉండాలంటూ కొర్రీలు

  • క్యూర్‌లోని సామాన్యులకు అనుమతి నిరాకరణ

  • అగమ్యగోచరంగా సొంతింటి కల

  • ఓ ప్రైవేటు ఉద్యోగి పొదుపు చేసుకున్న డబ్బులతో పదేళ్ల క్రితం ఘట్‌కేసర్‌ ప్రాంతంలో వంద గజాల ప్లాట్‌ను కొనుగోలు చేశాడు. ఇటీవల ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ప్రయత్నించాడు. ప్లాట్‌ వెడల్పు 18 అడుగులుగా ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తే తీసుకో లేదు. 20 అడుగులుగా ఎంట్రీ చేస్తేనే తీసుకుంటోంది. అయితే, సేల్‌ డీడ్‌లో ప్లాట్‌ సైజు వెడల్పు 18 అడుగులు, పొడుగు 50అడుగులు అని ఉండడంతో అనుమతి తిరస్కరణకు గురవుతుందని దరఖాస్తు చేసుకోలేదు. అనుమతులు లేకుండా బ్యాంకు రుణం ఇవ్వదు. దీంతో సొంతింటి కల నెరవేరని పరిస్థితి నెలకొన్నది.

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ నగరంలో సొంత స్థలం ఉండి, ఇల్లు కట్టుకుందామనుకునే పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ నిబంధనలు శాపంగా మారాయి. ఎంతో కాలంగా దాచుకున్న సొమ్ముతో 100 గజాల లోపు చిన్నప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులకు భవన నిర్మాణ అనుమతులు దక్కడం గగనమైపోతోంది. ప్రభుత్వ ఆన్‌లైన్‌ సిస్టమ్‌ ‘బిల్డ్‌నౌ’ లో పెట్టిన మున్సిపల్‌ నిబంధనల కొర్రీల వల్ల లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు.


20 అడుగుల వెడల్పు పెనుభారం

ప్రస్తుత నిబంధనల ప్రకారం, గ్రేటర్‌ లేదా కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే ప్లాట్‌ వెడల్పు కనీసం 20 అడుగులు ఉండటం తప్పనిసరి. అయితే, నగర శివార్లలోని చాలా అన్‌అప్రూవ్డ్‌ లేఅవుట్లలో ప్లాట్ల వెడల్పు 12నుంచి 25 అడుగుల వరకే ఉంటోంది. ఘట్‌కేసర్‌ వంటి పరిసర ప్రాంతాలలో 15 అడుగుల వెడల్పు, 50అడుగుల పొడవుతో సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్లు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో కనీసం 20అడుగులు ఎంటర్‌ చేస్తేనే సిస్టమ్‌ అనుమతిస్తోంది. డాక్యుమెంట్లు సరిపోలకపోవడంతో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. బిల్డింగ్‌ పర్మిషన్‌ లేకపోవడంతో బ్యాంకులు హోమ్‌ లోన్స్‌ ఇవ్వడం నిలిపివేశాయి.


ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూల్‌

భవన నిర్మాణ అనుమతుల జారీలో రీజియన్లను బట్టి వేర్వేరు రూల్స్‌ ఉండటం గమనార్హం. కోర్‌ అర్బన్‌ (గ్రేటర్‌) పరిధిలో 100 గజాల స్థలానికి కనీసం 20 అడుగుల వెరీజియన్‌లో 18 అడుగుల వెడల్పు ఉన్నా అనుమతులిస్తారు. అలాగే రూరల్‌ అగ్రీ రీజియన్‌ పరిధిలో 18 అడుగుల వెడల్పుతో లేఅవుట్లకు అనుమతి లభిస్తుంది.


బిల్డింగ్‌ కోడ్‌లో సవరణలకు డిమాండ్‌

ఉమ్మడి రాష్ట్రంలో 2012లో తెచ్చిన జీఓ 168 నిబంధనలనే చిన్న సవరణలతో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అన్ని నిబంధనలను క్రోడీకరిస్తూ యూనిఫైడ్‌ డెవల్‌పమెంట్‌ బిల్డింగ్‌ కోడ్‌ (యూడీబీసీ)ను తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. దీని రూపకల్పన బాధ్యతలను ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగించింది. కొత్త బిల్డింగ్‌ కోడ్‌లోనైనా చిన్న ప్లాట్ల వెడల్పు నిబంధనను 20అడుగుల నుంచి కనీసం 15 అడుగులకు సడలించాలని తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తోంది. రిజిస్ట్రేషన్‌ అయిన ప్రతి స్థలానికి ఇల్లు కట్టుకునే హక్కు కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


75 గజాలుంటే ఈజీ..

గ్రేటర్‌ పరిధిలో 75 చ.గజాలోపు స్థలాలకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు.. 15అడుగుల వెడల్పు ఉన్నా కానీ అనుమతులు వస్తున్నాయి. అయితే 100 గజాలున్న వారికి మాత్రం 20 అడుగుల వెడల్పు తప్పనిసరి చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకే నగర పరిధిలో ఇలా వేర్వేరు నిబంధనలు ఉండటం వల్ల కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, మల్కాజిగిరి, పాతబస్తీ వంటి ప్రాంతాల్లోని చిన్న ప్లాట్ల యజమానులు నష్టపోతున్నారు. నగరంలో గతంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి జీవో 58, 59కింద దరఖాస్తు చేసుకుంటే ప్లాట్‌ సైజుతో సంబంధం లేకుండానే క్రమబద్ధీకరించారు. ఇక 59 జీవో కింద మాత్రం క్రయ, విక్రయాలకు అనుమతులిచ్చారు. కానీ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో మాత్రం వంద గజాల స్థలం 20అడుగుల కంటే తక్కువ వెడల్పు ఉంటే మాత్రం భవన నిర్మాణానికి అనుమతులు రావడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

హరీశ్‌కు తుమ్మిడిహట్టి భయం పట్టుకుంది!

ఎర్రవల్లి 325 సర్వేనెంబర్‌లో హెచ్చరిక బోర్డులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 08:07 AM