ఎండిన పైరుకు నిప్పు!
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:22 AM
రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంట కళ్లముందే ఎండిపోతుంటే ఆ కౌలు రైతు తట్టుకోలేకపోయాడు. సమయానికి విద్యుత్, నీటి సరఫరా అందక ఎండిపోతున్న పంటను చూసి మనస్తాపంతో తన చేనుకు నిప్పుపెట్టాడు.
సకాలంలో విద్యుత్ ఇవ్వలేదని కౌలు రైతు ఆవేదన
నీళ్లు, కరెంటు లేక చేతికొచ్చే సమయంలో ఎండిన పంట
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్)లో ఘటన
ఆదుకోవాలని రైతుల ఆవేదన
ఆత్మకూరు(ఎస్), అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంట కళ్లముందే ఎండిపోతుంటే ఆ కౌలు రైతు తట్టుకోలేకపోయాడు. సమయానికి విద్యుత్, నీటి సరఫరా అందక ఎండిపోతున్న పంటను చూసి మనస్తాపంతో తన చేనుకు నిప్పుపెట్టాడు. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్)లో ఈ ఘటన జరిగింది. మండల కేంద్రానికి చెందిన యాతాకుల మల్లయ్య, ఎకరానికి రూ. 20వేల చొప్పున నాలుగు ఎకరాలు కౌలు తీసుకుని వరి సాగు చేశాడు. ఇందుకోసం ఇప్పటికే రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టాడు. వర్షాలు లేకపోవడం, విద్యుత్ కోతలతో మూడు ఎకరాల్లో వరి పైరు పూర్తిగా ఎండిపోయింది. కనీసం మిగిలిన ఎకరాన్ని అయినా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
వారం కిందటి వరకు బోర్లలో నీటి లభ్యత బాగానే ఉన్నప్పటికీ, రోజుకు మూడు, నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా కాకపోవడంతో ఎకరం పైరు కూడా ఎండిపోవడం ప్రారంభమైంది. తీరా రెండు రోజులుగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ, భూగర్భజలాలు అడుగంటిపోయాయి. నీళ్లు ఉన్నప్పుడు కరెంట్ ఇవ్వక.. కరెంట్ వచ్చినప్పుడు నీళ్లు లేక పంట ఎండిపోవడంతో తట్టుకోలేకపోయిన మల్లయ్య, సోమవారం ఆవేదనతో ఎండిపోతున్న పంటకు నిప్పు పెట్టాడు. గమనించిన పక్క చేలల్లోని రైతులు వచ్చి మంటలను ఆర్పేశారు. కనీసం పశువుల మేతకైనా పనికొస్తుందని నచ్చజెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి.. నష్టపోయిన తమను ఆదుకోవాలని ఆ ప్రాంత రైతులు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇన్ఫోసిస్ రెండో క్యాంపస్ 30న పోచారంలో ప్రారంభం
యూనివర్సిటీ యూనిట్‌గా రిజర్వేషన్ల అమలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News