రూ.10వేలు చెల్లించి ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:50 PM
క్యూర్ పరిధిలో ఫ్లాట్ల కోసం రేపటి నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మీ సేవ, వాట్సాప్, వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
హైదరాబాద్, జులై 20 (ఆంధ్రజ్యోతి): క్యూర్ పరిధిలో ఫ్లాట్ల కోసం రేపటి నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) వ్యాఖ్యానించారు. మీ సేవ, వాట్సాప్, వెబ్‌సైట్‌లో వీటికోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రూ.10వేల టోకెన్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. డ్రాలో ఇల్లు రానివారి డబ్బులు వెంటనే చెల్లిస్తామని వెల్లడించారు. ఆయా ఫ్లాట్లు పదేళ్ల పాటు అమ్మరాదని.. అద్దెకు ఇవ్వరాదని షరతును విధిస్తామని అన్నారు. కుటుంబంలో ఒకరికి ఇళ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
వారికి తొలివిడతలో ప్రాధాన్యం కల్పిస్తాం..
క్యూర్ పరిధిలో ఇల్లు, స్థలం లేనివారికి తొలివిడతలో ప్రాధాన్యం కల్పిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. లబ్ధిదారుల పేరిట స్థలం రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. స్థలంతో పాటు రూ.5లక్షల సబ్సిడీ అందజేస్తామని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వాట్సాప్ దరఖాస్తులు, LIG ఇళ్ల బ్రోచర్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు.
రూ.5లక్షల సహాయం అందజేస్తాం..
వారికి స్థలం ఇవ్వడంతో పాటు రూ.5లక్షల సహాయం అందజేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. పదేళ్ల వరకు ఇళ్లు అమ్ముకునే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. CUREలో మొదటి దశలో 16నియోజకవర్గాల్లో ఇస్తున్నామని.. త్వరలోనే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఆయా పార్టీలు, రాజకీయాలకు సంబంధం లేకుండా ఇళ్లను కేటాయిస్తామనిపేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి అవుతున్నాయని ఇప్పటికే రెండు విడతల్లో ఏడు లక్షల ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సొంత స్థలాలు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు అందజేశామని వెల్లడించారు.
ఇంటి స్థలంలేని పేదల కల నెరవేరుస్తాం..
ఇంటి స్థలంలేని పేదలకు కూడా వీటిని అందజేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి వివరించారు. లాభం, స్వార్థం లేకుండా పేదలకు ఇళ్లు నిర్మించి అందజేస్తున్నామని పేర్కొన్నారు. CURE పరిధిలో ఇళ్లు కట్టించే పథకాన్ని ఈ రోజు ప్రారంభించామని తెలిపారు. ఇందుకోసం పదహారు నియోజకవర్గాల్లో స్థలాలు ఎంపిక చేశామని చెప్పుకొచ్చారు. 528 అడుగుల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో తప్పిదాలతో అప్పుడు కట్టిన ఫ్లాట్లు ఉపయోగపడకుండా పోయాయని చెప్పారు. నగరానికి దూరంగా 35 కిలోమీటర్ల దూరంలో కట్టడంతో పేదలు అక్కడకు వెళ్లలేదని తెలిపారు.
పేదలకు ఇళ్లు ఇస్తామంటే కొందరు హేళన చేశారు..
చదరపు గజానికి లక్షల విలువ ఉండే కోర్ ప్రాంతంలో టవర్లు నిర్మించి పేదలకు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కొందరు హేళన చేశారని అన్నారు. ఈ పథకం ఫెయిల్ అయితే విమర్శించాలని కొందరు సంతోషపడ్డారని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదలకు ఇంటి కల నెరవేర్చాలని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలా ఇళ్లు కట్టించి ఇవ్వడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు: మంత్రి శ్రీధర్ బాబు

గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రం తమ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఆ లక్ష్యంతోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం LIG ఇళ్లను నిర్మించిందని తెలిపారు. నగరంలో చాలాచోట్ల హౌసింగ్ బోర్డు కాలనీలు ఉన్నాయని ప్రస్తావించారు. ఎంత విలువైన భూమి అయినా పేదలకు ఇవ్వాలని తాము నిర్ణయించామని చెప్పుకొచ్చారు. పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతోందని స్పష్టం చేశారు. ఇళ్ల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. మొదటి విడతలో 16నియోజకవర్గాల్లో 7680 ఫ్లాట్లను నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
హౌసింగ్ విభాగాన్ని పునరుద్ధరించాం: మంత్రి పొన్నం ప్రభాకర్

CURE పరిధిలోని ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో స్థలం లేని పేదలు కిరాయి ఇళ్లలో ఉంటున్నారని తెలిపారు. CUREలో పేదలకు తమ ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునే పథకాన్ని ప్రారంభించామని వెల్లడించారు. గత ప్రభుత్వం హౌసింగ్ విభాగాన్నే రద్దు చేసిందని చెప్పుకొచ్చారు. తాము దాన్ని పునరుద్ధరించామని అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ బోనాల ముందు CUREలో ఈ పథకం ప్రారంభించామని వెల్లడించారు. మళ్లీ వచ్చే బోనాల నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అయోధ్య విరాళాల వివాదం.. కేంద్రానికి ఖర్గే, రాహుల్ లేఖ
గాంధీభవన్ చుట్టూ తిరిగితే కుదరదు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్
టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కి ఈశ్వరమ్మ లేఖ.. ఎందుకంటే
Read Latest AP News And Telangana News And National News
And Telugu News