Share News

ఫతేనగర్‌ గంజాయి కేసులో 65 మందికి పాజిటివ్‌

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:49 AM

హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో ఓ వృద్ధురాలి నుంచి గంజాయి కొనుగోలు చేసి.. ఈగల్‌ ఫోర్స్‌ పోలీసుల చేతికి చిక్కిన 70 మందిలో 65 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు.

ఫతేనగర్‌ గంజాయి కేసులో 65 మందికి పాజిటివ్‌
Fathenagar drug case

  • వారిలో ముగ్గురు మైనర్లు.. పరీక్షల్లో వెల్లడి

  • పునరావాస కేంద్రాలకు తరలింపు

  • గంజాయి విక్రయిస్తున్న వృద్ధురాలి అరెస్టు

  • పరారీలో మరో ఐదుగురు నిందితులు?

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో ఓ వృద్ధురాలి నుంచి గంజాయి కొనుగోలు చేసి.. ఈగల్‌ ఫోర్స్‌ పోలీసుల చేతికి చిక్కిన 70 మందిలో 65 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. వీరికి నిర్వహించిన వైద్య పరీక్షల ఫలితాలు సోమవారం వచ్చాయి. వీరందరిలోనూ గంజాయిలోని మత్తు కలిగించే పదార్థం టెట్రాహైడ్రోకానబినాల్‌ (టీఎచ్‌సీ) ఉన్నట్లు తేలిందని ఈగల్‌ ఫోర్స్‌ వెల్లడించింది. ఫతేనగర్‌లోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నగర్‌లో ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు.. శుక్రవారం రాత్రి 70 మందిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.


కాగా, ఆ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్న 75 ఏళ్ల షేక్‌ జతిన్‌బీ అనే వృద్ధురాలిని అరెస్టు చేశారు. గంజాయి విక్రయంలో ఆమెకు సహకరిస్తున్నట్లుగా భావిస్తున్న మరో ఐదుగురు అనుమానితులు పరారీలో ఉన్నట్లు ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన 65 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. వీరిలో 45 మందిని గాంధీ పునరావాస కేంద్రానికి, 15 మందిని ఆమన్‌గల్‌లోని కేంద్రానికి, మరో ఐదుగురిని కొత్తూరులోని కేంద్రానికి పంపించినట్లు వెల్లడిచారు.


మైనర్ల విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు, వారికి వ్యసన విముక్తి చికిత్స, పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగానికి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే ఈగల్‌ ఫోర్స్‌కు తెలియజేయాలని కోరారు. టోల్‌ఫ్రీ నంబర్‌ 1908 లేదా వాట్సాప్‌ నంబర్‌ 87126 71111 ద్వారా సమాచారం అందించవచ్చన్నారు. సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, విశ్వసనీయ సమాచారం అందించిన వారికి తగిన ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బీజేపీ ‘లోక్‌తంత్ర బచావో.. అరాచకత హఠావో’

చస్తేనే నిధులిస్తామంటే చచ్చిపోతా..!

నా పంట పోతే.. నేనే బాధ్యుణ్ని!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 04:55 AM