Share News

365 మండలాల్లో కరువు

ABN , Publish Date - Oct 28 , 2026 | 03:55 AM

ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం, భూగర్భ జలాలు పడిపోవడంతో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ శాఖల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రాష్ట్రంలో 365 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

365 మండలాల్లో కరువు
Telangana Drought 2026

  • 111 మండలాల్లో తీవ్రంగా.. 254 చోట్ల మధ్యస్థంగా

  • నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా 28 చోట్ల

  • రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన.. జీవో జారీ

  • ప్రత్యేక కరువు ప్యాకేజీ కింద రూ.20 వేల కోట్లు అవసరం

  • సెంట్రల్‌ పూల్‌ నుంచి 1500 మెగావాట్ల విద్యుత్‌ ఇవ్వాలి

  • ఉపాధి హామీ పథకంలో మొత్తం కూలి కేంద్రమే భరించాలి

  • రాష్ట్రానికి అదనపు పనిదినాలు కేటాయించాలని విజ్ఞప్తి

  • ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలి

  • రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖ

  • అంచనా వేసిన దానికంటే పెరిగిన కరువు మండలాలు

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం, భూగర్భ జలాలు పడిపోవడంతో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ శాఖల నుంచి నివేదికలు, క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా రాష్ట్రంలో 365 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 31 జిల్లాల పరిధిలో 111 మండలాల్లో తీవ్రమైన కరువు, 254 మండలాల్లో మధ్యస్థ కరువు మండలాలు ఉన్నట్లు గుర్తించింది.


ఇందులో అత్యధికంగా నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో 28 చొప్పున మండలాలు ఉండగా, సూర్యాపేటలో 23, ఆదిలాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో 20 చొప్పున, నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 18 చొప్పున మండలాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ కొన్నిచోట్ల తీవ్రంగా, కొన్ని ప్రాంతాల్లో మధ్యస్థంగా కరువు ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో ఎం.ఎస్‌. నంబరు 3ను జారీ చేసింది. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఈ జీవోలో పొందుపరిచింది. కరువు మండలాలను ప్రకటించిన నేపథ్యంలో కరువు ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. అలాగే సెంట్రల్‌ పూల్‌ కింద 1500 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేయాలని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని (2026-27 ఆర్థిక సంవత్సరం జీఎ్‌సడీపీకి) కేంద్రాన్ని కోరాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.


దీంతోపాటు ఉపాధి హామీ పథకంలో కూలి మొత్తాన్ని కేంద్రమే భరించేలా అదనపు పనిదినాలను కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేయనుంది. కరువు ప్రభావిత ప్రాంతాలు, ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ఆ సమావేశం తరువాత రెండు రోజుల్లో కేంద్రానికి లేఖ రాయనుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ప్రతినిధుల బృందం రాష్ట్రానికి వచ్చి పర్యటించనుంది. పర్యటన అనంతరం ఆ బృందం కేంద్రానికి ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్రానికి సాయం అందుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కరువు మండలాల్లో ఎక్కడైనా పట్టణ ప్రాంతాలు ఉంటే.. వాటిని కరువు ప్రభావితంగా పరిగణించరు. కానీ, తాగునీటి విషయంలో మాత్రం కరువుతో సమానంగానే పరిగణిస్తారని జీవోలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత వేసిన అంచనాల్లో 235 మండలాల్లోనే కరువు ఉంటుందని భావించగా, ఇప్పుడు అది 365 మండలాలకు చేరుకుంది.


కరువు సాయం ఇలా.. కలెక్టర్లకు బాధ్యతలు

రాష్ట్రంలో గుర్తించిన కరువు మండలాల్లోని రైతులకు వ్యవసాయం సహా ఇతరత్రా పలు విధానాల్లో సాయం అందించాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యవసాయ పెట్టుబడి సాయాన్ని (సబ్సిడీ రూపంలో) నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు బ్యాంకు రుణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. పంట రుణాల పునర్‌వ్యవస్థీకరణ, రుణాల వసూళ్ల విషయంలో రైతులపై బలవంతపు చర్యలు లేకుండా చూడడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ శాఖకు నిర్దేశించింది.


మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం, అదనంగా 50 పనిదినాలను వీబీ-జీ-రామ్‌ కింద కేటాయించాలని, అవసరమైన చోట తాగునీటి సరఫరాను మెరుగుపరడం, పశుగ్రాసం అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొంది. గుర్తించిన కరువు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ కరువు ప్రభావిత మండలాల ప్రకటన ఆరు నెలలపాటు లేదా అంతకుముందే ఉపసంహరించే వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో లేని మండలాల్లోనూ పరిస్థితులు మరింత దిగజారితే, మరో నోటిఫికేషన్‌ ద్వారా వాటిని కూడా కరువు ప్రభావిత ప్రాంతాల జాబితాలోకి చేర్చే అవకాశం ఉందని తెలిపారు.


తగ్గిన సాగు విస్తీర్ణం.. నిండని జలాశయాలు..

ఈ ఏడాది జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు సాధారణంగా 740.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో 615.5 మి.మీటర్ల వర్షపాతమే నమోదైందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 17 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. వానాకాలం సీజన్‌ సాగు విస్తీర్ణం గతంలో 139.28 లక్షల్లో ఉండగా, ఈసారి 126.06 లక్షల ఎకరాలకు తగ్గింది. ఇందులో వరి సాగు విస్తీర్ణం 69.19 లక్షల ఎకరాల నుంచి 57 లక్షలకు తగ్గింది. ఇక రాష్ట్రంలోని ప్రధాన, మధ్య తరహా జలాశయాల్లో నీటి నిల్వలు.. మొత్తం సామర్థ్యంతో పోల్చితే ప్రస్తుతం తక్కువగా ఉన్నాయి. జలాశయాల్లో మొత్తం 585 టీఎంసీలు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 179.63 టీఎంసీల నిల్వలే ఉన్నాయని జీవోలో తెలిపారు.


జిల్లాల వారీగా ప్రభుత్వం ప్రకటించిన మండలాల సంఖ్య

జిల్లా

మండలాల సంఖ్య

ఆదిలాబాద్‌

20

భద్రాద్రి కొత్తగూడెం

16

హనుమకొండ

14

జగిత్యాల

03

జనగామ

04

భూపాలపల్లి

05

జోగులాంబ గద్వాల

13

కామారెడ్డి

04

కరీంనగర్‌

03

ఖమ్మం

17

ఆసిఫాబాద్‌

05

మహబూబాబాద్‌

07

మహబూబ్‌నగర్‌

13

మంచిర్యాల

11

మెదక్‌

02

మేడ్చల్‌--మల్కాజిగిరి

09

ములుగు

04

నాగర్‌కర్నూల్‌

13

నల్గొండ

28

నారాయణపేట

13

నిర్మల్‌

09

నిజామాబాద్‌

18

రాజన్న సిరిసిల్ల

02

రంగారెడ్డి

18

సంగారెడ్డి

28

సిద్దిపేట

08

సూర్యాపేట

23

వికారాబాద్‌

20

వనపర్తి

11

వరంగల్‌

08

యాదాద్రి భువనగిరి

17

మొత్తం

365


ఈ వార్తలు కూడా చదవండి:

దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్‌ నివేదికలు బుట్టదాఖలు

పంటకు మురుగు నీరే దిక్కాయె!

ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 04:14 AM