గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్: జ్యూరీ కమిటీలో కీలక మార్పు..
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:38 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో మార్పులు జరిగాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గద్దర్ పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజాన్ని నింపనున్నాయి..
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సినిమా రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Gaddar Film Awards) ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జ్యూరీ కమిటీలో కీలకమైన మార్పు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో భాగంగా ఇచ్చే 'స్పెషల్ అవార్డ్స్' విభాగం జ్యూరీ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత, విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజాను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతల్లో ఉన్న లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్థానంలో ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ బాధ్యతలు స్వీకరించనున్నారు.
చలనచిత్ర పరిశ్రమలో తమ్మారెడ్డికి ఉన్న సుదీర్ఘ అనుభవం, సామాజిక అంశాలపై ఆయనకున్న అవగాహనను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజా గాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులను ప్రవేశపెట్టింది. గద్దర్ పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజాన్ని నింపనున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, కళలను ప్రతిబింబించే చిత్రాలకు ఈ అవార్డులలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. గతంలో ఉన్న నంది అవార్డుల స్థానంలో ఈ నూతన అవార్డులను ప్రతి ఏడాదీ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 2024 - 25 సంవత్సరంలో విడుదలైన సినిమాలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు
మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
Read Latest Telangana News And AP News And Telugu News