తెలంగాణ విమోచన జైత్రయాత్రకు అనుమతి నిరాకరణ.. పోలీసుల అదుపులో నేతలు
ABN , Publish Date - Sep 06 , 2026 | 02:42 PM
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే తెలంగాణ విమోచన జైత్రయాత్ర భారీ బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అలాగే ముందస్తుగా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు 6: తెలంగాణ విమోచన జైత్రయాత్ర, భారీ బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. బాలాపూర్ శివాజీ చౌక్ నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వరకు భారీ ర్యాలీ చేపట్టేందుకు బీజేపీ ఏర్పాట్లుచేసింది. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే మహేశ్వరం బీజేపీ ఇన్‌ఛార్జి అందెల శ్రీరాములు సహా పలువురు నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తమ నేతల అరెస్ట్ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు శివాజీ చౌక్ వద్దకు చేరుకున్నారు. నిరసనకు సిద్ధమైన వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి నిరాకరణ, అరెస్టులపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహించాయి. దీంతో కొందరు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ హిందువులను అణచివేస్తోంది: బీజేపీ నేతలు
పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను అణచివేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అన్యాయంగా అడ్డుకుంటోందని విమర్శించారు. అరెస్టులు, ఆంక్షలతో తమ కార్యక్రమాలను అడ్డుకోలేరని బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో కాంగ్రెస్ ‘మహాధర్నా’.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
భాగ్యనగరంలో గణేశ్ ఆగమన్ కార్యక్రమంలో తొక్కిసలాట.. విద్యార్థి మృతి