బీజేపీ ‘లోక్‌తంత్ర బచావో.. అరాచకత హఠావో’
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:29 AM
రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు.. ‘లోక్‌తంత్ర బచావో.. అరాచకత హఠావో’ నినాదంతో బీజేపీ వచ్చే నెల 2న ట్యాంక్‌బండ్ వద్ద మహా పాదయాత్ర నిర్వహించనుంది.
నవంబర్ 2న ట్యాంక్‌బండ్ వద్ద మహా పాదయాత్ర
హాజరు కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు.. ‘లోక్‌తంత్ర బచావో.. అరాచకత హఠావో’ నినాదంతో బీజేపీ వచ్చే నెల 2న ట్యాంక్‌బండ్ వద్ద మహా పాదయాత్ర నిర్వహించనుంది. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ప్రకటించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 300 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. 5వేలకు పైగా చెరువులు ఎండిపోయాయి. రాజధానిలో ట్యాంకర్‌ల ద్వారా ప్రజలు తాగునీరు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కరువు తీవ్రత ఇంత ఆందోళనకరంగా ఉంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీకి వెళ్లి ‘సర్’పై నిరసనలు తెలపడం విడ్డూరంగా ఉంది’’’ అని రాంచందర్‌రావు అన్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ముగింపు దశకు చేరినా, కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ‘‘మీ సొంతూరు కొండారెడ్డిపల్లికే వస్తా. టైం చెప్పండి. అర్హుల ఓట్లు ఎన్ని తొలగించారో నిరూపించండి’’ అని సీఎం రేవంత్‌కు రాంచందర్‌రావు సవాల్ చేశారు. రాహుల్‌ను ప్రధానిని చేస్తామన్న రేవంత్ ప్రకటనను జోక్‌గా అభివర్ణించారు. రాహుల్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 1182 నుంచి 660కి పడిపోయిందన్నారు. కాగా, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏ అవార్డు ఇచ్చినా మూడు రాష్ట్రాలు గౌరవించాలని రాంచందర్‌రావు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఎన్‌డీఎ్‌సఏ (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఎప్పుడూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తల్లిదండ్రులపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రాష్ట్ర హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్
కాలాపత్తర్ బాల్యవివాహం కేసులో నలుగురి అరెస్టు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News