హైదరాబాద్‌లో కాంగ్రెస్ ‘మహాధర్నా’.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Sep 06 , 2026 | 01:41 PM
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘మహాధర్నా’ బహిరంగ సభ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు(ఆదివారం)మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘మహాధర్నా’ బహిరంగ సభ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలలో మళ్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
ధర్నాలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాచౌక్ నుంచి ఇందిరా పార్క్ క్రాస్ రోడ్స్, ఆర్కే మఠం, కట్టమైసమ్మ స్లిప్ రోడ్డు మీదుగా ట్యాంక్ బండ్‌లోని పాత అంబేడ్కర్ విగ్రహం వరకూ పాదయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలో ధర్నా చౌక్, ఇందిరా పార్క్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ, సచివాలయం, బీజేఆర్ విగ్రహం, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో వాహనదారుల కోసం నగర ట్రాఫిక్ విభాగం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసింది. నల్లకుంట నుంచి స్టీల్ బ్రిడ్జి మీదుగా కట్టమైసమ్మ వైపు వెళ్లే వాహనాలను అజామాబాద్ క్రాస్ రోడ్స్ వద్ద వీఎస్టీ వైపు మళ్లించనున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరా పార్క్ వైపు వెళ్లే వాహనాలను అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ వద్ద హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్ 8 లేదా బాకారం బ్రిడ్జ్, కవాడిగూడ వైపు మళ్లిస్తారు. కర్బలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ, గాంధీనగర్ టీ-జంక్షన్, డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించనున్నారు. బీజేఆర్ విగ్రహం వైపు నుంచి పాత అంబేడ్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ వెళ్లే వాహనాలను లిబర్టీ టీ-జంక్షన్ వద్ద హిమాయత్‌నగర్ వైపు, హిమాయత్‌నగర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం లేదా సెక్రటేరియట్ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ క్రాస్ రోడ్స్, ట్రాఫిక్ పోలీస్ కాంప్లెక్స్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలను పాత అంబేడ్కర్ జంక్షన్ మీదుగా అప్పర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించనున్నారు.
ఇవి కూడా చదవండి
పార్టీ కోసం కష్టపడిన వారికే స్థానికఎన్నికల్లో ప్రాధాన్యం: బోనబోయిన శ్రీనివాస్ యాదవ్