Share News

బాల్య వివాహాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. తరుణి సంస్థతో ఎంఓయూ

ABN , Publish Date - Jun 15 , 2026 | 08:16 PM

తెలంగాణలో బాల్య వివాహాల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ - తరుణి స్వచ్ఛంద సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

బాల్య వివాహాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. తరుణి సంస్థతో ఎంఓయూ
Telangana Government

హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బాల్య వివాహాల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ - తరుణి స్వచ్ఛంద సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమం మంత్రి సీతక్క (Minister Seethakka) సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు.


‘బాల్య వివాహం – బతుకు ఆగం’ నినాదంతో అవగాహన..

‘బాల్య వివాహం – బతుకు ఆగం’ అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని మంత్రి సీతక్క తెలిపారు. బాల్య వివాహాలు, మైనర్ బాలికల గర్భధారణలను నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై కలిగే ప్రతికూల ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.


అధికారులకు ప్రత్యేక శిక్షణ..

అంగన్‌వాడీ సిబ్బంది, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తునట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. బాల్య వివాహాల గుర్తింపు, నివారణ, చట్టపరమైన చర్యలపై వారికి అవసరమైన మార్గదర్శకాలు అందిస్తామని తెలిపారు. అదే విధంగా సోషల్ మీడియా, డిజిటల్ వేదికలు, ప్రచార సామగ్రి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపడతామని చెప్పారు. బాలికల విద్య కొనసాగింపు, ఆరోగ్య సంరక్షణ, భద్రత, స్వయం సాధికారత అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.


స్వయం నిర్ణయాలు తీసుకునే స్థాయికి బాలికలు చేరుకోవాలి..

బాల్య వివాహాల నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజం మొత్తం కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క సూచించారు. ప్రతి బాలిక తన విద్యను పూర్తి చేసుకుని, స్వయం నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకోవాలంటే బాల్య వివాహాలకు పూర్తిగా ముగింపు పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాల్య వివాహాల నిర్మూలన దిశగా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు కలిసి పనిచేస్తేనే శాశ్వత ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో బాల్య వివాహాల నివారణకు మరింత బలమైన వ్యవస్థ ఏర్పడుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

చిన్న తప్పులకూ ఉద్యోగ బహిష్కరణ సరికాదు: సుప్రీంకోర్టు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 15 , 2026 | 08:22 PM