Share News

దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:40 AM

దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎ్‌సఆర్టీసీ) నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 7వేల ప్రత్యేక బస్సులను నడపనుంది.

దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు
TSRTC Dasara special buses

  • రాష్ట్రవ్యాప్తంగా నడపనున్న టీజీఎ్‌సఆర్టీసీ

  • అత్యధికంగా కరీంనగర్‌ జోన్‌ నుంచి 3,533 బస్సులు

  • స్పెషల్‌ బస్సుల్లో అదనపు చార్జీ

  • మహిళా ప్రయాణికులకు ‘మహాలక్ష్మి’ పథకం వర్తింపు

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎ్‌సఆర్టీసీ) నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 7వేల ప్రత్యేక బస్సులను నడపనుంది. అత్యధికంగా కరీంనగర్‌ జోన్‌ నుంచి 3,533 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ నుంచి 1312 బస్సులు నడపనున్నట్లు తెలిపింది. రీజియన్ల వారీగా.. ఆదిలాబాద్‌ రీజియన్‌ నుంచి 431 ప్రత్యేక బస్సులు, నిజామాబాద్‌ రీజియన్‌ నుంచి 719 బస్సులు, కరీంనగర్‌ రీజియన్‌ నుంచి 1175, వరంగల్‌ రీజియన్‌ నుంచి 530, ఖమ్మం రీజియన్‌ నుంచి 678, మహబూబ్‌నగర్‌ రీజియన్‌ నుంచి 645, మెదక్‌ రీజియన్‌ నుంచి 255, నల్లగొండ రీజియన్‌ నుంచి 815, రంగారెడ్డి రీజియన్‌ నుంచి 440 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ యాజమాన్య వివరించింది.


ప్రధానంగా ఈ నెల 9, 10, 16, 17వ తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించింది. పండుగ తర్వాత తిరుగు ప్రయాణం నేపథ్యంలో ఈ నెల 25, 26వ తేదీల్లో కూడా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ (నల్లచెరువు), ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎ్‌సఆర్టీసీ నడపనుంది. పండుగ రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. దసరా స్పెషల్‌ బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033లలో సంప్రదించాలని సూచించింది.


రెగ్యులర్‌ బస్సుల్లో సాధారణ చార్జీలే..

దసరాకు నడిపే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల నుంచి ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయనుంది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్‌ బస్సుల్లోనూ ఈ సవరించినచార్జీలను వసూలు చేస్తారు. రెగ్యులర్‌ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణించే అవకాశాన్ని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రెగ్యులర్‌తోపాటు దసరాకు నడిపే స్పెషల్‌ బస్సుల్లోనూ కల్పించనున్నారు. ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలను జీవో నంబరు 16 ప్రకారం వసూ లు చేయనున్నారు. స్పెషల్‌ బస్సులకు అయ్యే కనీస డీజిల్‌ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్‌ ధరను సవరించుకునే వీలు కల్పిస్తూ 2003లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ప్రతి ప్రధాన పండుగకు 1.5 రెట్ల వరకు టికెట్‌ ధరల సవరణను ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఆర్టీసీ అమలు చేస్తోంది. టీజీఎ్‌సఆర్టీసీ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ప్రధాన పండుగకు దీనిని అమలు చేస్తోందని సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు.


ఇవి కూడా చదవండి...
రాహుల్‌ పోరాటానికి మద్దతుగా.. సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల దీక్ష

అబద్ధాలను పోగేసి బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం

ట్రైబ్యునల్‌ తేల్చితేనే పాలమూరు-రంగారెడ్డి!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 05:40 AM