Share News

మెట్రోస్టేషన్ల కింద స్టాళ్లపై హైకోర్టు సీరియస్.. జీహెచ్ఎంసీకి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jun 10 , 2026 | 07:28 PM

మెట్రోస్టేషన్ల కింద పాదచారుల కోసం కేటాయించిన ఫుట్‌పాత్ ప్రాంతాల్లో స్టాళ్ల ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పాదచారులు నడిచే ప్రాంతాలను లీజుకు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

మెట్రోస్టేషన్ల కింద స్టాళ్లపై హైకోర్టు సీరియస్.. జీహెచ్ఎంసీకి కీలక ఆదేశాలు
Telangana High Court

హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): మెట్రోస్టేషన్ల కింద పాదచారుల కోసం కేటాయించిన ఫుట్‌పాత్ ప్రాంతాల్లో స్టాళ్ల ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది. పాదచారులు నడిచే ప్రాంతాలను లీజుకు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.


ఈ విచారణ సందర్భంగా న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టుకు వివరాలు సమర్పించారు. మెట్రోస్టేషన్ల కింద ఏర్పాటు చేసిన స్టాళ్ల విషయంలో ఇప్పటికే జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అలాగే వీధి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ, మెట్రోస్టేషన్ల కింద ఉన్న వాణిజ్య స్టాళ్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హైకోర్టు ఫుట్‌పాత్ స్థలాన్ని లీజుకు లేదా అద్దెకు ఎలా ఇస్తారని ప్రశ్నించింది.


పాదచారుల కోసం ఉద్దేశించిన ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడం ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగిస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ ఫిర్యాదుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారో పూర్తి నివేదికను సమర్పించాలని జీహెచ్ఎంసీ, హెచ్ఆర్ఎంఎల్‌లకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మెట్రోస్టేషన్ల కింద ఏర్పాటు చేసిన స్టాళ్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి...

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 07:33 PM