హెచ్‌ఐవీపై చైతన్యానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు: మంత్రి దామోదర్
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:11 AM
సమాజంలో ఎయిడ్స్ నివారణపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ రోజు(గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవ హారాలు, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. హెచ్‌ఐవీ అనేది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరచే వైరస్ అని తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ఎయిడ్స్ నివారణపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ రోజు(గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవ హారాలు, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) వ్యాఖ్యానించారు. హెచ్‌ఐవీ అనేది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరచే వైరస్ అని తెలిపారు. చికిత్స తీసుకోకుండా ఉంటే అది ఎయిడ్స్‌గా మారుతుందని పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై మానవహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడారు.

హెచ్‌ఐవీపై అవగాహన లేకపోవడం వల్లే భయం..
రక్షణలేని లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి తదితర కారణాలతో హెచ్‌ఐవీ వ్యాపిస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పుకొచ్చారు.షేక్ హ్యాండ్, ఆలింగనం, కలిసి భోజనం చేయడం వంటి సాధారణ పరిచయాల ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించదని అన్నారు. అవగాహన లేకపోవడం వల్లే భయాలు, అపోహలు, వివక్ష పెరుగుతున్నాయని చెప్పారు. హెచ్‌ఐవీ బాధితులను సామాజికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని... వారికి కూడా గౌరవం, సహాయం, సమాన హక్కులు కల్పించాలని సూచించారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ (నివారణ, నియంత్రణ) చట్టం 2017 ప్రకారం, వివక్ష చూపడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఒక్కప్పుడు హెచ్‌ఐవీ ప్రాణాంతక వ్యాధి.. కానీ, ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి కాదని తెలిపారు. సమయానికి పరీక్షలు, సరైన చికిత్స తీసుకుంటే నాలుగైదు దశాబ్దాలు కూడా సాధారణ జీవితాన్ని గడపవచ్చని చెప్పారు.

డ్రగ్స్ చాలా ప్రమాదకరం..
ఎయిడ్స్ నివారణ కోసం తమ ప్రభుత్వం ఉచితంగా టెస్టులు, చికిత్స, మందులు అందిస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 127 టెస్టింగ్ సెంటర్లు, 33 ART సెంటర్ల ద్వారా 1.14 లక్షల మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. ముఖ్యంగా యువతకు ఒక సూచన సెడెంటరీ లైఫ్ స్టైల్_ అనారోగ్యకర అలవాట్లతో జీవితాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు. ఆరోగ్యంగా లేకుంటే ఎంత మంచి సంపాదన ఉన్నా.. వృథానే అని చెప్పారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని.. డ్రగ్స్ చాలా ప్రమాదకరమని అన్నారు. మరీ ముఖ్యంగా ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం వల్ల హెచ్‌ఐవీ, ఇతర రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ఆరోగ్యవంతమైన కుటుంబంతో ఆరోగ్యవంతమైన సమాజం, బలమైన రాష్ట్రం నిర్మితమవుతాయని వెల్లడించారు. మనందరం కలిసి మరింత వైబ్రెంట్ తెలంగాణను తయారు చేసుకుందామని మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి...
కాళేశ్వరంపై విచారణ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది: కవిత
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And International News And Telugu News