Share News

బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్

ABN , Publish Date - Oct 26 , 2026 | 08:44 PM

యూపీఐ ఎండీఆర్ చార్జీల విధింపుపై తమిళనాడు నేత కే అన్నామలై విమర్శలు గుప్పించారు.

బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్
K. Annamalai

ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ ఎండీఆర్ చార్జీల విధింపుపై తమిళనాడు నేత కే అన్నామలై విమర్శలు గుప్పించారు. ఈ చార్జీల నుంచి చిరు వ్యాపారులకు మినహాయింపు ఇవ్వాలని అన్నారు. ఉడిపిలో ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. యూపీఐ వ్యవస్థ నుంచి ఆదాయం కంటే స్థానిక వ్యాపారుల జీవనోపాధిని కాపాడుకోవడమే ముఖ్యమని చెప్పారు. ‘యూపీఐ అంటే ప్రతి రోజూ బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిది. ఒక్కసారిగా వంద గుడ్లు కావాలన్న ఆశతో దాన్ని చంపేస్తే చివరకు ఏమీ మిగలదు’ అని అన్నామలై అన్నారు.


యూపీఐ వ్యవస్థ ఇప్పుడు రోజువారీ జీవితంలో ఓ భాగమైందని అన్నారు. ఈ దశలో చార్జీలు విధిస్తే మొత్తం వ్యవస్థ బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరించారు. లావాదేవీలు ఉచితం కావడంతో యూపీఐ ఈ స్థాయిలో ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. బీజేపీకి మంచి పట్టు ఉన్న కోస్తా జిల్లాలో అన్నామలై ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిర్వహణ, బలోపేతానికి ఈ చార్జీలను విధిస్తున్నట్టు కేంద్రం ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. రూ.2 వేలకు పైబడిన కొన్ని వాణిజ్య లావాదేవీలపై 0.4 శాతం మేర చార్జీ విధిస్తామని పేర్కొంది. చిరు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని పేర్కొంది. 96 శాతం వాణిజ్య లావాదేవీలపై ఎలాంటి చార్జీ ఉండదని స్పష్టం చేసింది. తొలుత అక్టోబర్ 12 నుంచి ఈ చార్జీలు అమలు కావాల్సి ఉన్నా పండుగ సీజన్ నేపథ్యంలో వాయిదా వేసినట్టు ఎన్‌పీసీఐ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది.


ఈ వార్తలనూ చదవండి:

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు

రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి అరెస్ట్!

Updated Date - Oct 26 , 2026 | 08:49 PM