ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
ABN , Publish Date - Oct 26 , 2026 | 10:13 PM
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తాజాగా ఘాటుగా స్పందించింది. ‘దేశ వ్యతిరేక శక్తులకు మేము చెప్పేదేంటంటే.. మోదీ తప్పుకునే ప్రసక్తే లేదు’ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తాజాగా ఘాటుగా స్పందించింది. ‘దేశ వ్యతిరేక శక్తులకు మేము చెప్పేదేంటంటే.. ప్రధాని మోదీ తప్పుకునే ప్రసక్తే లేదు’ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేసింది.
ఇటీవల పట్నాలో బిహార్ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్ జయంతి కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ ప్రధాని మోదీతో పాటూ ఆయన తండ్రి కూడా తప్పుకోవాల్సిందే అని వ్యాఖ్యానించడం కాంట్రవర్సీకి దారి తీసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ పదవి నుంచి తప్పుకోరంటూ సభకు వచ్చిన ఓ వ్యక్తి పెద్దపెట్టున నినాదాలు చేయడంపై ఖర్గే ఈ మేరకు కామెంట్ చేశారు.
ఖర్గే వ్యాఖ్యలపై హోం మంత్రి అమిత్ షా కూడా ఆదివారం మండిపడ్డారు. ప్రధాని మోదీ, ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పదే పదే అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే వ్యాఖ్యలు అన్ని హద్దులూ దాటాయని చెప్పారు. రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ పదే పదే మర్యాద మరిచి హద్దు మీరుతోందని చెప్పారు. ఖర్గే క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ శ్రేణులు కూడా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిరసనలకు తెరతీశాయి.
బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా స్పందించారు. ఉత్తరాఖండ్లో ఖర్గే వచ్చి వెళ్లిన నేపథ్యంలో జరిగిన శుద్ధీకరణ కార్యక్రమానికి బీజేపీ క్షమాపణలు చెప్పాలని అన్నారు. ప్రధాని మోదీ సిద్ధాంతాలకు మూలమైన ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్
బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్