Share News

దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్‌ నివేదికలు బుట్టదాఖలు

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:37 AM

దేవాదాయ శాఖలో అక్రమాలపై విజిలెన్స్‌ విభాగం విచారణ జరిపి నివేదికలు సమర్పిస్తున్నా.. వాటి ఆధారంగా చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్‌ నివేదికలు బుట్టదాఖలు
Telangana temple corruption

  • చర్యల్లో జాప్యం.. ప్రభుత్వ ఆదేశాల అమలులోనూ నిర్లక్ష్యం

  • ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే దేవాదాయ శాఖ

  • ఆ శాఖలో కొందరు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖలో అక్రమాలపై విజిలెన్స్‌ విభాగం విచారణ జరిపి నివేదికలు సమర్పిస్తున్నా.. వాటి ఆధారంగా చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా.. ఆ ఆదేశాల అమలు మాత్రం ఆశించిన స్థాయిలో జరగట్లేదు. ఉదాహరణకు.. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట పరిధిలోని అమ్రాబాద్‌ మండలం మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించి ఆలయ ఆదాయ, వ్యయాల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం విచారణ జరిపి నివేదిక సమర్పించింది. దాని ప్రకారం.. 2006-07, 2007-08, 2008-09 ఆర్థిక సంవత్సరాల్లో మానవ కేశాల వేలం, కొబ్బరికాయల విక్రయ హక్కులు, లడ్డూల విక్రయం, కోడి పుంజులు-కోళ్ల విక్రయం, హుండీ, టికెట్లు, బంగారం-వెండి తదితర ఆదాయ వనరుల ద్వారా ఆలయానికి వచ్చిన మొత్తాలకు, దేవాదాయ శాఖకు ఈవో చూపిన వార్షిక ఆదాయానికి మధ్య వ్యత్యాసాలున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.


అంతేకాదు ఆలయానికి చెందిన సుమారు రూ.60 లక్షల నిధులతో గోపురాలు, ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టారని, ఇందుకు టెండర్లు ఆహ్వానించలేదని అందిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌ విభాగం ఆలయ కార్యాలయాన్ని సందర్శించి సంబంధిత రికార్డులను పరిశీలించింది. లెక్కలు నిగ్గు తేల్చిన విజిలెన్స్‌ అధికారులు అప్పటి ఈవోపై అక్రమాలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, దుర్వినియోగమైన నిధుల్ని రాబట్టాలని సూచించారు. అక్రమాలు జరిగిన సమయంలో ఆలయంలో పనిచేసిన జూనియర్‌ అసిస్టెంట్లపైనా చర్యలు తీసుకోవడంతోపాటు ఈవో పనితీరును పర్యవేక్షించడంలో విఫలమైన అప్పటి ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ కమిషనర్లు, పర్యవేక్షణాధికారులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ నివేదిక సూచించింది. ఇదంతా జరిగి ఆరేళ్లు గడిచినా.. విజిలెన్స్‌ నివేదికను అమలు జరపకుండా ఉన్నతాధికారులు కాలయాపన చేస్తున్నారు.


ఈ ఒక్క కేసే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా ఆలయాల్లో దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బందిపై వచ్చిన అవినీతి, అక్రమాల విషయంలో విజిలెన్స్‌ నివేదికలు అమలు కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరో కేసులో.. విజిలెన్స్‌ నివేదికలో పేర్కొన్న ఒక జూనియర్‌ అసిస్టెంట్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. అతనికి పదోన్నతి కల్పించి అందలం ఎక్కించేందుకు కొందరు అధికారులు పావులు కదుపుతుండటం పట్ల సొంత శాఖలోని సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక డిప్యూటీ కమిషనర్‌ స్థాయి అధికారితోపాటు మరికొందరు అతనికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయ శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్‌ రెడ్డి పర్యవేక్షణలోనే ఉన్న నేపథ్యంలో.. ఎన్నో ఏళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న ఆ శాఖ పనితీరు ప్రక్షాళనకు సీఎం చర్యలు చేపట్టాలని అటు భక్తులు, ఇటు ఆ శాఖ సిబ్బందిలో కొందరు కోరుతున్నారు.


జైలుకు వెళ్లివచ్చిన ఈవోకు డిప్యూటీ కమిషనర్‌ అండ

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఆలయం హుండీ అక్రమాల కేసులో ఓ ఈవోను పోలీ్‌సలు అరెస్ట్‌ చేశారు. పోలీస్‌ విచారణలో రూ.41,500 మేర అక్రమాలకు పాల్పడినట్లు సదరు ఈవో అంగీకరించారు. ఈవోతోపాటు అతనికి సహకరించిన మరో ఉద్యోగిని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టు ఆదేశాల మేరకు జుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. సదరు ఈవో సమీప బంధువు ఒకరు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌(డీసీ) స్థాయిలో పనిచేస్తున్నారు. దీంతో ఈవో జైలు నుంచి విడుదలైన రోజుల వ్యవధిలోనే తిరిగి ఆయనకు పోస్టింగ్‌ ఇప్పించడంలో డీసీ కీలకంగా వ్యవహరించినట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు అక్రమార్కులు.. ఉన్నతాధికారుల్ని, ప్రధాన కార్యాలయంలో కీలక విభాగంలో పనిచేసే సెక్షన్‌ సూపరింటెండెంట్లను ప్రసన్నం చేసుకుని సులువుగా తప్పించుకోవడంతోపాటు, కీలక ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్నారని, వారి వల్ల అర్హులైనవారికి అవకాశం దక్కడం లేదని సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎండిన పైరుకు నిప్పు!

పంటకు మురుగు నీరే దిక్కాయె!

ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 05:37 AM