రాహుల్ పోరాటానికి మద్దతుగా.. సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల దీక్ష
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:29 AM
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీక్ష చేపట్టారు.
సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా కోరుతూ రాహుల్, ప్రియాంక, ఖర్గే
కేసీ వేణుగోపాల్ చేపట్టిన పోరాటానికి సంఘీభావం
సంగారెడ్డిలోని ఓల్డ్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్
కార్యకర్తలతో దీక్ష ప్రారంభించిన జగ్గారెడ్డి, నిర్మల
దేశ ప్రజల ఓటు హక్కు కోసం రాహుల్ గాంధీ యుద్ధం చేస్తున్నారు
ఆయన పోరాటం కొనసాగినంత కాలం మా దీక్ష కొనసాగుతుంది
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టీకరణ
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
సంగారెడ్డి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజల ఓటు హక్కును, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా.. ఎన్నికల కమిషన్ వ్యవహారశైలిపై జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ బలపడిన రాష్ట్రాల్లో ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకుని అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.
ఎన్నికల కమిషన్ సహకారంతోనే బీజేపీ మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ‘‘ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయ పోరాటం కాదు.. దేశ ప్రజల ఓటు హక్కును కాపాడే రాజకీయ యుద్ధం. దేశ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ రోడ్డుపై కూర్చుని పోరాడుతున్నారు’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం రాహుల్ గాంధీ పోరాటం చేసినన్ని రోజులూ.. సంగారెడ్డిలో తాము కూడా దీక్ష కొనసాగిస్తాం అని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
మ్యూల్ ఖాతాలిచ్చే వారిలో చదువుకున్నోళ్లే ఎక్కువ
అబద్ధాలను పోగేసి బీఆర్‌ఎస్ దుష్ప్రచారం
ట్రైబ్యునల్ తేల్చితేనే పాలమూరు-రంగారెడ్డి!
Read Latest AP News And Telugu News