తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ‘TRS’ పేరుతో ఈసీకి దరఖాస్తు..
ABN , Publish Date - May 21 , 2026 | 06:50 PM
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ‘TRS’ పేరుతో రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం బహిరంగ ప్రకటన వెలువడటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ కలిసి ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఢిల్లీ, మే21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిబంధనల ప్రకారం ‘TRS’ పేరుతో రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం బహిరంగ ప్రకటన వెలువడటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ కలిసి ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త పార్టీకి అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత వ్యవహరించనుండగా, జనరల్ సెక్రటరీగా అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్‌గా రూప్ సింగ్ లకావత్, ట్రెజరర్‌గా డాక్టర్ అరుణ్ కుమార్ నియమితులయ్యారు.
పార్టీ కార్యకలాపాలు బంజారాహిల్స్ రోడ్ నంబర్.14 కేంద్రంగా కొనసాగనున్నట్లు సమాచారం. ఈ పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఎవరైనా అభ్యంతరాలు ఉంటే జూన్ 1వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలపాలని ఈసీ బహిరంగ నోటీసులో పేర్కొంది.అయితే ఈ ప్రకటన తెలుగు పత్రికల్లో కాకుండా పెద్దగా ప్రాచుర్యం లేని హిందీ, ఇంగ్లీష్ పత్రికల్లో ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రాజకీయ వర్గాలు, సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పేరు, గుర్తింపు అంశాలపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది.
ఇక మరోవైపు ‘TRS’ పేరుకు దగ్గరగా ఉండేలా ‘తెలంగాణ రాష్ట్ర సామాజికసేన’ పేరుతో మరో పార్టీ కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో భవిష్యత్తులో పార్టీ పేరు, గుర్తింపు, ఎన్నికల గుర్తుల అంశాలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ పార్టీ కార్యకలాపాలు, రాజకీయ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి...
సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు సీఎం శుభాకాంక్షలు
కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేశాం: బండి సంజయ్
ఆ ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు
Read Latest Telangana News And AP News And International News And Telugu News