Share News

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:04 PM

ఫర్జీ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా ఆకట్టించేందుకు రంగంలోకి దిగిన రాజస్థాన్ పోలీసులు తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు
Fake Currency Notes Racket Busted

ఇంటర్నెట్ డెస్క్: ఫర్జీ అనే వెబ్‌సిరీస్ స్ఫూర్తితో ఓ ముఠా నకిలీ నోట్ల ముద్రణకు దిగింది. ఐదు రాష్ట్రాలకు విస్తరించింది. ఈ ముఠా గుట్టురట్టు చేసేందుకు ఆపరేషన్ నాట్‌ఫ్లిక్స్‌ను ప్రారంభించిన రాజస్థాన్ పోలీసులు తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. యూపీకి చెందిన రవికుమార్, ముహమ్మద్ ఆరిఫ్, హర్యానాకు చెందిన ఆనంద్ రాజ్‌పుత్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తరుణ్ మలేకర్, రాజస్థాన్‌కు చెందిన భవేశ్ ఖతిక్, నయన్ జ్యోషిలను అదుపులోకి తీసుకున్నారు.


ముఠా ఆటకట్టించింది ఇలా..

సెప్టెంబర్ 29న భవేశ్ ఖతిక్, నయన్ జ్యోషిలను దుంగర్‌పూర్ (రాజస్థాన్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4.95 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గ్యాంగ్ కార్యకలాపాల విస్తృతిపై పోలీసుల దృష్టిపడింది. పట్టుబడ్డ ఇద్దరు నిందితులను విచారించడంతో మిగతా వారి గుట్టుమట్లు తెలిశాయి.

ముఠా కార్యకలాపాలు ఇలా..

ఈ కేసులో ప్రధాన నిందితుడు రవి కుమార్ అని దుంగర్‌పూర్ డీఎస్పీ తెలిపారు. పోలీసులకు చిక్కకుండా అతడు తన సిమ్‌లను తరచూ మార్చేవాడని తెలిపారు. చివరకు అతడిని పంజాబ్‌లోని ఓ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. మరోనిందితుడైన రాజ్‌పుత్‌కు వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో దొంగనోట్ల ముద్రణ ఐడియా వచ్చిందని చెప్పారు. ఇందుకు సంబంధించి యూట్యూబ్ వీడియో లింకులు కూడా లభించాయి.


నిందితులు ఓ టెలిగ్రామ్ ఛానల్‌ ద్వారా నోట్ల ముద్రణకు కావాల్సిన పేపర్‌ను సమకూర్చుకున్నారు. వీళ్లకు పేపర్ సప్లై చేసిన ఆరిఫ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ కరెన్సీ ముద్రణకు కావాల్సిన డిజిటల్ ఫైల్‌ను సరఫరా చేసిన తరుణ్ మలేకర్ కూడా పోలీసులకు చిక్కాడు. అసలు వీళ్లకు డిజిటల్ ఫైల్, పేపర్లు ఎలా లభించాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా నెట్‌వర్క్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు విస్తృత దర్యాప్తును ప్రారంభించారు.


ఈ వార్తలనూ చదవండి:

రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి అరెస్ట్!

ఖర్గే వ్యాఖ్యల దుమారం.. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల నిరసనలు

Updated Date - Oct 26 , 2026 | 07:20 PM