యూనివర్సిటీ యూనిట్‌గా రిజర్వేషన్ల అమలు
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:14 AM
ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ఏడు యూనివర్సిటీల్లో... అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి కార్యాచరణ సిద్ధమవుతోంది.
అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరణకు గ్రీవెన్స్, హెల్ప్‌లైన్
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై.. వీసీలు, రిజిస్ట్రార్‌ల సమావేశంలో నిర్ణయం
పారదర్శకంగా జరిపేందుకు కమిటీల ఏర్పాటు
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ఏడు యూనివర్సిటీల్లో... అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి కార్యాచరణ సిద్ధమవుతోంది. సోమవారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పలు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రిజిస్ర్టార్లు పాల్గొన్నారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు బాలకిస్టారెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో నోటిఫికేషన్ విడుదలకు ముందు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. గతంలో వర్సిటీల్లో నియామకాలకు శాఖల వారీగా రిజర్వేషన్ విధానం ఉండగా.. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు అనుగుణంగా ఈసారి యూనివర్సిటీ యూనిట్‌గా రిజర్వేషన్లు అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
రోస్టర్ ఖరారయ్యాక నోటిఫికేషన్ విడుదల చేయాలని యోగితారాణా ఆదేశించారు. అంతకుముందు మొత్తం ఖాళీలు, బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలు పంపాలని యూనివర్సిటీలను కోరారు. నియామకాలకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన మూడు జీవోలను కచ్చితంగా పాటించాలని, ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్‌వోపీ) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్సిటీ స్థాయిలో 30 మార్కులకు నిర్వహించే అభ్యర్థుల విద్యా సామర్థ్య పరీక్ష నిర్వహణ, పరిశీలనకు రెండు కమిటీలు వేయాలని సమావేశంలో నిర్ణయించారు.
మొత్తం నియామకాల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ఉన్నత స్థాయి కమిటీతోపాటు సాంకేతిక, మార్గదర్శకాలు-నిబంధనల అమలు కమిటీలనూ ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు లేవనెత్తే ప్రతీ సమస్య, అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని, వర్సిటీ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రస్థాయులో అంబుడ్స్‌మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వారం రోజుల్లో రోస్టర్ ఖరారు చేశాక సంబంధిత వర్సిటీలు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ నియామకాల ప్రక్రియకు ఐటీ సంస్థగా టీసీఎస్‌ను ఖరారు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇన్ఫోసిస్ రెండో క్యాంపస్ 30న పోచారంలో ప్రారంభం
ఫతేనగర్ గంజాయి కేసులో 65 మందికి పాజిటివ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News